దేవుళ్లలో తేడా ఏమీ ఉండదు. ఎక్కడున్నా దేవుడు దేవుడే! నేలమీద ఉన్నా కొండపైన ఉన్నా భగవంతుడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. కరుణా కటాక్షాలను అందిస్తాడు. అందుకోసమే భగవంతుని సేవించుకోవడానికి భక్తులు ఎంతో దూరాభారానికి, వ్యయప్రయాసలకూ ఓర్చి కొండలపైకెక్కి మరీ ఆయనను సందర్శింటారు. అలా ఎందుకు, దేవాలయం మన మధ్యలోనే ఉంటే ఎంతో బాగుంటుందనుకుంటారు చాలా మంది.
నిజానికి మనకు తనపై ఎంతటి భక్తి విశ్వాసాలు ఉన్నాయో తెలుసుకునేందుకే దేవుళ్లు కొండలపై, గుట్టలపై వెలిసినట్లు పెద్దలు చెబుతారు. అంతేకాదు, కొండలను, కోనలను ఉద్ధరించాలని స్వామికి ప్రేమ. అందుకే వాటిపై నివాసముంటాడు. తన పాదస్పర్శతో, భక్తుల పాదస్పర్శతో కొండలు తరిస్తాయి. సెలయేళ్లతో, ఫలవృక్షాలతో భక్తులకు సేదతీరుస్తాయి. దీని కోసమే రుషులు కొండలుగా పుట్టాలని కోరుకుంటారు. భద్రగిరి, యాదగిరి, వేదగిరి వీరంతా రుషులే! తపస్సు చేసి మరీ తమపై కొలువుండాలని కోరుకొని స్వామిని వరం కోరుకున్నారు.
ఈ లోకంలో పరోపకార పరాయణులు పర్వతాలు, నదులు, వృక్షాలేనని అంటాడు మహాకవి వాల్మీకి. ఈ ముగ్గురు ఉన్నంతవరకు రామాయణం భూమి మీద ఉంటుందని వాల్మీకికి బ్రహ్మ వరమిస్తాడు. అందుకే కొండలు, కోనలు భగవంతునికి ప్రీతిపాత్రమైనవి. అక్కడే ఆయన కొలువై ఉంటాడు. లౌకికంగా చూస్తే, కొండలపైన మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది, వాహనాల రణగొణ« ధ్వనులుండవు. కాలుష్యానికి ఆస్కారం ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. అందుకే దేవుడు కొండలపై వెలిశాడేమో మరి!
Comments
Please login to add a commentAdd a comment