నా వయసు 26 ఏళ్లు. నాకు విపరీతంగా జుట్టు రాలిపోతోంది. రోజూ తలదువ్వుకునేప్పుడు పోగులు పోగులుగా దువ్వెనలోకి జుట్టు వస్తోంటే చాలా ఆందోళనగా ఉంటోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు దయచేసి ఏవైనా మార్గాలుంటే చెప్పండి. అలాగే రాలిపోయిన జుట్టు మళ్లీ పెరిగి, తలకట్టు ఒత్తుగా చేసుకునేందుకు మార్గాలు / చికిత్సలు ఉంటే వివరించండి.– సుష్మా, సికింద్రాబాద్
ప్రతిరోజూ కొన్ని జుట్టు స్ట్రాండ్స్ రాలిపోవడం చాలా సహజమైన (నేచురల్) విషయమే. జుట్టు జీవితచక్రంలో... అది ఒక దశ వరకు పెరగడం, ఆ తర్వాత రాలిపోవడం, అటుపై జుట్టు అంకురం కొంతకాలం విశ్రాంతి తీసుకొని, మళ్లీ అందులోంచి కొత్త వెంట్రుక (స్ట్రాండ్) పెరగడం అన్నది నిరంతరం జరిగే ప్రక్రియ. మనందరిలోనూ అంటే ఆరోగ్యకరమైన మనిషి విషయంలోనూ ప్రతిరోజూ 60 – 100 వెంట్రుకలు (స్ట్రాండ్స్) రాలిపోతూ ఉంటాయి. ఇవన్నీ మళ్లీ వస్తూ ఉంటాయి కూడా. అయితే దాని కంటే ఎక్కువగా రాలిపోతూ... రాలేవాటి కంటే పెరిగేవి తగ్గుతూ పోతుంటే మాత్రం కాస్తంత ఆలోచించాల్సిందే.
జుట్టు రాలేందుకు కారణాలు...
⇔ చాలా తీవ్రమైన శారీరక/మానసిక ఒత్తిడులు ఉన్నా లేదా తీవ్రంగా జబ్బు పడ్డా కొందరిలో అది జుట్టు రాలిపోయేందుకు దారితీస్తుంది. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. కానీ ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.
⇔ మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు రాలి ఎక్కువగా పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా పోవడం ఓ కారణం.
⇔ సమతుల పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా కొందరిలో జుట్టు రాలుతుంది.
⇔ ఇంకొందరిలో హార్మోన్ల లోపం జుట్టు రాలడానికి కారణమవుతుంది. సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిలల్లో ఎక్కువ. మహిళల్లోనూ కొద్దిపాటి పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ స్రావం ఎక్కువ. దీంతో జుట్టు రాలుతుంది. ఇక హైపోథైరాయిడిజమ్ కండిషన్ కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తుంది. ఒక్కోసారి ఆటోఇమ్యూన్ జబ్బుల వల్ల జుటు రాలుతుంది. మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్‌గా పేర్కొంటుంటారు. ఉదాహరణకు... ∙పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మన మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి ∙లైకెన్ ప్లానస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది ∙లూపస్ అనే మరో ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కూడా జుట్టు రాలిపోవచ్చు. ఇంకొందరిలో రకరకాల రుగ్మతలకు మందులు వాడుతున్నప్పుడు వాటి దుష్ప్రభావం వల్ల జుట్టు రాలడం మామూలే.
⇔ రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్, వాహనాల నుంచి విపరీతంగా వెలువడుతున్న కాలుష్యాల కారణంగా వెంట్రుకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
జుట్టు రాలడాన్ని నివారించడం ఎలా?
జుట్టు రాలడం అన్నది ఏ కారణాల వల్ల జరుగుతోందో తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ సమస్య చాలావరకు తగ్గుతుంది. అలాగే ఏదైనా జబ్బు కారణంగా ఇలా జరుగుతుంటే... ఆ జబ్బును నయం చేసుకుంటే (అండర్‌లైయింగ్ కారణానికి చికిత్స తీసుకుంటే) జుట్టు రాలడం తగ్గుతుంది. వీటన్నింటినీ గుర్తించి త్వరగా మందులు వాడితే రాలిన జుట్టు మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ.
కొందరు మహిళల్లోనూ బట్టతల
మహిళలకు బట్టతల రాదని కొందరు అనుకుంటారు. కానీ అరుదుగా మహిళల్లోనూ బట్టతల వస్తుంది. దీన్ని ‘ప్యాటర్న్ హెయిర్‌లాస్’ అంటారు. ఇలాంటి మహిళల్లో క్రమంగా వారి పాపిట మెల్లమెల్లగా వెడల్పుగా అవుతుండటం కనిపిస్తుంది. దీంతో మహిళల్లోని బట్టతల వచ్చే అవకాశాలను గుర్తించవచ్చు. ఇలాంటివారు వైద్యులను కలిస్తే బట్టతలను చాలావరకు నివారించవచ్చు. ఇక మిగతా వారు తమ జుట్టు రాలే సమస్యల కోసం కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకున్న తర్వాత కూడా జుట్టు ఇంకా రాలుతుంటే అప్పుడు మాత్రం వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాలి.
వెంట్రుకలను కాపాడుకునే పద్ధతులు
⇔ వెంట్రుకలకు మంచి పోషకాలు అందేలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పదార్థాలు అంటే ఆకుపచ్చని కూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), తాజా పళ్లు, విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, జింక్ పాళ్లు పుష్కలంగా ఉండే ఆహార పదర్థాలు, తాజా పండ్లు తీసుకోవాలి.
⇔ క్రమం తప్పకుండా వెంట్రుకలను షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా వెంట్రుకలను కడగటం కూడా అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి. దీనివల్ల వెంట్రుకలు పొడిబారవచ్చు. సాధారణంగా వారంలో రెండుసార్లు తలస్నానం చేయడం మంచిది. (ఐడియల్.)
⇔ అలర్జెన్స్, కాలుష్యాలు నేరుగా వెంట్రుకలు తాకకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, హాట్ పెట్టుకోవడం చేయాలి.
⇔ ఒకసారి వైద్య నిపుణులను సంప్రదించి, హార్మోన్ లోపాల వల్ల ఈ సమస్య వచ్చిందా అన్నది తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఆ సమస్యను చక్కదిద్దగానే జుట్టు రాలడం ఆగిపోతుంది.-డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment