
సిద్ధి వినాయక ఆలయంలో దీపికా పదుకోన్
ఎట్టకేలకు ‘పద్మావత్’ ఇవాళ రిలీజ్ అవుతోంది! అవనిస్తారా అని డౌట్. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికీ నిరసన కారుల విధ్వంసం కొనసాగుతూనే ఉంది. పిక్చర్ రిలీజ్ కావడానికి వీల్లేదని వాళ్లంతా హఠం పట్టారు. సెన్సార్ ఓకే చెప్పింది. సెన్సార్ చెప్పిన మార్పులకు నిర్మాతలు ఓకే చెప్పారు. మార్పుల తర్వాత ప్రివ్యూలు చూసినవాళ్లు ఒకే చెప్పారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఓకే చెప్పింది. అయినప్పటికీ సెంటిమెంట్స్ బలంగా పని చేస్తున్నాయి. ‘‘మా రాణిగారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ఉన్న పద్మావత్ విడుదల అవుతుంటే.. చూస్తూ కూర్చోడానికి మేమేమీ చేవ చచ్చిన వాళ్లం కాదు’ అని రాజ్‌పుత్‌లు అంటున్నారు. మంగళవారం నాడు మీడియా ప్రతినిధులు ‘పద్మావత్’ను చూసి వచ్చి, రివ్యూ రాశారు. ఈ కాల్పనిక చరిత్ర ‘చూడ్డానికి బాగుంది’ అని సమీక్షించారు. అయితే అసలు చూడ్డానికే ఆ సినిమాను వ్యతిరేకిస్తున్నవారు ఇష్టపడడం లేదు.
వాళ్ల వాదనను సమర్థిస్తున్న ఇతర రాష్ట్రాలవారు కూడా ‘మేము చూడం, చూడనివ్వం’ అని థియేటర్‌ల దగ్గర కాపుకాశారు. ఇంకోవైపు ‘పద్మావత్’ స్టార్ దీపికా పదుకోన్, దర్శకుడు భన్సాలీ గట్టి భద్రత నడుమ మాత్రమే బయటికి రాగలుగుతున్నారు. ప్రివ్యూలు వేసిన రోజు దీపికా పదుకోన్ ముంబైలోని సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు తీసుకుని వచ్చారు. ఆలయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు. పద్మావతిగా నటించినప్పటి నుంచి ఎక్కడా మాట్లాడే అవకాశమే ఆమెకు రావడం లేదు! ఇక ఆమె తరఫున సినిమానే మాట్లాడాలి.
Comments
Please login to add a commentAdd a comment