న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్ ఉందని పిటిషన్‌లో డ్రీమ్11 పేర్కొంది.
‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్ నోటీసు జారీ తగదు. పిటిషనర్ (డీ11) అందించిన ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది. జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం.
గేమింగ్ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి!
పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్‌టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం. రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్‌టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్‌టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్‌టీ రికవరీ కోసం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ గేమ్‌స్‌క్రాఫ్ట్‌కు ఇదే విధమైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment