క్రేజీయింగ్... డీజేయింగ్ | DJ Profession is very Crazy these days | Sakshi
Sakshi News home page

క్రేజీయింగ్... డీజేయింగ్

Published Thu, Aug 8 2013 11:05 PM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

క్రేజీయింగ్... డీజేయింగ్

క్రేజీయింగ్... డీజేయింగ్

 ఎంతో పెద్దపార్టీ. పిల్లవాళ్లు, కుర్రవాళ్ళు, ముసలివాళ్ళు... ఇలా అన్ని తరాలవాళ్ళు ఉన్న పార్టీ అది. అయినా ఉసూరుమన్నట్టు అందరూ ఏదో ‘ఉన్నాం అంటే ఉన్నాం’ అన్నట్టు కదులుతున్నారు. అప్పుడొస్తాడతను... జారిపోయేలా ఉండే లోవెయిస్ట్ జీన్స్, మోకాళ్ల వరకు ఉన్న హిప్ హాప్ టీషర్ట్ వేసుకుని, తలమీద హిప్‌హాట్ క్యాప్‌తో! తన టర్నబుల్ మీద చేయి పెట్టి, ఏదో యుద్ధం ముందు శంఖారావంలా అని దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తాడు. అంతే, వయసుతో సంబంధం లేకుండా వెన్నులో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఒంటినిండా సంగీత వైరస్ ప్రవేశిస్తుంది. ఎంతటివారికైనా మనసు నిలవనీయదు. కాలు కదలకుండా ఉండలేదు. వెంటనే వచ్చేస్తారంతా, పూనకం వచ్చినట్టు నర్తించడానికి! ఇలా మూస మనుషుల మధ్య సంగీత ప్రకంపనలు సృష్టించేవాడే ‘డిస్కో జాకీ’... షార్ట్‌గా డీజె.
 
 వచ్చినతను ఊరికే ఉండడు. అతని కనుచూపుమేరలో ఉండేవాళ్ళంతా కదులుతూనే ఉండాలి. కుదురుగా ఉంటే నచ్చదు. చీకటిగా ఉండే పబ్ అయినా, చిర్రుమని ఎండలోని గణేష్ నిమజ్జనం అయినా, వర్షాకాలపు ఒక సాయంత్రం అయినా, శ్రావణమాసపు సంగీతం అయినా ఇతను రావలసిందే. అందరూ ఓ మాదిరి మైఖేల్ జాక్సన్‌లుగా మారాల్సిందే. అందరూ ఇతని మిక్సర్ మధువులో మునగాల్సిందే... అలసిపోయాక కొత్త శక్తిని నింపుకోవాల్సిందే.
 
 డీజేయింగ్ అంటే...
 ఒక కల: చెవిలో హెడ్‌సెట్, చేతిలో టర్నబుల్స్ ఉంటే సరిపోదు. బుర్రలో తను ఏం ప్లే చేయబోతున్నాడో ముందే ఫాస్ట్‌ఫార్వర్డ్‌లో వేసేయాలి. అక్కడికి వచ్చిన క్రౌడ్ అభిరుచిని అర్థం చేసుకోవాలి. దాన్నిబట్టి తన మస్తిష్కంలో చిక్కుకున్న మ్యూజిక్ మ్యాచ్‌కి విముక్తి కల్పించాలి. ఏ పాట ప్లే చేయాలి? ఎలా ప్లే చేయాలి? ఎంతసేపు ప్లే చేయాలి? అన్నది ముందే కల కనేయాలి... ఆ టాలెంట్ ఉంటే చాలు... క్లబ్‌నైట్స్, పార్టీస్, ఫ్యాషన్ ఈవెంట్స్, టీవీ షోస్, ప్రతిచోటా మీ పాటే మోగుతుంది. డిమాండ్‌కి డిమాండ్, డబ్బుకి డబ్బు, పేరుకి పేరు... ఒక మంచి ఈవెంట్‌లో లోకల్ సెలబ్రిటీగా మారిపోవచ్చు.
 
 ఓ కళ:‘ఎక్కువమందికి తెలియనిది ఏమిటంటే... డీజేయింగ్ అనేది కూడా ఒక కళే’ అంటారు ప్రముఖ డీజే మైఖేల్ చిన్నప్ప. ఫోటోగ్రఫీలానే డీజేయింగ్ కూడా అందాలను క్యాప్చర్ చేసే కళ... మనం చూసే కళ్ళకి నచ్చినట్టే మన చెవులకి వినసొంపుగా ఉండే పాటలోని అందాన్ని పట్టి, ఇలా రెండు మూడు ‘అందాలని’ ఒక దాని తర్వాత ఒకదానిని నేర్పుగా ప్లే చేయడమే డీజేయింగ్. ప్లే చెయ్యాల్సిన డ్యూరేషన్ ఎంత ముఖ్యమో, పాట నుండి పాటకి ట్రాన్స్‌ఫార్మేషన్ కూడా అంతే ముఖ్యం... డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ మూడ్, ఎనర్జీ ఏమాత్రం చెడకుండా మిక్సింగ్ అనేది ఉండాలి. ఈవెంట్స్, పార్టీసే కాక ఈ మధ్య ఝ్చటజిఠఞ అని కొత్తగా వస్తున్నాయి. ఒక సినిమాలో పాటలన్నీ, లేకపోతే ఆ సంవత్సరానికి వచ్చిన టాప్ సాంగ్స్ అన్నీ కలిపి ఒక కొత్త ఆడియోలా చేస్తారు. జీరో అవర్ మ్యాషప్, ఆషిగీ-2 మ్యాషప్, వాలెంటైన్ మ్యాషప్... ఇలా ఎన్నోరకాల మ్యాషప్‌లు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తూ, డీజేలకి క్రేజ్ తెచ్చి పెడుతున్నాయి.
 
 ఒక కల్ల: చిమ్మ చీకటిలో మిలమిల మెరిసే వెలుగుల జీవితం డీజేయింగ్ అంటే! పనికి టైమింగ్ అంటూ ఉండదు. అర్ధరాత్రులు కూడా పని చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు దీంతో రెస్ట్‌లెస్‌నెస్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అంతేకాక ఈ మధ్య పాశ్చాత్య సంస్కృతి పైత్యం పెరగడంతో చాలావరకు క్లబ్‌లు, పబ్‌లలో మాదకద్రవ్యాల వాడకం విస్తృతంగా ఉంది. ఈ ఉచ్చు పడే అవకాశం ఎక్కువ. అటువంటి ప్రలోభాలకు లొంగకుండా, సమస్యలకు జడవకుండా ఉంటే వృత్తిపరంగా, ఆర్థికంగా, పాషన్‌పరంగా ఎంతో మెరుగయినది ‘డిస్కో జాకీయింగ్!’
 
 - జాయ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement