ఒక పొ....డుగైన ప్రేమకథ
మొక్కలకు ప్రాణముంటుందని మనకు తెలుసుగానీ.. అవి మాట్లాడుకుంటాయి అంటే మాత్రం కొంచెం అనుమానిస్తాం. అటువంటి సందేహాలు అసలు వద్దని అంటున్నారు అబర్దీన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. మొక్కలు మట్టి ద్వారా మాట్లాడుకుంటాయని, ఏదైనా వ్యాధి సోకినప్పుడు ఇరుగు పొరుగులను హెచ్చరిస్తాయని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు.
నాలుగేళ్ల క్రితం చైనాలో కొందరు శాస్త్రవేత్తలు టమోటా మొక్కలపై పరిశోధనలు చేస్తూండగా వీటి మధ్య సమాచార వినిమయం ఎలా జరుగుతుందా? అన్న చర్చ మొదలైంది. ఒక మొక్క ఆకుకు తెగులు సోకగా... ఆ వెంటనే మిగిలిన మొక్కల్లో ఆ తెగులును నిరోధించే వ్యవస్థలు చైతన్యవంతం కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.
ఈ నేపథ్యంలో అబర్దీన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుంపులు గుంపులుగా పెంచిన మొక్కల్లో కొన్నింటిని కీటకాలతో కుట్టించినప్పుడు వాటి నుంచి ఒక రకమైన రసాయనం విడుదలైందని, ఆ రసాయనానికి కీటకం తాలూకూ సహజ శత్రు కీటకం ఆకర్షితమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయిదు వారాల తరువాత మొక్కలపై ప్లాస్టిక్ ముసుగు కప్పి ఒక్క మొక్కపై మాత్రమే కీటకాల దాడి నిర్వహించారు. అయితే ఆ మొక్కతోపాటు ఇతర మొక్కల్లోనూ రసాయనం విడుదల అవడాన్ని బట్టి ఈ మొక్కలు మట్టి ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు తెలిసిందని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డేవిడ్ జాన్సన్ తెలిపారు.