ద్వారకనగరాన్ని శ్రీ కృష్ణుడు పరిపాలించాడని పురాణాల్లో చదువుకున్నాం కదా... ఆయన తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరిన తరువాత ఈ పవిత్ర నగరం సముద్రపు జలాలలో మునిగిపోయింది. మహాభారత యుద్ధం జరిగిన 36 సంవత్సరాల అనంతరం ఈ నగరం సముద్రంలో కలిసి పోయింది. విష్ణు పురాణం ద్వారకానగర మునక గురించి ప్రస్తావించింది. యాదవ ప్రముఖులు గాంధారి శాపప్రభావాన, మునుల శాపప్రభావాన తమలో తాము కలహించికొని నిశ్శేషంగా మరణిస్తారు. ఆ తరువాత శ్రీ కృష్ణుని ఆదేశం మీద అర్జునుడు యాదవకుల సంరక్షణార్థం ఇక్కడకు వచ్చి శ్రీకృష్ణ బలరాములకు అంత్యక్రియలు నిర్వహించి ద్వారాకాపుర వాసులను ద్వారక నుండి దాటించిన మరు నిమిషం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ద్వారకానగరం మునిగిపోవడంతో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమైంది.
పదహారో శతాబ్దంలో ఈ అలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణుని ముదిమనుమడు వజ్రనాభుడు ఈ ఆలయానికొక రూపునిచ్చాడని చెబుతారు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. ఈ ఆలయంలోకి స్వర్గ, మోక్షద్వారాలనే రెండు ద్వారాలగుండా ప్రవేశించవచ్చు. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఆలయ సమీపంలో బలరాముడికి, కృష్ణుడికీ కుమారుడు, మనుమడూ అయిన ప్రద్యుమ్న అనిరుద్ధులకూ, శివకేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలున్నాయి. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఆమె శ్రీకృష్ణుని అష్టమహిషుల్లో ప్రధానమైనది కాబట్టి ఈ ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంది.
ఈ క్షేత్రానికి సమీపానే గోమతీ నది సముద్రంలో సంగమిస్తుంది. అక్కడ నుండి బస్సుమార్గంలో బేట్ ద్వారక చేరాలి. ఇది శ్రీ కృష్ణుని నివాస స్థలం. ఇక్కడ స్వామి శంఖ చక్రధారియై ఉపస్థితమై ఉన్నాడు. దీనికి ఐదు కి.మీ. దూరంలో శంఖతీర్థం ఉంది. ఇక్కడ పెరుమాళ్ళ వక్షస్థలాన శ్రీదేవి ఉపస్థితమై ఉంది. రుక్మిణీదేవి ఉత్సవ తాయార్. ఇక్కడ అనేక సన్నిధులు ఉన్నాయి. ఇక్కడ నిత్యం తిరుమంజనం జరుగుతుంది. పసిపిల్లాడిలా–రాజులా–వైదికోత్తమునిలా అలంకారాలు జరుగుతుంటాయి. ద్వారక నుండి ఓఖా పోవుమార్గంలో ఐదు కి.మీ.ల దూరాన రుక్మిణీదేవి సన్నిధి ఉంది. ఇదే రుక్మిణీ కల్యాణం జరిగిన ప్రదేశం. ద్వారకాపురిలో వసుదేవ, దేవకి, బలరామ, రేవతి, సుభద్ర, రుక్మిణీదేవి, జాంబవతీదేవి, సత్యభామాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. బేట్ ద్వారక ఆలయానికి వెళ్ళే మార్గంలో రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని బోటులో ప్రయాణించి చేరుకోవాలి.
పవిత్ర నగరం
ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం లాంటి అర్థాలు ఉన్నాయి. ద్వార్ అనే పదం ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. అనేక ద్వారాలు ఉన్న నగరం కనుక ద్వారక అయింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్ (నాలుగు ధామాలు) లలో ద్వారకాపురి ఒకటి. మిగిలిన మూడు పవిత్రనగరాలు బద్రీనాథ్, పూరి, రామేశ్వరం. ద్వారకాధీశుని ఆలయాన్ని జగత్‌మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. ద్వారకాపురి సమీపంలో జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరలింగం ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠం స్థాపించబడింది. ఆది శంకరాచార్యులవారు నెలకొల్పిన నాలుగు మఠాలలో ఇది ఒకటి. మిగిలినవి శృంగేరి, పూరి, జ్యోతిర్మఠం. ద్వారకా పీఠాన్ని కాళికా పీఠంగా కూడా అంటారు.
శ్రీద్వారకనాథ్ మహాత్యం
ఆదిశంకరులు ద్వారకాధీశుడిని దర్శించి ద్వారకాపీఠాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ కృష్ణుడు క్షత్రియ రాకుమార వివాహ అలంకరణలో దర్శనం ఇస్తాడు. 108 దివ్యదేశాలలో ఈ క్షేత్రం ఒకటి. ద్వారకానా«థుడికి అనేక సేవలు, దర్శనాలు ఉంటాయి. దర్శనలకు తగినట్లు వస్త్రధారణలో మార్పులుంటాయి.
