
విజయవాడ తిరిగి వెళుతున్న సమయంలో ట్రాఫిక్‌ను నిలిపేసిన విషయాన్ని గమనించిన డీజీపీ
సాక్షి, అమరావతి : తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపేసిన పోలీసులపై ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. తన కాన్వాయ్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఇకనుంచి తాను ఎక్కడికి వెళ్లినా.. తనకోసం ట్రాఫిక్ నిలిపేసి.. వాహనదారులను ఇబ్బందిపెట్టకూడదని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.
గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు డీజీపీ కాన్వాయ్ వస్తున్న సమయంలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి విజయవాడ తిరిగి వెళుతున్న సమయంలో తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిలిపేసిన విషయాన్ని డీజీపీ గమనించారు. దీంతో ఇకపై తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను నిమిషం కూడా ఆపవద్దని డీజీపీ ఠాకూర్ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు సూచించారు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీచేశారు. వీఐపీలు ప్రయాణిస్తున్న వేళ కూడా సాధ్యమైనంత తక్కువగా ట్రాఫిక్ ను ఆపాలని ఆయన సూచించారు.