వజ్రం వంటిది వాక్కు
విద్య - విలువలు
సమాజంలో ఎప్పుడూ మూడు రకాల వ్యక్తులు ఎదురవుతుంటారు. నీకన్నా అధికులు, నీతో సమానులు, నీకన్నా తక్కువ వారు. ఈ ముగ్గురితో ఎలా ప్రవర్తించాలో వేదం చెప్పింది. నీకన్నా అధికులు కనబడ్డారు. వారి ఆధిక్యాన్ని నీవు అంగీకరించాలి. మహానుభావుడు ఎంత సాధన చేశాడండీ... ఎప్పటికయినా వచ్చే జన్మకయినా అంత ఎత్తుకు ఎదగాలి అని మీరు వారికి నమస్కరించారనుకోండి. ఇప్పుడు మీరు ఎవరికి నమస్కరించారో వారు గొప్పవారన్నమాట పక్కనబెట్టండి, మీరు గొప్పవారయ్యారు. మీరు సంస్కారవంతులయ్యారు. మీరు నమస్కరించ లేదనుకోండి. అవతలివాడి ఆధిక్యం కించిత్ కూడా పోదు. వారి గౌరవం, వారి విద్వత్తు, వారి జ్ఞానం అలానే ఉంటాయి. పోయింది ఎవరి ఆధిక్యమంటే మనదే. వారి ఔన్నత్యాన్ని మనం అంగీకరించలేకపోయాం.
తేడా మనలో ఉంది. పెద్దలు కనబడితే గౌరవించు. సమానులు కనబడితే... ఎదుటివ్యక్తి నీలాగా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటాడన్న ఆలోచన రావాలి. నీవెంత కష్టపడిందీ నీకు తెలుసు. ఆయనను చూసినప్పుడు ఆదరభావం కలగాలి. ప్రేమతో మాట్లాడగలగాలి. నీకన్నా తక్కువ వారు కనబడితే... ఈశ్వరానుగ్రహంతో ఇతనుకూడా వృద్ధిలోకి రావాలని కోరుకోవాలి. ఇతనికన్నా పైన నేనున్నాను. నా అంతవాడయి నా స్థాయిని చేరుకోగలనన్న తృప్తి ఇతనికి కలుగుగాక, అని ప్రార్థించారనుకోండి. మీ పెద్దరికం నిలబడింది, మీ లాలిత్యం నిలబడింది. ఈ మూడురకాలుగా కాకుండా ఏ రకంగా ప్రవర్తించినా అది తెగడ్త.
జీవిత పర్యంతం చదువుకుంటూనే ఉంటాం. దేనికి!!! సంస్కారబలం వృద్ధి చెందడం కోసం. సమాజంలో మనిషి మనిషిలాగా బతకాలి, పశువులాగా బతకకూడదు కనుక. దానికోసం చదువుకోవాలి. ఈ మూడింటికీ నీవు లొంగలేదు. నిన్ను తెగిడేవాడు కనబడ్డాడు. అప్పుడేం చేయాలి. అతన్ని సంస్కరించే పని చేయాలి. ఈశ్వరా! జారుడుమెట్ల మీద నిలబడి పెకైక్కాలనుకుంటున్నాడు. నిచ్చెన పెకైక్కడానికి కానీ దిగడానికి కాదుగదా. భగవాన్! ఇతను అహంకారంతో ఉన్నాడు. దాన్ని తొలగించి వృద్ధిలోకి వచ్చేటట్లు ప్రయత్నించు. అని వేడుకోవాలి. తెగడ్తను నీవు పుచ్చుకోకూడదు. నీవు స్వీకరించకూడదు. అందుకే వాదన చేయవద్దు అని శాస్త్రం చెప్పింది.
వాదన అగ్నిలో ఆజ్యం పోసినట్లే ఉంటుంది. అది అసూయాజనితం. నీవు తెగడ్తను పుచ్చుకుంటే పాడయిపోయేది నువ్వే. అసూయతో ఉన్నవాడు బాగానే ఉంటాడు. నీ ఆగ్రహం ఎక్కువవుతుంటుంది. చాలాసార్లు పొరపాట్లు జరిగేది ఇక్కడే. అందుకే సంయక్-బాగా తయారవడానికి... సంస్కారాన్ని వినియోగించు.. అని శాస్త్రం చెప్పింది. లోకహితానికి కావలసిన రీతిలో సంస్కారాన్ని పొందు. కేవలం చదువుతో వెళ్ళి కూర్చుంటే సమాజంలో ప్రయోజనాన్ని పొందడంలో వైక్లబ్యాన్ని పొందుతారు.
తెగడ్త-స్వప్రయోజనాన్ని సాధించుకోడానికి దాన్ని సాధనంగా వాడుకోవడం ఒకడు ఇదిలా ఉండకూడదు, అదలా జరగకూడదు అనుకుంటుంటాడు. అది ఎంత మంచి కార్యమయినా అది తను అనుకున్నట్లుగా మారిపోవడానికి తన వాక్కును ఉపయోగిస్తాడు.
అసలు శ్రీరామాయణం అంతా ఎక్కడ మలుపుతిరిగింది! పుట్టినప్పటినుంచి కైకమ్మకు దాదిగా ఉన్న మంధర తప్ప శ్రీరామపట్టాభిషేకానికి అందరూ సంతోషించారు. ఇలా జరగకుండాఉంటే బాగుండుననే ఆలోచన ఆమెకు వచ్చింది. అంతే... కైక మనసులో కల్మషం నింపింది. శ్రీరాముడు, భరతుడు కొద్ది వ్యవధితో పుట్టినవారు. ఒకసారి రాముడు రాజయితే ఇక నీ వంశంలో ఎవరూ రాజుకాలేరు. రాముడి తర్వాత రాముడికొడుకే రాజవుతాడు. భరతుడే కాదు భరతుడి కొడుకు కూడా రాజు కాలేడు. కౌసల్య రాజమాత అవుతుంది. ఇప్పటిదాకా ఇద్దరూ సమానులే. ఇక అలా కుదరదు. రాజమాత వెడుతుంటే నీవు చేతులు కట్టుకుని నమస్కరిస్తూ ఆమె వెనక వెళ్ళాల్సి ఉంటుంది.. అని. మాటలు విషాన్ని ప్రోది చేసేసాయి. రాజయిన దశరథుడు, కౌసల్య, సుమిత్రలు, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘు్నలు, మహర్షులు, యావత్ ప్రజలు అంతా ఒకవైపు నిలబడినా ఒక దాసి మాటలకారణంగా పట్టాభిషేకం జరపలేక పోయారు.
నిజానికి కైకేయి కూడా పట్టాభిషేకానికి సంతోషించింది. కానీ మంధర తన మాటలతో మొత్తం కథను మార్చేసింది. అలా మాట్లాడేవారు రేపు మీ జీవితాల్లోకూడా తటస్థపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు మీరు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళినా, ఎన్ని మంచి పనులు చేస్తున్నా, మీ పక్కనే చేరి ఎవడో దారితప్పిన వాడిని చూపి నీకెందుకీ మంచితనం, నీ కెందుకీ ప్రవర్తన, అని హితబోధ చేస్తున్నట్లుగా చెప్పేవారుంటారు. నీవు చేస్తున్నపని మీద విశ్వాసం ఉంచి ఇటువంటి మాటలను తోసేయడం అలవాటు చేసుకోలేకపోతే వాడు నిన్ను వాడుకుని వదిలేస్తాడు. నీ పని పులిస్తరాకులా తయారయిపోతుంది. అన్నం పెట్టుకుని తింటున్నంతసేపే విస్తరాకుకు గౌరవం. స్వకార్యాన్ని సాధించుకోవడానికి మీ పక్కన చేరిన వారి మాటలకు లొంగిపోవడానికి మీరు అలవాటుపడిపోయారో జీవితంలో మీరు వృద్ధిలోకి రాలేరు. మీ తల్లిదండ్రుల కష్టం, మీ కష్టం, అప్పటిదాకా మీరు సంపాదించుకున్న కీర్తి అడుక్కి వెళ్ళిపోతాయి.
మహామంత్రి తిమ్మరుసు పోతే తప్ప విజయనగర సామ్రాజ్యం పడిపోదు అని తీర్మానించుకున్న వారు చివరకు ఆయనమీద రాయలవారికి లేనిపోనివన్నీ చెప్పారు. రాయలు తిమ్మరుసు కళ్ళు పొడిపించేసాడు. అప్పటికీ రామరాయల వల్ల సామ్రాజ్యం నిలబడినా ఆయనను కూడా తప్పుదోవ పట్టించారు. చివరకు ఇవ్వాళ శిథిలాలు మిగిలాయి. ఒక్కమాటతో రాజ్యం పడిపోయింది. ఒక్కమాటతో మహామంత్రి పడిపోయాడు. ఒక్క మాటతో రామాయణ కథ అడ్డంతిరిగింది. ఒక్కమాటతో రామచంద్ర మూర్తి జీవితపర్యంతం భార్య పక్కన లేకుండా గడిపేశాడు.
మాట అంత శక్తిమంతమైనది. అందుకే ఒక వాక్కు మిమ్మల్ని సర్వ నాశనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని అందుకోలేని ఎత్తులకు తీసుకెళ్ళగలదు అంటాడు. ఏమిటీ, నువ్వు కూడా ఈ ఉద్యోగంలో చేరదామనే వచ్చావా? అని ఎవరయినా అన్నారనుకోండి. మీరు చిన్నబుచ్చుకుంటారు. మిమ్మల్నీ మాటలు పదేపదే బాధిస్తుంటాయి. అప్పుడు నేను వచ్చి ఏం తక్కువయిందని నీకు! నీవెన్ని సాధించలేదు, నీవు తప్పకుండా సాధించగలవు అన్నాననుకోండి. నీ శక్తి ప్రజ్వలనం అవుతుంది. ఒకవాక్కు మిమ్మల్ని పతనం చేయగలదు, ఒక వాక్కు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలదు. అయితే అది పొగడ్త కాకూడదు. యుక్తాయుక్త విచక్షణతో కూడుకున్నదయి ఉండాలి. పెద్దల హితవాక్కులు ఎప్పుడూ వింటూ ఉండాలి. అవే మీకు సంస్కారబలాన్ని నేర్పుతాయి.
మీరు ఎంత గొప్పవారయినా, ఎంత చదువుకున్నవారయినా సమాజంలోని ఇతర వ్యక్తులతో సమన్వయం మీకు చేతకాకపోతే ఎవర్ని దగ్గరగా ఉంచాలో ఎవర్ని దూరంగా ఉంచాలో చేతకానినాడు చాలా చాలా ఇబ్బంది పడతారు. స్వప్రయోజనాభిలాషుడయి మీ దగ్గరచేరి మాట్లాడుతున్నప్పుడు తన కార్యాన్ని సాధించుకోవడానికి నీ శక్తిని వాడుకుంటాడు. ఎందుకో తెలుసా!!! వాడు నీ అంత చదువుకోలేదు, నీ అంత కష్టపడలేదు, నీవు రాసినన్ని పరీక్షలు రాయలేదు, నీవు కూర్చున్న పదవిలోకి వాడు ఈ జన్మకు రాలేడు. కానీ వాడికి ఒక్కటి వచ్చు. మాటలతో మభ్యపెట్టి మీ స్థానాన్ని తన ప్రయోజనం కోసం వాడుకోవడం వచ్చు. ఆ అప్రతిష్ఠ నీది, ప్రయోజనం వాడిది. నీకు జాగ్రత్త పడడం చేతకాకపోతే నీ పెట్టుబడికి వాడు యజమాని ఔతాడు. అందుకే జాగ్రత్త పడమని శాస్త్రం హెచ్చరిస్తుంది.
హితవాక్కు అన్ని వేళలా మృదువుగా, మధురంగా ఉండదు. ప్రతిసారీ చాలా మర్యాదగా, మెత్తగా మాట్లాడటం కుదరదు. రాజశాసనం ఎలా ఉంటుందో అలా ఉండాలి. సత్యంవద ధర్మంచర, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ... అంతేగానీ మీ అమ్మగారిని బాగా చూడు నాన్నా, మీ నాన్నగారిని బాగాచూడు నాన్నా అని చెప్పదు. రాజశాసనం ఎలా కఠినంగా ఉంటుందో అలా ఉంటుంది. మరీ ఇంత కఠినంగా ఉంటే ఎలా అని మన పురాణాలు ఒక స్నేహితుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు... ఇదిగో రేయ్, నీకు ఆఖరిసారి చెబుతున్నా వినకపోతే పాడయిపోతావ్ తర్వాత నీఖర్మ... ఇలా చెబుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది...ప్రియుడు ప్రియురాలితో మాట్లాడినట్లు, ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినట్లు అనునయంగా మాట్లాడితే వినే వాడొకడుంటాడు. తారమాట్లాడితే సుగ్రీవుడు వింటాడు. శ్రీ రామాయణం ఎక్కడా కఠినంగా ఉండదు. అందుకే దానిని కావ్యభాష అంటారు.
వాల్మీకి అంటాడు... ఎవరు ఎలా మాట్లాడతారన్నది తెలుసుకోలేని వాడు కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం నాశనమవుతుంది. వాడు ఒక అధికారి అయితే అక్కడి వ్యవస్థ నాశనమవుతుంది. ఒక గ్రామాధికారయితే గ్రామం, దేశాధినేతయితే దేశం నాశనమవుతాయి. ఆవుల మంద వెనుక ఒక గొల్లవాడు వెడుతుంటే ఆవులు రక్షింపబడతాయి. నక్కవెడితే ఆవులు కనబడవు. అందుకే స్వభావం అన్నారు. నీకు పుట్టుకతో వచ్చినది ఏది, దాన్ని దిద్ది మార్చగలిగినది ఏది... అంటే ఒక్క మంచిమాట. అదే మిమ్మల్ని మారుస్తుంది.