నెట్‌లో గత రెండు రోజులుగా ఎర్రటి రంగులో రక్త బిందువు ఒకటి కనిపిస్తోంది! రక్తం ఎర్రగానే కదా ఉంటుంది. ‘ఎర్రటి రంగులో రక్త బిందువు’ ఏమిటి? అసలది నీటి బిందువులా ఉంది. ఎర్రగా ఉంది కాబట్టి రక్త బిందువు అయింది. అందుకే.. ఎర్రటి రంగులోని రక్తబిందువు అనడం. అక్కడితో అయిపోలేదు. ఆ రక్త బిందువు వెనుకంతా లేత నీలం రంగులో ఉంది. బ్లడ్ డ్రాప్‌కి బ్యాక్‌డ్రాప్. రక్త బిందువు వెనుక నుంచి ముదురు నీలి రంగు తరగలు, కొన్ని నీటి బిందువులు, ‘నీటి నక్షత్రాలు’ మెల్లగా కిందికి రాలుతూ ఉంటాయి. ఇవన్నీ కలిపిన గ్రాఫిక్ ఇంటర్‌ఛేంజ్ ఫార్మాట్ (జిఫ్) రక్తబిందువు ఎమోజీ అది. పీరియడ్ ఎమోజీ! ‘ప్యాడ్ డేస్’లో ఉన్నాను అని ఫోన్‌లో సంకేత పరిచే ఎమోజీ.
‘ఇవాళ రాలేను’ అని ఆ రక్తబిందువు ఎమోజీని సెండ్ కొడితే అవతలి వాళ్లకు అర్థమైపోతుంది. ఫలానా పర్టిక్యులర్ కారణం వల్ల ఆఫీస్‌కో, గుడికో, ముందుగా అనుకున్నట్లు ఇంకో ప్లేస్‌కో రాలేకపోతున్నట్లు. ఆ ఎమోజీ లేకపోయినా విషయాన్ని ఏదో ఒక విధంగా ఇండికేట్ చెయ్యొచ్చు కానీ, అదొకటి ఇప్పుడు చేతి వేళ్ల కిందికి రాబోతోంది. మార్చిలో లాంచింగ్. ఆ తర్వాత మార్కెట్‌లోకి వచ్చే కొత్త ఫోన్‌ల ఎమోజీ లిస్టులో ఇది కూడా ఉంటుంది. పేరు.. పైన విన్నదే.. ‘పీరియడ్ ఎమోజీ’. బ్రిటన్‌లో ఆడపిల్లలు, వారి ఆరోగ్యం, నెలసరి పరిశుభ్రత.. ఇవన్నీ చూసేవాళ్లు కొందరు రెండు పీరియడ్ ఎమోజీలను పంపిస్తే, అమెరికాలో ఎమోజీలను డిజైన్ చేసేవాళ్లు ఈ రక్తబిందువును ఫైనల్ చేశారు.
వాళ్లు పంపిన రెండో ఎమోజీ.. రక్తం మరకలు ఉన్న తెలుపు రంగు అండర్‌వేర్. మరీ నేరుగా ఉంది కాబట్టి అండర్‌వేర్ ఎమోజీని పక్కన పెట్టేశారు అమెరికా వాళ్లు. మంచి నిర్ణయమే. అయితే మంచి నిర్ణయం కాదని అనిపించడానికి అవకాశం ఉన్నదేమిటంటే.. పీరియడ్స్‌కి ఇలా ఒక ‘ఇకీ’, ‘యుకీ’, ‘గిమ్మికీ’ ఎమోజీని క్రియేట్ చెయ్యడం! ఇకీ యుకీ గిమ్మికీ అంటే.. బీభత్స భయానకంగా. దీంతో ఇప్పుడు.. ఇదేమైనా సమ్‌థింగ్ సమ్‌థింగా నిశ్శబ్దాన్ని ఛేదించడానికి అనే వాయిస్ ట్విట్టర్‌లో అక్కడా వినిపిస్తోంది.
కొందరైతే.. ఇంతకన్నా ప్లెజెంట్ ఐడియాలు రాలేదా, ఎవరో మగవాళ్లే ఈ ఎమోజీని క్రియేట్ చేసి ఉంటారని విసుగ్గా ముఖాలు పెట్టేస్తున్నారు. మహిళల బిడియం తగ్గించడానికి, నెలసరిని ఒక నిత్యజీవిత సరళ వ్యక్తీకరణగా మార్చేయడానికీనట బ్రిటన్‌వాళ్లు, యు.ఎస్.వాళ్లు పీరియడ్ ఎమోజీని ఇన్వెంట్ చేశారు. పాయింట్‌లెస్ అనిపిస్తుంటే కనుక మీరు రైటే. లేదూ.. పాయింట్ ఉందనిపించినా కూడా మీరు రైటే. దీనిపై రెండు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి మరి!
Comments
Please login to add a commentAdd a comment