
పిల్లల్ని ఇష్టంగా పెంచుకుంటున్నారా?
సెల్ఫ్ చెక్
‘‘మా పిల్లలు సరిగా ఎదగడంలేదండీ... ఎంత చెప్పినా చదువు రావటం లేదు. చిరుతిళ్లేగాని ఒక్క మెతుకు ముట్టరు’’... ఇలా పిల్లల పెరుగుదల, చదువు విషయంలో తల్లడిల్లిపోతుంటారు కొందరు మాతృమూర్తులు. మీరూ అలాంటి అమ్మే అయితే తల్లిగా మీ బాధ్యతలను సరిగా నిర్వహిస్తున్నారా లేదా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి.
1. భరించరాని సమస్యలు ఉన్నప్పుడు పిల్లలను వదిలి దూరంగా వెళ్లిపోవటం సమంజసమే అనుకుంటారు.
ఎ. కాదు బి. అవును
2. స్త్రీకి సహనం ఎక్కువ. పిల్లలను తండ్రి కంటే తల్లే ఎక్కువగా చూసుకోవాలి.
ఎ. అవును బి. కాదు
3. పిల్లల దృష్టిలో తల్లి తమ విషయాలన్నింటిని (మార్కులు, మెడల్స్, దుస్తులు) బాగా గుర్తుంచుకుంటుంది.
ఎ. అవును బి. కాదు
4. పిల్లలు తప్పుచేసినప్పుడు దండించినా, వెంటనే అక్కున చేర్చుకుంటారు.
ఎ. అవును బి. కాదు
5. మీరు బిజీగా ఉన్నా పిల్లల చదువు, కెరీర్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తారు.
ఎ. అవును బి. కాదు
6. పిల్లల్ని కనాలని ఉన్నా వారి పోషణ, పెంపకం గురించి భయపడుతున్నారు.
ఎ. కాదు బి. అవును
7. పిల్లలు బలంగా, ఆరోగ్యంగా ఎదగటానికి ఆహార, ఆరోగ్య విషయాలపై పరిపూర్ణ శ్రద్ధ తీసుకుంటారు.
ఎ. అవును బి. కాదు
8. పిల్లలతో కలసి ఆటలాడటమంటే మీకు చిరాకు.
ఎ. కాదు బి. అవును
9. పిల్లల చిన్ననాటి గుర్తులను అపురూపంగా చూసుకుంటారు, భద్రపరుస్తారు.
ఎ. అవును బి. కాదు
10. పిల్లలకు అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీరు మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు. పిల్లలను ఎలా పెంచాలో మీకు బాగా తెలుసు. మీ ప్రేమను పిల్లలపై చూపిస్తూనే వారిని క్రమశిక్షణలో పెట్టటానికి ప్రయత్నిస్తారు. ‘బి’ సమాధానాలు 7 దాటితే మీరు తల్లిగా ఇంకా బాగా అవగాహన పెంచుకోవాలని సూచన. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. మానసికంగా, శారీరకంగా ఎదుగుతున్న పిల్లలకు అండగా ఉండటానికి ప్రయత్నించాలి.