అంతసేపు కూర్చుంటే... టైంబాంబే! | don't seat in more hours on seats | Sakshi
Sakshi News home page

అంతసేపు కూర్చుంటే... టైంబాంబే!

Published Wed, Jul 19 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

అంతసేపు కూర్చుంటే... టైంబాంబే!

అంతసేపు కూర్చుంటే... టైంబాంబే!

ఊరికే అటూ ఇటూ పరుగెత్తకుండా నిమ్మళంగా కూర్చోరా ఒకప్పుడు బామ్మా... ఆ తర్వాత నాన్నా మనకు చెప్పిన విషయం.  మా అమ్మాయికేమండీ! హ్యాపీగా వెళ్లి కడుపులో చల్లకదలకుండా ఏసీ రూములో కూర్చొని ఉద్యోగం చేస్తుంది.. ఈ మాట  అమ్మ పదిమందికీ చెప్పడం ఒకప్పుడు ముచ్చటగా అనిపించేది.  ఇప్పుడు ఆ కూర్చోవడమే ఆరోగ్యాన్ని కుదేలయ్యేలా చేస్తోంది.  జాగ్రత్త పడండి...  అదర్‌వైజ్‌...  యు ఆర్‌ సిట్టింగ్‌ ఆన్‌ ఎ టైంబాంబ్‌!

పనిచేసే తీరుతెన్నులు మారాయి. వృత్తులేవైనా వాటిల్లో కూర్చొని చేసేవే ఎక్కువ. కూర్చొని చేసే వృత్తులు గతంలోనూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కంప్యూటర్‌ ఆవిర్భావం తర్వాత పని అంటే కుర్చీకి అంటిపెట్టుకోవడంగా మారిపోయింది. ఒళ్లు కదులుతూ పనిచేయాల్సిన యువత కదలకుండా కుర్చీకి అతుక్కుపోతున్నారు. ఆరోగ్యాన్ని చిత్తుచేసుకుంటున్నారు.

ఆసనంపై అనర్థాల ముళ్లు
కుర్చీలకు అంటిపెట్టుకుని పనిచేస్తుండటం వల్ల వచ్చే సమస్యల్లో మొదటిది స్థూలకాయం.  అది అనేక ఇతర వ్యాధులకు దారితీసే ప్రాథమిక వ్యాధి. ఆ కారణంగా రక్తపు ఒత్తిడి పెరగడంతో అధిక రక్తపోటు వస్తుంది. అది డయాబెటిస్‌ అనే ముప్పును తెచ్చే అంశం కూడా. (అంటే రిస్క్‌ ఫ్యాక్టర్‌ అన్నమాట). దీనికి స్మోకింగ్‌ తోడైతే గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. ఇక అదేపనిగా కూర్చోవడం వల్ల వచ్చే సమస్య... కాలి రక్తనాళాల్లో కదలికలు తగ్గడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టే అవకాశాలుంటాయి. కాలి రక్తనాళాల కవాటాలు బలహీనం అవుతాయి. దాంతో అక్కడ గడ్డకట్టిన బ్లడ్‌క్లాట్స్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దీనిని పల్మునరీ ఎంబాలిజం అంటారు. ఇది ప్రమాదకరమైన పరిణామం.
     
అతిగా కూర్చోవడం వల్ల నిద్రకు సంబంధించిన సమస్యలు (స్లీప్‌ డిజార్డర్స్‌) వస్తాయి. వీటిల్లో ప్రధానంగా నిద్రపట్టకుండా ఉండే రుగ్మత ఇన్‌సామ్నియా, మాటిమాటికీ నిద్రాభంగం అయ్యే డిస్టర్బ్‌డ్‌ స్లీప్‌ పాటర్న్స్, గురకతో  ఆక్సిజన్‌ అందని స్లీప్‌ ఆప్నియా వంటి వ్యాధులు వస్తాయి. వీటి కారణంగా మెదడుకు, గుండెకు తగినంత రక్తం అందక అది గుండెపోటు లేదా పక్షవాతం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. అలాగే కూర్చొని పనిచేసే కంప్యూటర్‌ ఆధారిత ఉద్యోగుల్లో కేవలం వేళ్లకదలికలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా కార్పెల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ వంటివి రావచ్చు.

మణికట్టు వద్ద ఉండే ఎముకలన్నీ ఒక వృత్తాకారం ఏర్పడేలా అమరి ఉండి... వాటి మధ్య నుంచి నరాలు అరచేతిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి... మణికట్టు ఎముకల అమరికను టన్నెల్‌గా పేర్కొనడం వల్ల దీన్ని కార్పల్‌ టన్నెల్‌ సిండ్రోమ్‌ అంటారు. ఇందులో నరాలను ఎముకలు నొక్కేచడం వల్ల అరచేతి నొప్పులు, వేళ్లకు రక్తం అందక తిమ్మిర్లు పట్టడం వంటి పరిణామాలూ రావచ్చు. అదేపనిగా కూర్చోవడం వల్ల నడుము నుంచి కాళ్ల వరకు వెళ్లే అతిపెద్ద నరం అయిన సయాటికా నొక్కుకుపోయి సయాటికా వ్యాధికి దారితీయవచ్చు. అలాగే మెడనొప్పులూ వస్తాయి.

కంప్యూటర్‌ స్క్రీన్‌ను అదేపనిగా చూస్తుండటం వల్ల కంటిలోని తేమ తగ్గి  కంటి సమస్యలు రావచ్చు. అంతేకాదు... మానసిక సమస్యలైన యాంగై్జటీ, డిప్రెషన్, ఆత్మహత్యాధోరణులు (సూయిసైడల్‌ టెండెన్సీస్‌) కనిపించవచ్చు. తేలిగ్గా మాదకద్రవ్యాలకు అలవాటు పడటం (డ్రగ్‌ అబ్యూజ్‌), స్మోకింగ్, ఆల్కహాల్‌కు అలవాటు పడటం వంటి సమస్యలు సైతం కొందరిలో కనిపిస్తాయి. ఇక సామాజిక సమస్యలూ, వైవాహిక బంధంలో ఇబ్బందులు సైతం మామూలే.

అధిగమించడం ఇలా...
కూర్చొని పనిచేసే ఉద్యోగాల వల్ల వచ్చే ఆరోగ్య అనర్థాలను అధిగమించడానికి అనుసరించాల్సిన సూచనలివి...  మంచి పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. అంటే అన్ని రకాల పోషకాలతోపాటు విటమిన్లు, మినరల్స్‌ సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ముదురు ఆకుపచ్చరంగులో ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు  ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

►జంక్‌ఫుడ్, వేపుళ్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు.
►ఆల్కహాల్‌నుంచి పూర్తిగా దూరంగా ఉండటమే మేలు.
►నిద్రపోవడానికి రెండు గంటల ముందే రాత్రిభోజనం పూర్తి చేయాలి. నిద్రకు కనీసం మూడు గంటల ముందునుంచే కాఫీ, టీ, ఆల్కహాల్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.
►నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచి కంప్యూటర్లు, ట్యాబ్స్, మొబైల్‌ఫోన్స్, టీవీ వంటి అన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉపయోగం నుంచి దూరంగా ఉండాలి.
►రోజూ క్రమం తప్పకుండా ధ్యానం, యోగా వంటివి చేయడం మంచిదే.
 ►ఇక ఆఫీస్‌లో కంప్యూటర్‌ ముందు పనిచేసేవారు ప్రతి రెండు గంటలకొకసారి కనీసం పది నిమిషాలు బ్రేక్‌ తీసుకొని అటు ఇటు నడవాలి.
►ఆఫీస్‌లో ఉండే జిమ్, రిలాక్సేషన్‌ రూమ్స్, యోగా హాల్స్‌ వంటి వాటిని స్మార్ట్‌గా ఉపయోగించుకొని దీర్ఘకాలం పాటు కూర్చొని ఉండటం వల్ల కలిగే అనర్థాలను అధిగమించవచ్చు.
     
సామాజిక అంశాల వద్ద వస్తే... అందరితోనూ కలుపుగోలుగా ఉండటం, మిత్రులతో అరమరికలు లేకుండా హాయిగా నవ్వుతూ మాట్లాడటం, సామాజిక వేడుకల్లో పాల్గొనడం అన్ని విధాలా మంచిది. అలాగే మంచి కుటుంబ బంధాలు, పటిష్టమైన వైవాహిక బంధం చాలా ఒత్తిళ్ల నుంచి దూరం చేసి ఆరోగ్యాన్ని పెంచుతుంది. సామాజిక సేవలో పాల్గొనడం వల్ల నలుగురికి మంచి చేయడం మానసిక ఆనందాన్ని ఇస్తుంది. వీటివల్ల మన జీవితానికి సార్థకత చేకూరిన భావన కలుగుతుంది. అదేంతో మానసికతృప్తిని కలగజేస్తుంది. ఫలితంగా మనసు ఆనందంగా ఉండటం వల్ల మనిషి ఉల్లాసంగా ఉంటాడు. అది ఆరోగ్యానికి దోహదం చేసే అంశం. ఈ అన్ని కార్యకలాపాల వల్ల శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం కలిగి మనుషులు దృఢంగా మారుతారు. వ్యాధుల పట్ల నిరోధకత పెరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామాలన్నింటి కంటే వేగంగా నడక సాగించే ‘బ్రిస్క్‌ వాకింగ్‌’ మేలు. దీన్ని రోజుకు 30 నిమిషాల పాటు ఆగకుండా కొనసాగించాలి. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఒకటుంది.

