టూకీగా ప్రపంచ చరిత్ర 71
లిపి
‘లిపి’ అనేది మాటకు కల్పించబడిన రూపం. చెవులతో మాత్రమే గ్రహించేందుకు వీలయ్యే మాటను కంటితో గ్రహించేందుకు వీలుగా ఏర్పాటైన సౌకర్యం లిపి. గొంతు నుండి వెలువడే పలురకాల శబ్దాలను దేనికి దానిగా తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన అక్షరాల సమాహారం లిపి. ఒక తరంలో పుట్టిన విజ్ఞానం ఆ తరంలోనే అంతరించకుండా, తరువాతి తరాలకు అందించే సాధనంగా నాగరికతకు కొత్తకోణం ఆవిష్కరించిన ఘనత లిపికే దక్కుతుంది. అందులోని అక్షరాల ఉచ్చారణ వల్ల గోచరరూపం దాల్చిన మాట, తిరిగి శబ్దరూపానికి బదిలీ అవుతుంది.
అక్షరాలకంటే ముందు సమాజంలో ప్రవేశించినవి అంకెలు. రాతియుగం పరికరాల్లో పాచికలను పోలిన గుర్తుండే గులకరాళ్లు దొరికిందాన్ని బట్టి, ఒకటి రెండు లెక్కించుకునే పరిజ్ఞానం అప్పటికే ఏర్పడి వుండొచ్చు. అయితే, అంకెలతో ప్రయోజనం అప్పట్లో అంతగా ఉండి ఉండదు. మానవుడు పశువుల కాపరి జీవితంలో ప్రవేశించిన వెనువెంటనే అంకెల పరిజ్ఞానాన్ని మెరుగు పెట్టుకోవలసిన అవసరం తన్నుకొచ్చింది. తన మందలో జీవాలు ఎన్ని ఉన్నాయో లెక్కించుకునేందుకు ప్రాథమికమైన గణితం కావాల్సి వచ్చింది. పెద్ద పెద్ద బండలమీద బొగ్గుతోనో, సుద్దతోనో వేలెడంత నిడివిగల గీతలతో అతని గణితం మొదలయింది. జీవాల సంఖ్య పెరిగినప్పుడు గీతలు పెంచడం, తరిగినప్పుడు నిలువుగీతను చిన్న అడ్డగీతతో రద్దుపరచడం.
వలస జీవితంలో నివాసం మారినప్పుడల్లా రద్దుకాకుండా మిగిలిన నిలువు గీతలన్నింటిని కొత్త ప్రదేశంలో తిరిగి గీసుకుంటూపోవడం ప్రయాసతో కూడిన పనిగా కొంతకాలానికి తెలిసొచ్చింది. ప్రత్యామ్నాయంగా, సంఖ్యను గుర్తుంచుకునేందుకు గులకరాళ్లనూ, బంకమట్టి బిళ్లలనూ ఆశ్రయించాడు. బండరాళ్లు దొరకని మెసపొటేమియా వంటి ప్రదేశాల్లో బంకమట్టి బిళ్లలు అంతకుముందే ఉనికిలోకి వచ్చిండొచ్చు కూడా. ఈ దశలో అతనికి ఇష్టమైనవి జత, ఉడ్డా (నాలుగు), డజను (పన్నెండు) వంటి సరిసంఖ్యలు. వాటిని భాగించడం తేలిక. భాగించేందుకు బేసి సంఖ్యతో తకరారు. ఆ రాళ్లనో బిళ్లలనో పాత్రలో భద్రంచేసి, ఉరువు (ఐటెమ్) కలిసొచ్చినప్పుడు ఒక బిళ్లను కలపడం. తరిగినప్పుడు పాత్ర నుండి ఒకటి తీసేయడం ద్వారా తన జ్ఞాపకశక్తికి సహకారంగా భౌతికమైన ఆధారాన్ని కల్పించుకున్నాడు. ఒంటిగీత బిళ్ల ఒకటి సంఖ్యకు, రెండుగీతలు రెండుకు, మూడు గీతలు మూడుకు సంకేతాలయ్యాయి. ఒకే బిళ్లమీద నాలుగు గీతలకు మించి ఇమడకపోయినా, ఈ పద్ధతివల్ల బిళ్లల సంఖ్య ఇదివరకటి కంటే చాలా తగ్గుతుంది.
కానీ, అదే పనికి ఇంకా ఇంకా తేలికైన మార్గాలను అన్వేషించేందుకు తపనపడే మెదడు, ఉన్నచోటునే ఆగిపోదు. దానికి తోడు, జీవితంలో వర్తకం ప్రవేశంతో, దానికి అనుకూలంగా తమ రూపు రేఖలు దిద్దుకోవలసిన అగత్యం అంకెలకు ఏర్పడింది. దశలవారీగా అంకెలకు సంభవించిన మార్పుకు సూచనగా ‘రోమన్’ అంకెలతో తయారైన గడియారాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ పద్ధతిలో ఒకటి, రెండు మూడు సంఖ్యలకు మన మామూలుగా వాడుతున్న అంకెలకు మారుగా, ఐ, ఐఐ, ఐఐఐ అనే సంకేతాలుంటాయి. రోమన్లు ఇటీవలి కాలం దాకా (బహుశా ఇప్పుడు కూడా) అంకెలకు నిలువు గీతలే వాడుకున్నారు. గీతల వరుస ఇలా అనంతంగా పొడిగించుకుపోతే సౌకర్యం తగ్గుతుంది. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు, కొన్ని కొన్ని స్థానాల్లో వాటిని తెంచుకుంటూ వచ్చారు. ఉదాహరణకు - ఐదు అంకెకు సంకేతం, గ, పదికి గీ, యాభైకి ఔ, నూటికి ఇ - ఇలా. ఈ పెద్ద సంఖ్యల నుండి ఒకటి తగ్గించాలంటే దానికి ఎడమవైపు గీత, పెంచాలంటే కుడివైపు గీతలతో సూచించారు. రోమన్లకు వలెనే మిగతా నాగరిక ప్రదేశాల్లో కూడా వారివారి సదుపాయాన్నీ, ఆలోచననూ బట్టి, రకరకాల అంకెలు ఏర్పడుతూ వచ్చాయి. కానీ, విస్తరించే వాణిజ్యం ధాటికి తట్టుకోలేక అవి వాడుక నుండి తప్పుకోవడంతో, అరబిక్ సంప్రదాయంలో పుట్టిన అంకెలు ఇప్పటి ప్రపంచాన్ని ఏలుతున్నాయి.
రచన: ఎం.వి.రమణారెడ్డి