కర్మలను నాశనం చేసుకుంటేనే బంధవిముక్తి
అతి ప్రాచీనమైనదిగా, ఉత్తమోత్తమమైన మతంగా గుర్తింపు పొందినది జైనమతం. ఈ మతం ఎప్పుడు నెలకొల్పబడిందో ఇతమిత్థంగా తెలియనప్పటికీ, ఋగ్వేద మంత్రాలలో సైతం జైనమత వ్యవస్థాపకుడైన ఋషభుని గురించిన ప్రస్తావన ఉన్నదంటేనే ఆ మతం ఎంత ప్రాచీనమైనదో అర్థం చేసుకోవచ్చు. జైనమతానికి మొత్తం 24 తీర్థంకరులున్నారు. తీర్థంకరులు అంటే జీవన స్రవంతిని దాటడానికి వారథిని నిర్మించినవారు అని అర్థం.
వర్థమాన మహావీరుడు జ్ఞాత్రికా తెగకు చెందినవాడు. వైశాలి దగ్గరగల కుందగ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడాయన. యశోదతో ఈయన వివాహం జరిగింది. వారికి ప్రియదర్శన అనే కుమార్తె కలిగింది. ముప్పైసంవత్సరాల వయసులో వర్థమాన మహావీరుడికి జీవితంపై విరక్తి కలిగి, ఇల్లు వదిలి సన్యాసం స్వీకరించాడు. శరీరాన్ని కృశింపజేసే కఠోరమైన జైనమత ఆచార నియమాలు పాటిస్తూ సుమారు పుష్కరకాలంపాటు దేశ సంచారం చేశాడు. వర్థమానుడు దాదాపు సంవత్సరకాలంపాటు ఒక వస్త్రాన్ని ధరిచి, ఆ తర్వాత ఆ వస్త్రాన్ని కూడా విసర్జించి దిగంబరంగా జీవించాడు.
పన్నెండేళ్లపాటు రుజుపాలిక నదీతీరంలోగల జృంభిక గ్రామసమీపంలో ఒక సాలవృక్షం కింద కఠోర తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. కర్మకాండను, కులాధిక్యభావనను తిరస్కరించి పవిత్రమైన జీవితం గడపాలని బోధించాడు. ఈ ప్రపంచమంతా చేతన, అచేతన జీవులతో నిండి ఉందని,అంతేగాని, జాతి, కుల, మత, వర్ణ, లింగ వివక్షత పాటించడం అవివేకమన్నాడు. కర్మ ఆత్మను అంటిపెట్టుకుని ఉంటుందని, కామ, క్రోధ, లోభ మోహాదులు కర్మకు కారణాలని, కర్మల ఫలితాలను అనుభవించడం కోసమే ఆత్మ జన్మ, పునర్జన్మలను అనుభవించవలసి వస్తోంది. దీర్ఘ తపస్సు చేత, పూర్వార్జిత కర్మలను నాశనం చేసుకున్నప్పుడు జీవుడు బంధవిముక్తుడవుతాడని, కాబట్టి జనన మరణాల నుండి విముక్తి పొందడమే జీవిత లక్ష్యంగా భావించాలని బోధించాడు.
సల్లేఖన వ్రతం: జైనమత కఠోర నియమం సల్లేఖన వ్రతం. జైన సన్యాసులుగా దీక్ష స్వీకరించేవారు కఠిన నియమాలను పాటించవ లసి ఉంటుంది. ఏవిధమైన సాధనాలూ ఉపయోగించకుండా తలవెంట్రుకలను తనంతట తానుగా తొలగించుకోవడం, పరిమితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ తీక్షణమైన ఎండ వానలను లెక్కచేయకుండా కఠోర తపస్సులో నిమగ్నం కావడం జైనమత నియమాలు. అన్నింటికంటే చాలా కష్టతరమైనది సల్లేఖన వ్రతం. ఆహారం కాని, నీరు కానీ తీసుకోకుండా శరీరాన్ని శుష్కింపజేసుకోవడం సల్లేఖన వ్రతంలోని ప్రధానాంశం. సల్లేఖన వ్రతం ద్వారానే మోక్షానికి చేరువ కావచ్చునన్నది జైనమత విశ్వాసం.
జైనమతానికి 24వ తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడు ఆశ్వయుజమాసంలో అమావాస్యనాడు తన భౌతిక కాయాన్ని వదిలి నిర్యాణం చెందాడు. ఆయన నిర్యాణ సమయంలో దేవతలందరూ వచ్చి ఆయన చుట్టూ నిలిచారని, వారి శరీరాలనుండి వెలువడిన వెలుగు రేఖలతో అమావాస్య చీకట్లు తొలగి కాంతికిరణాలు వెలువడ్డాయని, అందుకు గుర్తుగానే జైనమతానుయాయులు దీపావళినాడు దీపాలు వెలిగిస్తారు.