సమాజాన్ని మార్చే సత్తా విద్యకే ఉంది
-
మార్కులు, ఉద్యోగాలకే విద్య పరిమితం కావొద్దు
-
ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే గొప్పవారయ్యారు
-
ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్
తిమ్మాపూర్ : సమాజాన్ని మార్చేశక్తి విద్యకే ఉందని, మార్కులకు, ఉద్యోగాలకు మాత్రమే విద్యను పరిమితం చేయెుద్దని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అల్గునూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో న్యూ క్వాలిటీ పాలసీ (ఎన్‌క్యూపీ)పై ఉపాధ్యాయులకు మంగళవారం జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించగా, ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదని, సర్కారు బడుల్లో చదువుకున్న చాలా మంది ఉన్నత స్థానాలను అధిరోహించారన్నారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన జ్యోతీరావుపూలే, బీఆర్.అంబేద్కర్ వంటివారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే అపరమేధావులుగా కీర్తిగడించారని వివరించారు. ఆ మహనీయుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 250 రెసిడెన్షియల్ స్కూళ్లను కొత్తగా ఏర్పాటు చేస్తోందన్నారు. బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులపై ప్రభుత్వం భారం పడనివ్వడం లేదన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా చేయడం గౌరవంగా భావించుకోవాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పని చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ నీతూప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జెడ్పీటీసీలు పద్మ, శరత్‌రావు, వేణు, ఎంపీపీ ప్రేమలత, ప్రిన్సిపాల్ అనంతలక్ష్మి పాల్గొన్నారు.