చిత్తూరు: ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా? సూర్యుడు ప్రజలపై పగబట్టడా? అనేలా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. ఉదయం 10 గంటలకే జనం భానుడి ప్రకోపానికి బయటకు రాలేని దుస్థితి. తిరుపతి, చిత్తూరుతో పాటు ప్రధాన పట్టణాల్లో మధ్యాహ్నం అయితే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఫుట్‌పాత్ వ్యాపారులకు (చిరువ్యాపారులు) అవస్థలు తప్పడం లేదు. శీతలపానీయాలుకు గిరాకీ పెరిగింది. ఎండవేడికి విద్యార్థులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రభుత్వం శనివారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఏపీలో ఏప్రిల్ 23వతేదీ వరకు పాఠశాలలు నడపనున్నారు. మరోవైపు సాయంత్రం 5 గంటలకు కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోంది.
జిల్లావ్యాప్తంగా 45 మంది మృతి
వడదెబ్బతో ఏప్రిల్ 15నాటికి జిల్లావ్యాప్తంగా 45 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉపాధి కూలీలకు రక్షణ కరువు
మరోవైపు జిల్లావ్యాప్తంగా లక్ష మంది వరకు ఉపాధి కూలీ పనులు చేస్తున్నారు. ఎండలోనే పనిచేయాల్సి రావడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉపాధి కూలీలకు షామియానాలు, మంచినీటి సౌకర్యంతో పాటు వడదెబ్బకు గురైన వారికి తక్షణం వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇక నగరాలు, పట్టణాల్లో చలివేంద్రాలు విరివిగా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటనలిస్తున్నా క్షేత్రస్థాయిలో అవి కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
గత ఏడాది 162 మంది మృతి
గత ఏడాది వడదెబ్బకు 162 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మదనపల్లె డివిజన్‌లో 10 మంది, తిరుపతి డివిజన్‌లో 67, చిత్తూరు డివిజన్‌లో 85 మంది మరణించారు. ఈ ఏడాది ఏప్రిల్ 15 నాటికే 45 మంది మృతిచెందడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.