నిజానికి ఇటీవల సాఫ్ట్‌వేర్‌తో శారీరక శ్రమ తగ్గడం వల్ల దాన్ని పూరించడానికి యువత జిమ్‌ పట్ల ఆకర్షితులు కావడం కూడా పెరుగుతోంది. ఇది మంచి పరిణామమే అయినా అతి సర్వత్ర వర్జయేత్‌ అనే సూక్తి వ్యాయామానికీ వర్తిస్తుంది. అతిగా వ్యామాయం చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అతిగా వ్యాయామం చేసే వారిలో ఆ ఎక్సర్‌సైజ్‌ ఒత్తిడిని తొలుత తీసుకొనే అవయవం గుండె. అతి వ్యాయామంతో పడే ఒత్తిడిని భరించేలాగా గుండె తనను తాను తీర్చిదిద్దుకుంటుంది. అలా అన్ని కణాలకూ మరింత రక్తం అందేలా స్పందించే క్రమంలో గుండె పరిమాణం పెరుగుతుంది. దాంతో ఇలా అతిగా వ్యాయామం చేసే వారిలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇటీవల వ్యాయామం చేస్తూ కుప్పకూలిన కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అందుకే గుండె ఆగగానే దాన్ని తిరిగి పని చేసేలా చేసే ప్రథమ చికిత్స చేయగల కార్డియో పల్మునరీ రిససియేషన్‌ (సీపీఆర్‌) నిపుణులను జిమ్‌లలో నియమించడం అవసరం. జిమ్‌లలో చేరేవారి ఆరోగ్య చరిత్ర తెలుసుకుని వారికి  తగిన ఆరోగ్య పరీక్షలు చేశాకే చేర్చుకొని, వారు చేయదగ్గ వ్యాయామాలే చేయించడం తప్పనిసరి.    

వ్యక్తిగత క్రమశిక్షణతోనూ, మన పరిమితులను గుర్తెరగడం ద్వారా, మంచి సంతృప్త భావనతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా ఉండటం, జీవితంలో తృప్తిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఉండటం ద్వారా ఈ కూర్చొని చేసే వృత్తులతో వచ్చే అనర్థాలను చాలావరకు అధిగమించవచ్చు.

నియమితవేళలు తప్పడమే అనారోగ్య హేతువు...
కాలం ఎరగకుండా గంటల కొద్దీ కూర్చోవడం వల్ల ఒళ్లు ఏమాత్రం కదలకుండా ఉంటుంది. దాంతో శారీరక శ్రమ ఎంతమాత్రమూ ఉండటం లేదు. పైగా ఇటీవల షిఫ్టుల్లో పనిచేసే వృత్తుల కారణంగా తిండి, నిద్ర, వ్యాయామం... వాటి సమయ సందర్భాలూ, సామాజిక వ్యవహారాలు... వీటన్నింటిలోనూ నియమబద్ధత కొరవడింది. వేళకు భోజనాలు చేయడం వెనకబడింది. తిండి, నిద్రలు నియతి తప్పాయి. దాంతో మెదడులోని ‘బయలాజికల్‌ క్లాక్‌’లోని వేళలూ గతి తప్పాయి. ఫలితంగా ఆరోగ్యం అస్తవ్యస్తమవుతోంది. పైగా ఇటీవలి కంప్యూటర్‌ ఆధారిత వృత్తులో సహజంగా ఉండే ఒత్తిడికి తోడు ఇటీవల వారి ఉద్యోగాల్లోని అభద్రత... అగ్నికి తోడైన ఆజ్యంలా ఆరోగ్యాన్ని కాల్చేస్తోంది.

వృత్తుల్లో లాగే... అనారోగ్యాల పరిణామక్రమమిది...
వృత్తులో వచ్చిన మార్పులకు అనుగుణంగానే అనారోగ్య కారకాల్లోనూ, వ్యాధుల మార్పులోనూ ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల ముందు అనారోగ్యం అంటే ఏదైనా అంటువ్యాధి రావడమో, మూకుమ్మడిగా ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోయేలా మహమ్మారులు ప్రబలటమో జరిగేది. కానీ ఇప్పుడు అలాంటి కమ్యూనికబుల్‌ డిసీజ్‌ల స్థానంలో నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజ్‌లు వచ్చి చేరాయి. ఇదీ వృత్తులకు అనుగుణంగా వ్యాధుల్లో చోటు చేసుకున్న పరిణామక్రమం. అంటే గతంలోలాగా కలరా, టీబీ, మశూచికం వంటి వ్యాధుల స్థానాలను హైబీపీ, హైకొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండెపోటు, పక్షవాతం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బులు, ఊబకాయం వంటి ఆధునిక వ్యాధులని పిలిచే నాన్‌కమ్యూనికబుల్‌ వ్యాధులు సమాజంలోకి వచ్చి చేరాయి. పైగా రెండు మూడు దశాబ్దాల కిందట ఈ నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజెస్‌తో తొలుత అరుదుగానూ, ఆ తర్వాత అడపాదడపా డాక్టర్‌ దగ్గరకు వచ్చేవారు. అయితే ఇటీవల ఈ జబ్బులతో వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందునా గతంలో 40 ఏళ్లకు పైబడ్డ వారిలోనే ఈ జబ్బులు కనిపించేవి. కానీ ఈ కంప్యూటర్‌ ఆధారిత వృత్తుల కారణంగా ఇటీవల పాతికేళ్ల నుంచి 30 ఏళ్ల యుక్తయవస్కుల్లోనూ ఈ జబ్బులు కనిపిస్తున్నాయి.

మన దేశానికే కాదు... ప్రపంచానికీ నష్టం
ప్రపంచవ్యాప్తంగా మరే దేశంలోనూ లేని ఒక అద్భుతమైన వనరు మన దేశానికే సొంతం. అదేమిటంటే... మన దేశంలోని 70 శాతం కంటే ఎక్కువ జనాభా 35 ఏళ్ల వయసులోపు వారే. ఇంతటి యువ జనాభా ఇక్కడ ఉన్న కారణంగా అది ప్రపంచంలోని మానవవనరుల అవసరాన్ని తీర్చుతోంది. అందుకే మన గ్లోబ్‌ మీద 218 దేశాలున్నా... అందులోని 185 దేశాల్లో మన దేశపు యువత ప్రపంచ మానవవనరుగా అందరికీ అందుబాటులో ఉంది. ఇది మనకు ఉన్న అద్భుత వరదాయకమైన వనరు. వరప్రదాయమైన ఈ మానవవనరును జనాభానిపుణుల పరిభాషలో ‘డెమొగ్రాఫిక్‌ డివిడెండ్‌’ అని వ్యవహరిస్తుంటారు. అయితే ఈ ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ ప్రయోజనం మనకు దక్కకపోయే ప్రమాదం చాలా ఉంది. కారణం కూర్చొని చేసే వ్యాధులు.

వాటి కారణంగా ప్రబలుతున్న నాన్‌ కమ్యూనికబుల్‌  వ్యాధులైన హైబీపీ, డయాబెటిస్, హార్ట్‌ఎటాక్, పక్షవాతం వంటివి. అవి అకస్మాత్తుగా మనిషిని చుట్టుముట్టేసి అతడి ఉత్పాదకతను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు... ఆర్థికభారంగా పరిణమించి కుటుంబాలను కుదేలయ్యేలా చేస్తున్నాయి. ఆ డిసీజ్‌ బర్డెన్‌ సమాజానికీ చివరకు దేశానికీ భారంగా పరిణమిస్తోంది. ఇక ఈ కూర్చొని చేసే ఉద్యోగాల కారణంగా ఇప్పుడున్న వ్యాధిగ్రస్తమైన నాన్‌కమ్యూనికల్‌ డిసీజ్‌ల భారం అదేపనిగా కొనసాగితే ‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ ప్రయోజనాలను మనం పొందేలోపే ఇప్పటి యువతరం అంతా వృద్ధాప్యదశకు చేరుకొని... ప్రస్తుత జపాన్‌లోలాగే మనదగ్గర కూడా వృద్ధతరం జనాభా పెరిగి పోయే ప్రమాదం ఉంది. ఇలా చూస్తే ఇది సమాజాన్నంతటినీ వ్యాధిగ్రస్తం చేసే సమస్య. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అవసరం.  
డాక్టర్‌ పి. కృష్ణంరాజు, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement