ఎండ వేడిని సురక్షితంగా ఎదుర్కోవడం తెలుసా?
సెల్ఫ్ చెక్
ఎండ తీవ్రత ఎక్కువవుతోంది. నమోదవుతున్న ఉష్ణోగ్రత వివరాలు నిర్ధారణ చేస్తున్న ఈ పరిణామానికి కారణం పర్యావరణ సమతుల్యం దెబ్బతినడమే. ఎండకాలం వస్తుందంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఉన్న ఇంట్లో ఆందోళన మొదలవుతుంటుంది. ఈ వేసవిని ఎదుర్కోవడం ఎలా? ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఈ కాలాన్ని గడపగలమా? అని బెంగ కూడా ఉంటుంది. వేసవిని సంతోషంగా, ఆనందంగా ఆస్వాదించాలంటే మనకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. వాటిలో మీకు తెలిసినవెన్నో ఒకసారి చెక్ చేసుకోండి.
1. వేసవిలో నీటిఎద్దడిని ఎదుర్కోవడానికి, భూగర్భజలం తగ్గకుండా కాపాడుకోవడానికి ఇంటి ఆవరణలో నీరు ఇంకేటట్లు జాగ్రత్తలు తీసుకుంటారు.
ఎ.అవును బి. కాదు
2. ఇంటిని చల్లబరుచుకోవడానికి ఏసీ కంటే వట్టివేరు తడికలను కర్టెన్లుగా వేయడం మంచిదని తెలుసు.
ఎ.అవును బి. కాదు
3. ఇండోర్ ప్లాంట్లు ఇంటిని చల్లబరుస్తాయి. కాబట్టి ఈ కాలంలో తప్పనిసరిగా కొన్ని కుండీలను ఇంట్లో పెడతారు.
ఎ.అవును బి. కాదు
4. వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, బార్లీ వాడతారు.
ఎ.అవును బి. కాదు
5. సన్‌ట్యానింగ్ నుంచి రక్షణ కోసం చందనం, దోస గుజ్జు వంటి ఫేస్ ప్యాక్‌లను వేసుకుంటారు.
ఎ.అవును బి. కాదు
6. కర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తీసుకోవడం మంచిదని తెలుసు.
ఎ.అవును బి. కాదు
7. సీజన్‌లో ఫ్లవర్ వాజ్‌కు బదులుగా నీరు ఎక్కువగా పట్టే వెడల్పాటి ఫ్లవర్ బౌల్స్‌తో ఇంటిని అలంకరిస్తారు.
ఎ.అవును బి. కాదు
పై వాటిల్లో ఐదింటికి అవును అన్నది మీ సమాధానమైతే మీకు వేసవి జాగ్రత్తలపై మంచి అవగాహన ఉందని అర్థం.