నా వయసు 29 ఏళ్లు. నేను చాలాకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. స్వాభావికంగానే ఇది తగ్గే మార్గం చెప్పండి.
మలబద్దకం ఉన్నవారిలో మలవిసర్జన అరుదుగా జరుగుతుంది. అప్పుడప్పుడూ మలబద్దకం రావడం చాలామందిలో కనిపించేదే. అయితే కొందరిలో ఈ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇది వారి దైనందిన కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతూ ఉంటుంది. పైగా దీర్ఘకాలిక మలబద్దకం ఉన్న వారు మలవిసర్జన సమయంలో చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మలబద్దకానికి అసలు కారణం తెలిస్తే దానికి అనుగుణమైన చికిత్స కానీ, జాగ్రత్తలు కానీ పాటిస్తే అది తగ్గిపోతుంది. ఉదాహరణకు కొంతమంది పీచు అంతగా లేని ఆహారం అంటే నిత్యం మాంసాహారం తింటూ ఉన్నప్పుడు, వారిలో పీచు ఉన్న ఆహారాన్ని కూడా తీసుకునేలా చేస్తే మలబద్దకం తగ్గుతుంది. అయితే కొన్నిసార్లు మలబద్దకానికి అసలు కారణం తెలియకపోవచ్చు. కొందరిలో చిన్నతనంలో మలవిసర్జన శిక్షణ (గుడ్ శానిటరీ హ్యాబిట్స్) సరిగా లేకపోవడం వల్ల కూడా వారి యుక్తవయసులో దీర్ఘకాలిక మలబద్దకం రావచ్చు.
మలబద్దకం ఉన్నట్లుగా గుర్తించే లక్షణాలివి:
సాధారణం కంటే తక్కువ సార్లు మలవిసర్జనకు వెళ్లడం గడ్డలుగా లేక గట్టిగా ఉండే మలం మలవిసర్జన కోసం బాగా ముక్కాల్సి రావడం మలవిసర్జన ద్వారం వద్ద ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండి, అది మలవిసర్జన జరగకుండా ఆపుతున్నట్లుగా అనిపించడం మలవిసర్జనకు చాలా సమయం పట్టడం పొత్తికడుపును చేతులతో నొక్కాల్సి రావడం, కొన్నిసార్లు మలం బయటకు రావడానికి వేళ్లను ఉపయోగించాల్సి రావడం ∙ఒక్కోసారి మలం ఎంతకూ బయటకురాకపోవడంతో అది అక్కడ గట్టిపడి, ఎండిపోయి మరింత సమస్యాత్మకంగా మారడం వంటి ఇబ్బందులు కలుగుతాయి.
మలబద్దకం నుంచి విముక్తి కోసం పాటించాల్సిన జాగ్రత్తలు:
మలవిసర్జన ఫీలింగ్ కలిగినప్పుడు దాన్ని ఆపుకోకండి. టాయిలెట్‌లో గడపాల్సినంత సేపు గడపండి. ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా, తొందరపడకుండా మల విసర్జనకు కావాల్సినంత సమయం కేటాయించండి.
నీరు ఎక్కువగా తాగండి. దాంతో పాటు ద్రవాహారం ఎక్కువగా తీసుకోండి. మీ వైద్యుడు / డైటీషియన్ చెప్పినట్లుగా ఆహారంలో మార్పులు చేసుకోండి. మీ ఆహారంలో పీచు పదార్థాలు, పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పొట్టుతో ఉండే ముడి ధాన్యాల్లో పీచు ఎక్కువ. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. పాల ఉత్పత్తులు, మాంసాహారాలను చాలా పరిమితంగా తీసుకోండి. రోజులో మూడు సార్లు కాకుండా కొంచెం కొంచెం మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. కొద్దికొద్దిమోతాదుల్లో రోజులో 5 లేదా 6 సార్లు తినండి. రాత్రి భోజనం సమయంలో తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు వీలుగా నిద్రకు ఉపక్రమించడానికి కనీసం 3 లేదా 4 గంటల ముందే తినండి. పొగతాగే అలవాటును పూర్తిగా మానేయండి. మద్యాన్ని వదిలిపెట్టడం. కాఫీ/కెఫిన్ ఉండే ద్రవపదార్థాలకు దూరంగా ఉండండి. చ్యూయింగ్ గమ్ నమలకండి. రోజూ వ్యాయామం చేయండి. శారీరక కదలికల వల్ల పేగులు కూడా కదిలి మలబద్దకం నివారితమవ్వడమే కాకుండా, ఆరోగ్యపరంగా ఇతరత్రా చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
మీ టాయ్‌లెట్ సీట్ ఇలా ఉంటే మేలు
భారతీయ టాయెలెట్లు మలబద్దకం ఉన్న వారికి ఒకింత మేలు చేస్తాయి. అయితే ఒకవేళ మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కారణాల వల్ల వెస్ట్రన్ టాయెలెట్లనే వాడాల్సి వస్తే కాళ్ల కింద ఒక పీట ఉంచుకొని ఈ కింద బొమ్మలోలా మీ శరీర భంగిమ ఉండేలా చూసుకోండి. మలబద్దకం నివారణకు ఇది కూడా చాలావరకు తోడ్పడుతుంది.
ఫ్యాటీ లివర్ ఉందిజాగ్రత్తలేమిటి?
నా వయసు 56 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
మన కాలేయం కొవ్వు పదార్థాలను గ్రహించి అవి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంది. అయితే కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వుపదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది చాలా సంక్లిష్టమైన జీవక్రియల్లో ఒకటి. అందువల్ల ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు.
మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ∙మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ∙ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి తరచూ చేపమాంసాన్ని అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది. మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment