డ్రైవింగ్‌తో నడుము నొప్పి... సీటు అడ్జెస్ట్‌మెంట్ ఎలా? | Driving seat adjustment with lumbar pain ... how? | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌తో నడుము నొప్పి... సీటు అడ్జెస్ట్‌మెంట్ ఎలా?

Published Sat, Mar 5 2016 8:28 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

డ్రైవింగ్‌తో నడుము నొప్పి... సీటు అడ్జెస్ట్‌మెంట్ ఎలా? - Sakshi

డ్రైవింగ్‌తో నడుము నొప్పి... సీటు అడ్జెస్ట్‌మెంట్ ఎలా?

లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
 
నేను ఇంతకుముందు బైక్ నడుపుతుండే వాణ్ణి. కారు ఉన్నా ట్రాఫిక్‌లో సౌకర్యంగా ఉంటుందని టూవీలర్ నడిపేవాణ్ణి. అప్పట్లో తీవ్రమైన నడుము నొప్పి వచ్చింది.  కారు ఉపయోగించమని డాక్టర్ సలహా ఇచ్చారు. కారు డ్రైవింగ్‌లో సీటింగ్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు పాటించాలా?  - వెంకటేశ్వర్‌రావు, హైదరాబాద్


నడుమునొప్పికి టూవీలర్ డ్రైవింగ్ ఎలా కారణమవుతుందన్న అంశంపై చాలా అధ్యయనాలు ఉన్నాయి. అయితే కారు డ్రైవ్ చేసేవారిలోనూ నడుమునొప్పి వంటి సమస్యలు వస్తాయని ఒక స్వీడిష్ అధ్యయనం పేర్కొంటోంది. అందుకే కారు డ్రైవింగ్ సమయంలోనూ సీట్‌లో కూర్చునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి...మీ కాళ్ల పొడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలిమీ ఎత్తునకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవాలి  మీ సీట్‌ను నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్ ఒంచాలి.

 

ఆ సీట్ ఒంపు ఎంత అవసరం అని తెలియాలంటే ఒకటే కొండగుర్తు... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా ఉండాలి.  మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది.  మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్‌రెస్ట్ ఉండాలి.సీట్‌లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి.అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండండి. ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం మీకు అన్ని విధాలా మేలు చేస్తుందని గుర్తించండి.
 
డాక్టర్ సుధీంద్ర ఊటూరి
కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్
అండ్ రీహ్యాబిలిటేషన్
కిమ్స్ హాస్పిటల్స్
సికింద్రాబాద్
 
నియోనేటాలజీ కౌన్సెలింగ్
 
రెండు రోజుల క్రితం నా భార్య 3.5 కిలోల ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చింది. ఇది తొలిచూలు. అంతా బాగానే ఉంది కానీ ఎంత ప్రయత్నించినా చిన్నారికి పాలుపట్టడం కష్టమైంది. దాంతో ఆవుపాలు పడుతున్నాం. ఇలా చాలామందిలో జరుగుతుంటుందనీ, తల్లి పాలుపట్టకపోయినా పర్లేదని కొందరు ఫ్రెండ్స్ అంటున్నారు. బిడ్డలకు తల్లిపాలు పట్టకపోయినా పర్లేదా?  - ఎస్. రాజన్, తిరుపతి


చిన్నారికి తల్లి పాలు పట్టకపోవడం అస్సలు సరికాదు. మీ ఫ్రెండ్స్ చెబుతున్న మాట వాస్తవం కాదు. బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి. ఇక పాపాయికి పాలుపట్టే విషయంలో  కొత్తగా తల్లులైన వారికి కాస్త శిక్షణ అవసరం. పాపాయికి పాలు పట్టడానికి అమ్మ సంసిద్ధం కావాలి. సాధారణ ప్రసూతి అయితే బిడ్డ పుట్టిన 30 నిమిషాల తర్వాత, సిజేరియన్ ఆపరేషన్ అయితే గంట తర్వాత పాపాయికి అమ్మ పాలు ఇవ్వాలని నిపుణుల సిఫార్సు. ఈ ప్రపంచంలో పాపాయికి తల్లిపాలకు మించిన ఆహారం లేదు. అందులో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలూ కలిసి ఉంటాయి. తల్లిపాలు  జీర్ణమైనట్లుగా పిల్లలకు మరేవీ కావు. ఇక బిడ్డలు ఎదుర్కొనే ఎన్నో వ్యాధుల నుంచి వాటి వల్ల స్వాభావిక రోగనిరోధకత దొరుకుతుంది. ఆస్తమా, అలర్జీ వంటి ఎన్నో సమస్యల నుంచి సంరక్షణ లభిస్తుంది.

 

అంతేకాదు... చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ  వ్యాధులు, నీళ్లవిరేచనాలు వంటి ఎన్నో సమస్యలను తల్లిపాలు నివారిస్తాయి. అందుకే పాపాయికి ఆర్నెల్ల పాటు బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలి. తల్లిపాల మీద ఎదిగిన బిడ్డల్లో మానసిక వికాసం, తెలివితేటలు బాగా ఉంటాయి. ఆ బిడ్డల్లో సాధారణంగా  ఊబకాయం రాదు. పాలిచ్చే తల్లులకూ స్థూలకాయం రాదు. తల్లిపాలపై పెరిగే బిడ్డలకు భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. ఫార్ములా పాల వంటి కృత్రిమ ఆహారం విషయంలో స్టెరిలైజ్‌డ్ నిప్పల్ కొనడం, బాటిళ్లు వేడి చేయడం వంటి ఖర్చులు ఉంటాయి.

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పిల్లలు పుట్టగానే తల్లిలో ఊరే ముర్రు పాలు ఇవ్వడం. దీన్ని కొలొస్ట్రమ్ అంటారు. అవి కాస్త గాఢంగా  అనిపించినా బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ అందులో ఉంటాయి. అవి తప్పక పట్టించాలి. ఎందుకంటే అవి అప్పుడే పుట్టిన బిడ్డలో జీర్ణవ్యవస్థ సంపూర్ణంగా రూపొందడానికి అవి దోహదం చేస్తాయి. బిడ్డకు ఆర్నెలు వచ్చే వరకూ ఫార్ములా పాలు, పండ్లరసాలు, నీళ్లు ఇవేమీ ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే పట్టించడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
డాక్టర్ టి.పి.కార్తీక్
సీనియర్ పీడియాట్రిషన్ - నియోనేటాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్,
సికింద్రాబాద్
 
ఆయుర్వేద కౌన్సెలింగ్
 
నా వయసు 28 ఏళ్లు. ఉద్యోగం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. గత మూడు నెలలుగా ఛాతీలో (గుండెల్లో) మంట, పుల్లతేన్పులు, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నాను. అప్పుడప్పుడు మంటతో కూడిన నొప్పి కూడా ఉంటోంది. యాంటాసిడ్ మందులు వాడితే తాత్కాలికంగానే ప్రయోజనం కనిపిస్తోంది. దీనికి ఆయుర్వేదలో శాశ్వత పరిష్కారం తెలపగలరు.   - పద్మారావు, హైదరాబాద్


మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే... ఆయుర్వేద పరిభాషరీత్యా మీరు ‘అమ్లపిత్తం’ అనే వికారంతో బాధపడుతున్నారు. ఆంగ్లంలో దీన్నే హైపర్ ఎసిడిటీ లేదా ఎసిడిటీ అంటారు. విరుద్ధాహారం (ఉదా: చేపలు, పాలు) ఒకేసారి సేవించకూడదు. ఇత్తడిపళ్లెంలో ఉంచిన పులిహోర తినకూడదు. ఇక పులిసిన చద్దన్నం, అతిపుల్లటి పదార్థాలు, ఎక్కువ కారం, ఉప్పు సేవించడం, ప్రతినిత్యం ఒకే సమయానికి గాక వేర్వేరు సమయాల్లో తినడం దీనికి ప్రధాన కారణాలు. (విరుద్ధ దుష్టామ్ల విదాహిపిత్త ప్రకోపిపానాన్న భుజోవిదగ్ధమ్... : భావప్రకాశ సంహితా)
 
లక్షణాలు : వ్యాధి తీవ్రతను బట్టి ఈ లక్షణాలతో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. మీకు ఉన్న లక్షణాలే గాకుండా అరుచి, శరీరం బరువుగా ఉండటం, కంఠంలో మంట, కొద్దిపాటి వాంతులు, దప్పిక, కళ్లు తిరిగినట్లు ఉండటం మొదలైనవి కనిపిస్తుంటాయి.
 
చికిత్స: పైన పేర్కొన్న కారణాలను సరిదిద్దుకోవడం ప్రధానం. కానిపక్షంలో మందులకు తగ్గినట్టే తగ్గి సమస్య మళ్లీ తిరగబెడుతుంది. పులుపు లేని మజ్జిగ, బార్లీ జావ, నీళ్లు గంటగంటకూ తాగుతుండాలి.తేలికగా జీర్ణమయ్యే పల్చటి ఆహారం నియమిత వేళల్లో సేవించాలి. (ఉదా: పెసరకట్టు, పేలాలు, గోధుమజావ మొ.)  గృహవైద్యం :  ఎండుద్రాక్ష 3 + కరక్కాయచూర్ణం 3 గ్రా.లు మూడుపుటలా తినాలి. ఏలక్కాయ 1 + జీలకర్ర పావు చెంచా + ధనియాలు అరచెంచా పొడిచేసి, నీటితో మూడుపూటలా సేవించాలి.
 
గమనిక : నియమిత వేళల్లో నిద్ర ఉండాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం అత్యవసరం.
 
డాక్టర్ వృద్ధుల
లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement