హైదరాబాద్‌లో ‘దిశ’ అత్యాచారం, హత్య తర్వాత దేశమంతా అట్టుడికి పోతుంటే ఢిల్లీలో ఒక అమ్మాయి చేతిలో ప్లకార్డ్‌తో మౌనంగా పార్లమెంట్ ముందు నిలబడింది. అది నచ్చని పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. వెళ్లకుండా మొండికేసిన ఆమెపై దౌర్జన్యం చేశారు కూడా! ఆమె పేరు అనూ దూబే. ఢిల్లీ వాసి. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? ‘దిశ’ ఘటనపై నిరసన వ్యక్తం చేయడమే. అదీ పార్లమెంట్ ముందు నిలబడి. ‘‘రేప్పొద్దున నేనూ రేప్‌కు, హత్యకు గురై దహనం కాదల్చుకోలేదు. ఇలాంటి సంఘటనల గురించి ఇక నేను వినదల్చుకోలేదు. దేశంలో ఎక్కడా రేప్ అనే మాట వినపడకూడదు. ప్రియాంకలా ఏ అమ్మాయీ బలికాకూడదు. చదువు కోసం, ఉద్యోగాల కోసం బయటకు వెళ్లాలి. తిరిగి రావడం ఏమాత్రం ఆలస్యమైనా ఇంట్లో వాళ్ల గుండె ఆగిపోతోంది. భయంతో బిక్కచచ్చిపోతున్నారు. మా అన్న అడుగుతున్నాడు.. ఎక్కడున్నావ్? అని.
ఇంటికొచ్చే వరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఉంటున్నాడు. బయటకు వెళ్లినప్పుడు లేట్ అవ్వొచ్చు. ఆలస్యం ఆడపిల్ల ప్రాణానికి ఖరీదు కాకూడదు కదా. మాన, ప్రాణాలకు హాని ఉంది ఆడపిల్లలంతా ఇంట్లో కూర్చోవాలా? ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్టే కదా ఈ వ్యవహారం. వ్యవస్థలో మార్పు రావాలి. మార్చాలి. నాకు రేప్ సంఘటనలు వినపడకూడదు. ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు. స్పందించాలి. అందుకే ప్లకార్డ్‌తో పార్లమెంట్ బయటనిలబడ్డా. చట్టాలు చేసే భవనం ముందు సైలెంట్‌గా ప్రొటెస్ట్ చేశా. పనిష్మంట్ ఇచ్చారు పోలీసులు’’ అని చెప్పింది అనూ దూబే. తన మీద పోలీసులు చేసిన జులుం గురించి ఢిల్లీ విమెన్ కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది అనూ. ఢిల్లీ విమెన్ కమిషన్ చైరపర్సన్ స్వాతి మాలివాల్ వెంటనే స్పందించారు.
జరిగిన నేరం గురించి నిరసన తెలిపితేనే పోలీసులు వేధించి, హింసిస్తే నేరాలను ఆపేదెవరు? జరగకుండా చూసేదెవరు?
Comments
Please login to add a commentAdd a comment