
నెగడు
టూకీగా ప్రపంచ చరిత్ర 19
‘‘అగ్నిమిళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ హోతారం రత్నధాతమం॥ అగ్నిః పూర్వేభిరృషిభిరోడ్యో నూతనైరుత
స దేవా ఏహ పక్షతి॥ అగ్ని నా రయమశ్నవత్ పోషమేవ దివేదివే యశనం వీరవత్తమమ్॥ అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స ఇద్ దేవేషు గచ్ఛతి॥ అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవాభిరాగమత్॥’’
(ఋగ్వేదం)
(అగ్ని పురోహితుడు (ప్రాచీనుడు), దేవతల ఋత్విజుడు, హోత, సంపద ప్రదాత. అట్టి అగ్నిని స్తుతిస్తున్నాను. అగ్నిని పూర్వఋషులూ, ఇప్పటి ఋషులూ పూజిస్తున్నారు. అగ్ని దేవతా సహితంగా విచ్చేస్తాడు. అగ్ని వలన ధనమూ, విజ్ఞానమూ, సంపదలూ, శక్తీ కలుగుతున్నాయి. అగ్ని వల్ల కీర్తి, సంతానము కలుగుతున్నాయి. అగ్నియే యజ్ఞములను కాపాడుతున్నది. దేవతలకు చేరుస్తున్నది. అగ్నియే హోత, విజ్ఞాని, సత్యము, యశస్సు, అగ్ని దేవతాసహితుడై అరుదెంచేవాడు.)
ఈ బుక్కుతో వేదం మొదలవుతుంది. ఋగ్వేదంలో 200 ఋక్కులకు పైగా కేవలం అగ్నిని స్తుతించేవే. దీన్నిబట్టి అనాది నుండి అగ్నికుండే ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందంటే, అగ్నివల్ల ప్రాప్తించింది భద్రత, నాగరికతలు మాత్రమే కాదు; జీవరాసి సమస్తం నుండి అది మనిషిని వేరుచేసి, ప్రాణి ప్రపంచంలో అతనికి ప్రత్యేక స్థానం నెలకొల్పింది.
భారతదేశానికి ఆర్యుల నుండి పురాణాలు సంక్రమించినట్టే యురోపియన్లకు గ్రీకుల నుండి పురాణాలు సంక్రమించాయి. వాటిల్లో అతి పురాతనమైందిగా చెప్పుకునేది ‘ఇలియడ్.’ అందులో అగ్నికి సంబంధించిన కథ ఒకటుంది. ప్రొమీథియస్ అనే మానవుడు చాలాగొప్ప బలశాలి. దేవతలకు యుద్ధం జేసే అవసరమొస్తే అతన్ని సహాయంగా పిలుచుకుంటారు.
ఆవిధంగా దేవతలకు సమకూరిన ఒకానొక విజయం తరువాత ప్రొమీథియస్ గౌరవార్థం దేవతలు విందును ఏర్పాటు చేస్తారు. ఆ విందులో ‘కబాబ్’ వడ్డించారో ఏమో, దేవతలు నిప్పును ఉపయోగిస్తున్నట్టు ప్రొమీథియస్‌కు తెలుస్తుంది. ఆ వైభవం మానవలోకంలో లేదు. అందువల్ల, ఎలాగైనా దాన్ని మానవులకు చేర్చాలన్న తాపత్రయంతో, దేవలోకం నుండి నిప్పును దొంగిలించి భూలోకం తీసుకొస్తాడు. అది దేవతల ఆగ్రహానికి కారణమౌతుంది. ప్రతీకారం తీర్చుకునేందుకు వాళ్ళొక పథకం రచిస్తారు. చూడగానే మతి తప్పేంత అందమైన అమ్మాయిని ప్రొమీథియస్ దగ్గరకు పంపిస్తారు. ఆమె పేరు పండొరా. కన్యాశుల్కంగా తనవెంట ఆమె తీసుకొచ్చిన మందసం ‘పండొరాస్ బాక్స్.’ ఆమె హొయలు ప్రొమీథియస్‌ను జయించవుగానీ, అతని తమ్ముడు ఎపిమీథియస్‌ను లోబరచుకుంటాయి. అన్న హెచ్చరికలను ఖాతరు చెయ్యకుండా అతడు పండొరాను పెళ్ళాడి, ఆమె కానుకగా తెచ్చిన మందసాన్ని తెరవగానే, అందులో దాగున్న వ్యాధులన్నీ భూలోకంలో వ్యాపిస్తాయి. ఆ విధంగా మానవజాతి మీద దేవతల అక్కసు తీరుతుంది.
‘ఇది నమ్మదగిందేనా?’ అనేదిగాదు ఇక్కడ మన చర్చ. ఇలియడ్ చెప్పినా, భారతం చెప్పినా శ్రోతల ఆసక్తిని చూరగొనేందుకు కథకుడు పలురకాల కల్పనలు చేయడం ఆనవాయితి. కుతూహలం రేకెత్తించని కథ జనంలో నిలవదు.
అందువల్ల, మనం దృష్టిని కేంద్రీకరించవలసింది నిప్పు కోసం దేవతలనైనా ఎదిరించేందుకు మానవుడు సిద్ధపడిన సాహసం మీద. ఒక చోట జరిగింది నిప్పు కోసం సాహసమైతే, ఇంకొకచోట దొరికిన నిప్పును కాపాడుకోవడం ‘నిత్యాగ్నిహోత్రం’ పేరుతో వ్రతమయింది. వెనుకటి రోజుల్లో నిప్పుకుండిన ప్రాధాన్యత ఎంత గొప్పదంటే, అది కథగానో వ్రతంగానో మానవుని మస్తిష్కంలో వేల సంవత్సరాలు నిలిచిపోక తప్పనంత బృహత్తరమైంది. అది మానవునికి సమస్త జీవజాలం మీద తిరుగులేని పెత్తనాన్ని కట్టబెట్టిన ఆయుధవిశేషం.
రచన: ఎం.వి.రమణారెడ్డి