విద్యారంగానికి రూ. 10,956 కోట్లు
* ఇందులో కేంద్ర నిధులు రూ. 3,418 కోట్లు
*మోడల్ స్కూళ్లకు రూ. 904 కోట్లు
* ‘కేజీ టు పీజీ’కి రూ. 25 కోట్లు, రూసాకు రూ. 10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి రూ. 10,956 కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను కలుపుకొని ఈ మొత్తాన్ని ప్రతిపాదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయంగా రూ. 3,418 కోట్లు వస్తాయని అంచనా వేసింది. దీంతో బడ్జెట్‌లో విద్యా రంగానికి 10.88 శాతం నిధులు దక్కాయి. అయితే ఈసారి కొత్త పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కేజీ టు పీజీ పథకానికి ముందస్తు ఏర్పాట్ల కోసం రూ. 25 కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో మరిన్ని నిధులు అందించనుంది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రూ. 10 కోట్లు కేటాయించింది.
అలాగే సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న బాసరలోని ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి రూ. 119.63 కోట్లు కేటాయించింది. ఇక కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొనసాగే మోడల్ స్కూళ్ల అభివృద్ధికి రూ. 904.73 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉపాధ్యాయ శిక్షణ కోసం రూ. 906.43 కోట్లు ప్రతిపాదించింది. ఇంటర్మీడియట్ విద్యకు రూ. 426.45 కోట్లు దక్కాయి. పలు కొత్త పథకాలకూ ప్రభుత్వం నిధులను కేటాయించింది.
గిరిజన ప్రాంతాల్లో హాస్టల్ వసతితో కూడిన 5 పాలిటెక్నిక్ కాలేజీలు, ఎస్సీలకు పాలిటెక్నిక్ భవనాల నిర్మాణానికి రూ. 7.49 కోట్లు అందించనున్నట్లు పేర్కొంది. అలాగే కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం గనుల పాఠశాల నిర్వహణ కోసం రూ. 1.89 కోట్లు కేటాయించింది. కరీంనగర్‌లో ఏర్పాటు చేసే కొత్త ఇంజనీరింగ్ కాలేజీ కోసం జేఎన్టీయూకు రూ. 3.75 కోట్లు అందించనుంది. అయితే కేంద్ర సహకారంతో కొనసాగించే సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కార్యక్రమం(టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం-టెక్విప్) అంశాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించలేదు.
యూనివర్సిటీలకు కేటాయించిన నిధులివే..
యూనివర్సిటీలకు ప్రభుత్వం రూ. 292.02 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. రాష్ట్ర విభజనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీపద్మావతి మహిళ విశ్వ విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీసుకొమ్మని రాష్ట్ర అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో మాత్రం ఆ యూనివర్సిటీకి వేతనాలు, ఇతర గ్రాంట్ల కింద రూ. 10 కోట్లు కేటాయించారు. ద్రవిడ విశ్వ విద్యాలయానికి కూడా రూ. 3.22 కోట్లు కేటాయించారు. మంథని జేఎన్‌టీయూ కాలేజీకి రూ. 170 కోట్లు, సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ కాలేజీకి రూ. 50 కోట్లు కేటాయించారు.
అలాగే... ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 170.14 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ. 47.88 కోట్లు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి రూ. 6.75 కోట్లు, అంబేద్కర్ విశ్వ విద్యాలయానికి రూ. 5.74 కోట్లు, తెలంగాణ వర్సిటీకి రూ. 20 కోట్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి రూ. 15 కోట్లు, శాత వాహన యూనివర్సిటీకి రూ. 8 కోట్లు, పాలమూరు యూనివర్సిటీకి రూ. 4.78 కోట్లు, హైదరాబాద్ జేఎన్‌టీయూకు రూ. 39 కోట్లు ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.