ద్వారకాసామ్రాజ్యం
మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణుపురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీ కృష్ణ నిర్మితమైన ద్వారాపురి ఉండేదని. పురాణేతిహాసాలలో వర్ణించబడిన విధంగా అది సముద్రగర్భంలో కలసిపోయిందని విశ్వసిస్తున్నారు. శ్రీ కృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుండి ద్వారకావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. ద్వారకా నగరాన్ని శ్రీ కృష్ణుడి ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. సౌరాష్ట్ర పడమటి సముద్రతీరంలో ఈ భూమి నగర నిర్మాణార్థ్ధం ఎంచుకోవడమైంది. ఈ నగరం ప్రణాళిక చేయబడి తరువాత నిర్మించబడింది. గోమతీనదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరం ద్వారక. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి కుశస్థలి అని పేర్లున్నాయి. ఇది నిర్వహణా సౌలభ్యం కోసం ఆరు విభాగాలుగా విభజించి నిర్మించబడింది. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్యకూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో నిర్మితమైనది. రాజ్యసభా మంటపం పేరు సుధర్మ సభ. రాజు ప్రజలతో సమావేశం జరిపే ప్రదేశం ఇదే. ఈ నగరం సుందర సముద్రతీరాలకు ప్రసిద్ధం.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి చెందిన ఒక బృందం చేసిన పరిశోధనలలో సముద్రగర్భంలోని ద్వారాపురి కనుగొనబడింది. ఆరు మాసాల పరిశోధనానంతరం 2000 డిసెంబరు మాసంలో కనుగొన్నారు. ఈ పరిశోధనానంతరం అదే విద్యాసంస్థ 2001లో జరిపిన పరిశోధనలో సముద్రజలాల్లో మునిగి ఉన్న కళాఖండాలను స్వాధీనపరచుకున్నారు. అలా లభించిన కళాఖండాలలోని భాగాలు యు. కె లోని ఆక్స్‌ఫర్డ్, జర్మనీ లోని హానోవర్ అలాగే పలు భారతీయ విద్యాసంస్థలకు కాలనిర్ణయ పరిశోధనా నిమిత్తం పంపారు.
బేట్ ద్వారక
బేట్ ద్వారక ప్రధాన దైవమైన శ్రీ కృష్ణుని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పురాతన హిందూ సంప్రదాయానికి బేట్ ద్వారక ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సముద్రతీర ప్రదేశాలు పురాతన వస్తువులకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ లభించే మట్టి పాత్రల అవశేషాలు క్రీస్తు శకంలో సముద్రతీర దేశాలతో జరిగిన వ్యాపార, వాణిజ్యాలకు తార్కాణం. ఈ పుష్కలమైన రేవుపట్టణం మతప్రధానమయిన కేంద్రం. శ్రీ కృష్ణుడు అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తరువాత సముద్రగర్భంలో కలసి పోయిందనే విశ్వాసానికి బలం చేకూరుతోంది. నిర్మాణశాస్త్ర నిపుణుల బృందాల పరిశోధనా ఫలితంగా అనేక పురాతన కళాఖండాలు సముద్రగర్భం నుండి వెలికి వచ్చాయి. ఇక్కడ అధిక సంఖ్యలో లభించిన రాతి లంగర్లు పురాతనకాలంలో ఉన్న రేవుపట్టణాలలో బేట్ ద్వారక చాలా ప్రముఖమైనదని సూచిస్తున్నాయి. బేట్ ద్వారక పరిసరాలు నౌకలు సురక్షితంగా నిలవడానికి అవకాశం కల్పిస్తూ ఈ నగరాన్ని సముద్రతరంగాల నుండి రక్షించిందని తెలియజేస్తున్నాయి.
ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ద్వారకకు రోడ్డు మార్గాన వెళ్లవచ్చు. సికింద్రాబాద్, అహ్మదాబాద్ ఓఖా ఎక్స్‌ప్రెస్‌లో ద్వారకకు సుమారు 39 గంటల ప్రయాణం. ద్వారక రైల్వేస్టేషన్ నుంచి పదినిమిషాలలో ద్వారకాధీశుని ఆలయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మనకు కనిపించే అయిదంతస్తుల దివ్య ఆలయ శిఖరం మీద సూర్యచంద్రుల చిహ్నాలతో విలసిల్లే పతాకం కనిపిస్తుంది. గర్భగుడిలో నాలుగు భుజాలతో విలసిల్లే త్రివిక్రమ(వామన) మూర్తి ఉన్నారు. ఈ ఆలయంలో దేవకి, జాంబవతి, సత్యభామల విగ్రహాలు కూడా ఉన్నాయి. రుక్మిణీదేవికి మాత్రం ఈ ఆలయానికి దూరంగా ప్రత్యేకంగా ఆలయం ఉంది.
–గోపరాజు పూర్ణిమాస్వాతి
Comments
Please login to add a commentAdd a comment