Scientists Peking University China 19 Hours Day - Sakshi
Sakshi News home page

రోజుకు 24 గంటలు కదా! కానీ, అప్పట్లో 19 గంటలే!.. ఆసక్తికర విషయాలు వెల్లడి

Published Fri, Jan 27 2023 4:57 AM | Last Updated on Fri, Jan 27 2023 8:46 AM

Scientists Peking university China 19 hours Day - Sakshi

ఎంతకూ రోజు గడవడం లేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒంటరిగా ఉన్నప్పుడో.. చేసేందుకు పనేమీ లేకపోయినప్పుడో... 24 గంటలు గడిచేదెప్పుడబ్బా అని ఒక్కసారైనా అనిపించి ఉంటుంది! మరి రోజులో కేవలం 19 గంటలే ఉంటే? అదెలా అంటారా? అయితే కచ్చితంగా ఇది చదవాల్సిందే... 

భూమ్మీద రోజు నిడివి ఎన్నడూ స్థిరంగా లేదట. కోటానుకోట్ల ఏళ్ల కింద ఇప్పటి కంటే కనీసం ఆరు గంటలు తక్కువగా ఉండేదట! అంటే అప్పట్లో భూ భ్రమణానికి, అంటే తన చుట్టు తాను ఒకసారి తిరిగేందుకు 19 గంటలు మాత్రమే పట్టేదని చైనాలోని పెకింగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. మరిప్పుడు రోజుకు 24 గంటలు ఎందుకైనట్టు? భూమి నిర్మాణం గురించి కొంచెం తెలుసుకుంటే దీనికి సమాధానమూ తెలుస్తుంది. 

భూమి ఉల్లిపాయ మాదిరిగా పొరలుగా ఉంటుందని, ఈ పొరల సంఖ్య నాలుగని చిన్నప్పుడే చదువుకున్నాం. మనముండేది క్రస్ట్‌ అని పిలిచే పై పొరలో. దీనికింద మాంటెల్, ఔటర్‌ కోర్, చివరగా భూమి మధ్య భాగంలో ఇన్నర్‌ కోర్‌ ఉంటాయి. ఇన్నర్‌ కోర్‌ సుమారు 1,220 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇది దాదాపుగా ఘనస్థితిలో ఉన్న ఇనుప ముద్ద.

ఇది తిరిగే వేగం, పద్ధతుల్లో వచ్చే తేడాలను బట్టి రోజు తాలూకు నిడివిలోనూ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నర్‌ కోర్‌పైన ద్రవ స్థితిలో ఉండే ఔటర్‌ కోర్‌ ఉంటుంది. ఇది సృష్టించే అయస్కాంత క్షేత్రాన్ని బట్టి ఇన్నర్‌ కోర్‌ వేగం, దిశ ఆధారపడి ఉంటాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే కోట్ల ఏళ్లుగా ఇన్నర్‌ కోర్‌ దిశ, వేగం తగ్గుతూ వస్తున్నాయి. దీని ప్రభావం వల్ల రోజు నిడివీ పెరుగుతూ వస్తోంది. ఆ లెక్కన 140 కోట్ల ఏళ్ల క్రితం భూ భ్రమణానికి 19 గంటలే పట్టేదని అంచనా. 

అధ్యయనం చేసిందిలా...  
భూమి లోపలి పొరలన్నీ వేటికవే వేర్వేరు దిశ, వేగాల్లో తిరుగుతూంటాయి. కొన్ని కదలికలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఇంకొన్ని పొరల గురుత్వాకర్షణ శక్తి ఆ క్షేత్ర ప్రభావాన్ని తగ్గిస్తూంటుంది. కచ్చితంగా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కష్టం కాబట్టి శాస్త్రవేత్తలు పరోక్ష పద్ధతుల ద్వారా భూమి లోపలి పొరల్లో ఏం జరుగుతోందో పరిశీలిస్తూంటారు.

భూకంప తరంగాలు అన్ని పొరల ద్వారా ప్రయాణించగలవు. పొర మారినప్పుడల్లా వాటి వేగంలో మార్పులు వస్తూంటాయి. వాటి ఆధారంగానే ఆ ప్రాంతంలో ఏ రకమైన ఖనిజాలున్నాయి, ఉష్ణోగ్రత, సాంద్రత ఎంత వంటి వివరాలు తెలుస్తూంటాయి. అలాగే భూమి ఇన్నర్‌ కోర్‌ వేగం, దిశల్లో వచ్చిన మార్పులు కూడా! పెకింగ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని వేల భూకంపాల వివరాలను సేకరించి పరిశీలించారు.

1960ల నుంచి ఇప్పటిదాకా భూమి ఇన్నర్‌ కోర్‌ను దాటుకుంటూ వెళ్లిన భూకంప తరంగాల తీరును విశ్లేషించినప్పుడు ఆసక్తికరమైన అంశం బయటపడింది.  2009కి ముందు ఈ తరంగాలు ఇన్నర్‌ కోర్‌ గుండా వెళ్లేందుకు పట్టిన సమయంతో పాటు ఆ తరంగాల రూపురేఖల్లోనూ గణనీయమైన మార్పులొచ్చాయి.

ఇక 2009లో భూకంప తరంగాల ప్రభావం ఇన్నర్‌ కోర్‌పై దాదాపు లేకుండా పోయింది. అంటే 2009లో ఇన్నర్‌ కోర్‌ కూడా భూమితో సమాన వేగంతో తిరుగుతున్నట్లు అంచనా కట్టారు. 2009 తర్వాత భూమి కంటే తక్కువ వేగంతో తిరుగుతున్నట్టు భూకంపాల తరంగాల పరిశీలనలో వెల్లడైంది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

70 ఏళ్లకోసారి రివర్స్‌ 
ఈ అధ్యయనం ప్రకారం ఇన్నర్‌ కోర్‌ తిరిగే దిశ 70 ఏళ్లకోసారి మారుతూంటుంది. అలా చివరిసారి 1970 ప్రాంతంలో మారిందట. రోజు నిడివి, భూ అయస్కాంత క్షేత్రాల ద్వారా ఇది నిర్ధారౖణెంది కూడా. ఇలా ఇన్నర్‌ కోర్‌ తిరిగే దిశ, వేగంలో మార్పుల వల్ల భూ భ్రమణానికి పట్టే సమయంలోనూ తేడాలొచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇన్నర్‌ కోర్‌ వేగం తగ్గినప్పుడు మాంటెల్‌ తాలూకూ గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుందని, ఫలితంగా భూ భ్రమణ వేగం తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల రోజు నిడివి పెరుగుతుందన్నమాట. ఎంతో తెలుసా? ఏడాదికి సెకనులో 74,000వ వంతు! అలా 140 కోట్ల ఏళ్ల క్రితం 19 గంటలుండే రోజు నిడివి ఇప్పుడు 24 గంటలకు పెరిగిందని వివరించారు. అన్నట్టూ, భూమి ఇన్నర్‌ కోర్‌ ఆరేళ్ల సమయంలో ఒక మైలు దూరం అటు ఇటూ లోలకం మాదిరిగా ఊగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement