మన బ్రేక్‌ఫాస్ట్
కేలండర్‌ను ముప్ఫయ్ ఏళ్ల వెనక్కు తిప్పితే... అప్పటి ఆహారపు అలవాట్లు ప్రకృతికి అనుకూలంగా ఉండేవి. సన్‌స్ట్రోక్ తగిలిన తర్వాత కొబ్బరిబొండాంతో సేద దీరడం అన్నది ఏ ఒక్కరికీ అనుభవంలోకి వచ్చి ఉండదు. ఎండాకాలం వచ్చిందంటే ఇడ్లీ పాత్రలు, దోశెపెనాలు అటకెక్కేవి. పొద్దున్నే ఉల్లిపాయతో చద్దన్నం, ఆవకాయతో పెరుగన్నం తింటే ఎంత ఎండలో ఆడుకున్నా పిల్లలకు వడదెబ్బ ఉండేది కాదు. కడుపులో చల్ల కదలకుండా అలిసిపోయే దాకా ఆడుకోవచ్చు, ఆవకాయ రుచిని గుర్తు చేసుకోవచ్చు. ఈ తరం మర్చిపోయిన మన బ్రేక్‌ఫాస్ట్...
ఆవకాయ – పెరుగన్నం
రాత్రి మిగిలిన అన్నంలో ఒక స్పూన్ పెరుగు కలిపి గోరువెచ్చని పాలు పోస్తే ఉదయానికి గట్టిగా పెరుగున్నం తయారవుతుంది. దీంట్లో ఉప్పు వేసి ఉల్లి పాయ, ఆవకాయ పెచ్చు నంజుకు తింటే... నోరూరడం మాట అలా ఉంచితే మైగ్రేన్ నుంచి రిలీఫ్ ఉంటుంది.
చద్ది బువ్వ
అన్నం వండినప్పుడు వార్చిన గంజిని ఒక కుండలో పోయాలి. మిగిలిన అన్నాన్ని అందులో వేస్తే... అదే చద్ది అన్నం. ఆ అన్నంలో కాçస్తంత ఉప్పు, నిమ్మ రసం వేసి దానికి తోడుగా ఉల్లిపాయ కాని, మిరపకాయ కాని తింటే డీ హైడ్రేషన్ అనే పదానికి అడ్రస్సే ఉండదు.
గడ్డపెరుగు – మామిడిపండు
అన్నాన్ని చల్లార్చి అందులో మీగడ పెరుగు వేసి కలిపి, పక్కన మామిడిపండు ముక్కలు కోసి పెడితే పిల్లలకు చక్కటి లంచ్. నవకాయ పిండివంటలు ఉన్నా వాటి వంక కూడా చూడరు. అన్నం, పాలు, పండుతో పూర్తి స్థాయిలో భోజనం చేసినట్లే పోషకాలు అందుతాయి. ఎండ వేడి బాధించదు.