టూకీగా ప్రపంచ చరిత్ర 73
లిపి
వాస్తవ చరిత్ర కంటే అలౌకిక శక్తులతో మిళితమైన కథ (ఫాంటసీ) ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కోవకు చెందిన కథలను గానంగా ప్రజలకు వినోదాన్ని కలిగించిన ‘బార్డ్స్’ కాలంలోనే ఈ ప్రక్రియ సమాజంలో ప్రవేశించి ఉండొచ్చు. అదే కోవలో, గిల్‌గమేష్ పేరుండే ఒక పాలకుని కథ ఈ పదకవిత. చరిత్రకు దొరికిన సాహిత్యంలో ఇదే మొదటిది. అంతమాత్రాన ఇదే మొదటి సాహిత్యమని చెప్పలేం. ఎన్నో తరాలకు ముందే పుట్టిన సాహిత్యం మౌఖికరూపంలో ఉండిపోవడంతోనో, కాలానికి నిలువని పదార్థాల మీద లిఖితం అయ్యుండడం వల్లనో అవి చరిత్రకు దొరకలేదు. అనాది లిపిగా మనమెరిగిన క్యూనిఫాం లిపిలో ఉండడం వల్లనూ, అనాది పరికరమైన మట్టిపలక మీద లిఖించివుండడం వల్లనూ, తరువాతి కాలానిదిగా ఎరిగిన బైబిల్లో కొన్ని పాత్రలూ సంఘటనలూ గిల్‌గమేష్‌కు పోలివుండడం వల్లనూ, ఇలియడ్ వంటి కథాగానాలు దీన్ని ఒరవడిగా స్వీకరించడం వంటి కారణాల మూలంగా, ప్రస్తుతానికి ప్రపంచంలోని మొట్టమొదటి గ్రంథంగా గిల్‌గమేష్‌కు ఆదరణ దక్కింది.
గ్రంథరచన స్థాయికి ఎదిగినా, తనలోని వెలుతులను సంపూర్ణంగా పూడ్చుకునేందుకు క్యూనిఫాం లిపి సాధ్యపడలేదు. చిత్రలిపి ఏ తరహాదైనా, దాని ఇబ్బందులు దానికి ఉంటూనే వచ్చాయి. మార్పులు ఆశిస్తున్న చిత్రలిపి కొంతకాలానికి కుంచెకు తేలిగ్గా ఉండే సరళీకృత రూపం సంతరించుకుంది. ఆ రూపాలను రోడ్‌క్రాసింగ్, కుటుంబ నియంత్రణ వంటి ప్రకటనల్లో మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు - ఒక నిలువు గీత మోసిన వృత్తం తల, తలకింద ఇరువైపులకు సాగే ఏటవాలు గీతలు చేతులు; గీత అడుగున లిఖించిన నిలువుగీతల జంట కాళ్లజత; దానిపక్కన రెండు సెంటీమీటర్లు చిన్నదిగా గీసిన అదేబొమ్మ తలకు కొప్పును చేర్చితే భార్య; వాళ్లపక్కన అదే తరహాలోని గీసిన పొట్టిబొమ్మలు చిన్నబొమ్మల్లో బోడిగా ఉండేది బాలుడు, రెండు జడలుండేది బాలిక. ఈ తరహా చిత్రసంకేతాల పద్ధతి కుంచెకు తేలిక.
చిత్రలిపికి తరువాతి దశ ‘భావచిత్రలిపి (ఇడియోగ్రామ్); అంటే, ఒకే బొమ ఆక్రమించే స్థలంలో మరో బొమ్మను జతగూర్చి భావన్ని కలుగజేయడం. ఉదాహరణకు ఎడంఎడంగా ఉండే రెండు నిలువుగీతల మీద మూత కప్పినట్టుండే ఏటవాలుగీతను కలిపితే ఇల్లు; ఆ గీతల మధ్య మనిషి బొమ్మను గీస్తే ‘స్వగృహం’; అలాగే పంజరం, అందులో పక్షి మొదలైనది. దీనికి తరువాతి దశ ‘శబ్దచిత్రలిపి (ఫొనోగ్రామ్)’. ఒక్కొక్కసారి ఒకే శబ్దం అనేక అర్థాలకు ప్రతీకగా ఉండటమేగాక, ఒకే శబ్దం కొన్నిసార్లు నామవాచకంగానూ, మరికొన్నిసార్లు క్రియగానూ వాడబడటంవల్ల, శబ్దచిత్రలిపితో అవసరం ఏర్పడింది. ఉదాహరణకు ఇంగ్లీషు పదం ‘బాక్స్’ అనేది పెట్టెనూ సూచిస్తుంది, పిడికిళ్లతో కొట్టుకోవడాన్నీ సూచిస్తుంది. ఇలాటి సమస్యలకు పరిష్కారంగా ఫోనోగ్రాఫిక్ లిపి అవతరించింది. చతురస్రంగా గీసిన నాలుగు గీతల మీద తెరిచివున్న మూతలాగా ఒక ఏటవాలు గీతను కలిపితే అది పెటే దాని లోపల నాణెంను సూచించే చిన్న వృత్తం గీస్తే గళ్లాపెట్టె లేదా ఖజానా; వృత్తానికి మారుగా పెట్టేమీద రెండు ఏటవాలుగా ఢీకొంటున్న కత్తులు గీతస్తే అది ముష్టియుద్ధం.
సవరణలు ఎన్ని తీసుకొచ్చినా, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న భాషను ఇమిడించుకోవడం చిత్రలిపికి సాధ్యపడిందిగాదు. ఇలాటి సంధి సమయంలో, ఉచ్చారణకు సంకేతమైన అక్షరరూపాలను (ఆల్ఫాబెట్స్) తొట్టతొలిగా ఆవిష్కరించి ఫొయెనీసియన్లు (ఇప్పటి లెబనాన్ ప్రాంతం). దాన్ని గ్రీకులు అందుకుని మెరుగులు దిద్ది, క్రీ.పూ. శతాబ్దంలో అచ్చులనూ హల్లులనూ వేరువేరుగా గుర్తించే అక్షరమాలను ప్రవేశపెట్టింది. యూరప్‌లోని భాషలన్నీ గ్రీకు సంప్రదాయాన్ని అనుసరించగా, తూర్పుదేశాలు మరో సంప్రదాయంగా చేరినప్పుడే శబ్దం ఉత్పన్నమౌతుంది. ప్రాచర్యపద్ధతిలో ఏ అక్షరానికి ఆ అక్షరమే శబ్దం. ఈ పరిణామం తరువాత, చిత్రలిపి చిన్నపాటి ఉపాంగంగా మిగిలిపోయింది.
మిగతావాళ్లకు మల్లే చైనీయుల రాత చిత్రలిపితో మొదలయింది. అయితే చదువుకునే క్రమం ఎడమ నుండి కుడికీగాడు, కుడి నుండి ఎడమకూ కాదు; ఎగువ నుండి దిగువకు నడపడం వాళ్ల ప్రత్యేకత. అనాదికాలంలో వ్రాతకు ఉపరితలంగా వాళ్లు ఉపయోగించినవి తాబేటి చిప్పలు, పశువుల గూడబొమికె (స్కాపులా). ఆ తరువాత పట్టురుమాళ్లూ, వెదురుబిళ్లలూ రంగంలోకొచ్చాయి. బట్టమీద రంగుదారాల అల్లిక (ఎంబ్రాయిడరీ)లో చైనీయులది అందెవేసిన చెయ్యి. ఆ దేశం పట్టుకే కాదు, వెదురుకు కూడా ప్రసిద్ధి. వెదురుతో వస్తువుల తయారుజేసే ప్రావీణ్యత ఇంతింతగా పెరిగి, కాగితం తయారీకి ఆస్కారం అందువల్లే కలిగించింది. ఐనా, వాళ్ల లిపి మాత్రం ఇప్పటికీ ఫొనోగ్రఫీకి దగ్గరలోనే ఆగిపోయింది. వేలాది సంకేతాలను క్షుణ్ణంగా నేర్చుకుని, చూడగానే గుర్తించగలిగేంత చురుకుకు అలవాటు పడితేగాని ఆ భాషను చదివేందుకు వీలుపడదు. ఆ లిపి మిగతావాళ్లకు ఒరకరాని కొయ్య. తేలికైంది కాదని తెలిసి గూడా, చైనా, జపాన్, కొరియాలు తమ రాతను అక్షరలిపికి మార్చుకునేందుకు సుముఖత చూపడంలేదు.
రచన: ఎం.వి.రమణారెడ్డి