పెద్దలంతా కలిసి ముహూర్తం పెట్టారు. శుభముహూర్తం అని భర్త తరుఫు వాళ్లు అన్నారు. ఇటు పక్కవాళ్లు నోరు మూసుకున్నారు. ఎవరికి ఎవరూ ఈ పాపంలో తక్కువ కాదు. ఇవ్వడమే రెండవ పెళ్లి వాడికిచ్చి చేశారు. చేసినప్పటి నుంచి ‘ఇంకెన్నాళ్లు ఆగాలి... ఇంకెన్నాళ్లు ఆగాలి’ అని అతగాడి గోల. ముప్పై ఏళ్లుంటాయి. ఆ మాత్రం గోల చేయడం సహజమే. కాని పిల్ల సంగతో? పదకొండేళ్లేనాయే. ఇంకా పెద్దమనిషైనా కాకపాయే. ‘రేపో మాపో అవుతుందని అబద్ధం చెప్పారు. ఇలాగైతే మేం ఇంకో అమ్మాయిని చూసుకుంటాం’ అని కబురు పెట్టాడు అతడు. అంటే మూడో పెళ్లన్నమాట. అమ్మో అదే జరిగితే ఇంకేమైనా ఉందా? వెంటనే ఈవైపు వారు ఉత్తరం రాశారు– అమ్మాయి పెద్దదయ్యింది అని. అంటే ఏమిటో అమ్మాయికి తెలియదు.
వెంటనే ముహూర్తం పెట్టుకోండి అని రాశారు. దేనికి పెడతారో తెలియదు. ఆడుకునే వయసు. ఇంట్లో ఉన్న గన్నెరు మొక్కా, దానిమ్మ చెట్టు దోస్తులు. ఊర్లోని పసిపాపలు నేస్తులు. ఆ వీచేగాలి ఆత్మీయురాలు. ఈ చిన్న మబ్బుతునక దగ్గరి చుట్టం. మధ్యాహ్నం పిలిచి గదిలో ఉన్న మీ ఆయనకు కాఫీ ఇచ్చిరా అని పంపారు. గదిలోకి వెళ్లింది. తిరిగి వచ్చింది. వెళ్లే ముందు అమ్మాయి తిరిగి వచ్చిన అమ్మాయి ఒకటి కాదు. ఆ అమ్మాయి చచ్చిపోయింది. శుభ్రమైన అమ్మాయి, ఎప్పుడూ శుభ్రంగా స్నానం చేసి రెండు జడలు వేసుకొని పొడి బట్టలు వేసుకుని ఉండే అమ్మాయి, ఊళ్లో ఏ పిల్లాడైనా మురికిగా ఉంటే నూతి దగ్గరకు తీసుకెళ్లి స్నానం చేయించి ఒళ్లు తుడిచి ఎత్తుకుని ముద్దు చేసే అమ్మాయి, స్కూలు మాస్టరు చనువుగా జబ్బ మీద చేయి వేస్తే... ఛీ నన్ను తాకకు చీదర అని చేయి కొరికి పరిగెత్తిన అమ్మాయి, అప్పుడప్పుడు ఇంటికొచ్చే బంధువు ఎవరూ లేనప్పుడు ఎద మీద చేయి వేస్తే రోషంతో పౌరుషంతో ముఖమంతా ఎర్రగా చేసుకొని వాడి అంతు చూడవలసిందిగా అమ్మకు మొర పెట్టుకున్న అమ్మాయి, అతి పావనమైన అమ్మాయి, పాల వంటి అమ్మాయి చచ్చిపోయింది.
వాడు ఒక మాట మాట్లాడలేదు. వాడు ఒక ఊరడింపు చేయలేదు. వాడు ఏం జరగబోతుందో చెప్పలేదు. వాడు ఏం చేయబోతున్నాడో చెప్పలేదు. హటాత్తుగా గది చీకటి చేసి కంబళి ముఖాన కప్పి తోడు ముక్కూ నోరూ కూడా మూసేస్తే ఎలా ఉంటుందో అలా మీద పడ్డాడు. పులి దయాళువు. లిప్తలో చంపుతుంది. వీడు మగవాడు... మధ్యాహ్నం అంతా తింటూనే ఉన్నాడు. రాత్రి కూడా తింటానన్నాడు. అలా ఒకరోజు కాదట. రోజూనట. ఇంటికి తీసుకెళతాడట. ‘వెళ్లాలమ్మా’ అంది అమ్మ. ‘వెళ్లకపోతే నాలుగు తగిలిస్తా’ అన్నాడు తాతయ్య. ‘వెళ్లవే ముండా’ అని తిట్టింది ఇల్లు పట్టిన మేనత్త. అయ్యో. ఎందుకిలా. ఎందుకు? ఈ శరీరం నాది కాదా... దీని మీద నాకు హక్కు లేదా? క్షవరం చేస్తూ మంగలి నొప్పి పుట్టించాడని తన్నబోయావే తాతయ్యా... ఈ నొప్పి నీకు తెలియదా. దీనికి నీకు పట్టింపు లేదా. ఈ నొప్పి నేను పడవలసిందేనా. నొప్పి... చచ్చిపోతాను బాబోయ్ నొప్పి. ‘మొదటిది నయం. సన్నగా, బలహీనంగా ఉన్నా ఒప్పుకునేది.
నీలా పెంకితనం పోయేది కాదు’ అన్నాడు భర్త. తాను కూడా అలా సన్నగా బలహీనంగా అయ్యి చచ్చిపోతుందా? ఊరంతా అతణ్ణి మంచివాడంటుంది. ఇంటికొచ్చినవాళ్లు మంచివాడంటూ దీవించి వెళుతుంటారు. ఊరికి మంచిగా కనిపించే భర్త గదిలో భార్యకు కూడా మంచిగా కనిపించాలి. అప్పుడే వాడు మంచివాడు. ఈ సంగతి ఎవరు చెప్పాలి... ఎవరు? ‘పారిపో తల్లీ... ఈ ఇంట్లో ఉంటే బతకవు’ అన్నాడు చాకలి. పారిపోయింది. వదలుతారా? వెతికి వెతికి పట్టారు. పోలీసులు వచ్చి తీసుకెళ్లి మొగునికి అప్పజెప్పారు. ‘నాకీ పెళ్లీ వద్దు ఏమీ వద్దు... భోగం బతుకు బతుకుతాను’ అని మొండికేసింది. ఊళ్లో వాళ్లందరూ ఇది విని అసహ్యించుకున్నారు. సంసారి అనవలసిన మాటలేనా ఇవి? దౌర్భాగ్యుల్లారా... వాడు చేస్తున్నది సంసారమేనా అని అడగరేం. అప్పటికీ పతనమైంది. అతణ్ణి మంచి చేసుకుందామని అతని కోసం పాడుపనులన్నీ చేసింది. చేసే కొద్దీ మలినపడుతున్న భావన.
మరీ మరీ పతనమవుతున్న వేదన. ఎంత వయసని? పద్నాలుగేళ్లు. ఈలోపే ఒక జీవితానికి సరిపడా రాపిడి చూసింది. దేహాన్ని జన్మకు సరిపడా వొరిపిడి పెట్టింది. మనసు శిథిలమయ్యింది. ఆత్మ నాశము కోరుతోంది. అదిగో గోదారి తల్లి. ఈ రాత్రి చల్లగా మెల్లగా దయగా ప్రవహిస్తున్న తల్లి. ఈ తల్లి తనను కడిగేయాలి. ఈ మలినపడ్డ దేహాన్ని కడిగేయాలి. భయం వేయట్లేదు దానిని చూస్తుంటే. ముంచేస్తుందా? ఊపిరాడకుండా చేసేస్తుందా? లేదు లేదు... దగ్గరకు తీసుకుని తనతో పాటు ఏడుస్తుంది కాబోలు. కన్నీరు కారుస్తుంది కాబోలు. వస్తున్నా తల్లీ. ఆగు. కథ ముగిసింది. చలం రాసిన ‘భార్య’ కథ ఇది.
చిత్తూరు జిల్లాలో గది నుంచి బయటికొచ్చి నేను లోపలికి వెళ్లను అన్న వధువును బలవంతంగా లోపలికి పంపితే ఏమయ్యిందో ఆ భర్త ఉంగరాల వేళ్లతో ఆమెను ఎలా హింసించాడో వార్తల్లో చూశాం. ఎన్నేళ్లకు పెళ్లి చేయాలి... పెళ్లికి ముందు ఎలాంటి అవగాహన కలిగించాలి... మొదటి రాత్రికి అమ్మాయి, అబ్బాయిని ఎలా సిద్ధం చేయాలి, అబ్బాయి ప్రవర్తన ఎలా ఉండాలి... అమ్మాయికి ధైర్యం ఎలా ఇవ్వాలి... ఇవన్నీ ఆలోచించే చైతన్యం మనలో ఉందా? వాటికవే అయిపోతాయని అయిపోవాలని మన భావన. ప్రతాపం చూపాలనుకునే మగవాళ్లు ఇచ్చే పీడకలలు జీవితాంతం మిగులుస్తున్న మానసిక వ్యాధుల గురించి ఆలోచిస్తున్నామా. చలం ఈ విషయం మీద 1924లోనే మొత్తుకున్నాడు. స్త్రీ దేహం మీద హక్కు స్త్రీదే అని అంగీకరించి మానసికంగా శారీరకంగా ఆమె సిద్ధమైనప్పుడు పెట్టేదే శుభ ముహూర్తం. అది వినా తక్కినవన్నీ దుర్ముహూర్తాలే.
Comments
Please login to add a commentAdd a comment