కళాత్మకం : ప్రతి బొమ్మా ‘కదిలించే’ కథే!
గోండుచిత్రకార్ సుఖీరామ్ మరావీతో సంభాషణ
గోండుల చరిత్ర మౌఖికం. వేదాలను లేదా దివ్యప్రబంధాలను కంఠతా పట్టే పరంపర వలె గోండుల చరిత్రను ప్రధాన్ అనే పూజారి వర్గం కంఠస్థం చేస్తుంది. జంగారామ్‌సింగ్ ప్రధాన్ తమ వారి మౌఖిక చరిత్రలోని గాథల ఆధారంగా పెయింటింగ్‌లు వేసి పాశ్చాత్యప్రపంచానికి గోండు కళను పరిచయం చేశారు. అతని దారిలో కొత్తతరం ఆధునిక విద్యను నేర్చుకుంటూ, తమదైన చిత్రకళను మెరుగు పరచుకుంటోంది. ప్రధాన్ పరంపరకు చెందిన గోండ్ చిత్రకారుడు సుఖీరామ్ ఇటీవల స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన ‘చిత్రమేళా’లో పాల్గొన్నారు. భోపాల్‌లో బి.ఎస్.సి నర్సింగ్‌కోర్స్ చేస్తూ ఐదారేళ్లుగా గోండ్ ఆర్ట్‌లో కృషిచేస్తోన్న సుఖీరామ్ తన చిత్రాల తాలూకు కథను చెప్పారు.
మనిషి మూఢత్వం... పక్షి కారుణ్యం!
కట్టమంచి రామలింగారెడ్డి ‘ముసలమ్మ మరణం’ అనే అపూర్వ కావ్యాన్ని 113 సంవత్సరాల క్రితం రచించారు. ఇదే తరహా సంఘటనను సుఖీరామ్ మరావీ చిత్తరువు వినూత్నంగా చెబుతుంది!
‘చిత్రంలోని చెట్టుపై రాయ్‌కి ధనియా పక్షి గూడు కట్టుకుంటుంది. ఆ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఏడుగురు అన్నలు, ఒక చెల్లి ఉంటారు. ఏడుగురు అన్నల్లో ఒక అన్న భార్య చెల్లిని బాగా ఏడ్పిస్తుంది. పగిలిన కుండను అతికించి అందులో నీళ్లు పట్టమంటుంది. ఎన్నో కష్టాలు పెడుతుంది. ఒక రోజు చెరువులో చేపలు పట్టడానికని ఆడబిడ్డని తీసుకెళ్తుంది. చెరువు ఒడ్డు తె గి ప్రవహిస్తుంటుంది. గట్టు తెగకుండా ఉండాలంటే ఒక మనిషిని అందులో పూడ్చాలి అని కొందరంటారు. అదే అదనుగా ఆమె తన ఆడపడచుని గట్టులోకి దించుతుంది. అందరూ ఆమెపై మట్టి వేస్తారు. నదిలో ఒక పెద్ద చేప మట్టిని తొలచుకుని వచ్చి ఆమెని మింగేస్తుంది. ఒక జాలరి వలలో ఆమెను మింగిన చేప పడుతుంది. చేప పొట్టలో ఉన్న ఆడపడుచు ‘జాలరన్నా నన్ను రక్షించు, నిన్ను తండ్రిలా భావిస్తాను’ అంటుంది. ఇదేదో భూతంలా ఉందని జాలరి పారిపోతాడు. చేపలోని అమ్మాయి రోదిస్తుంది. మనిషి ఆక్రందన విని రాయ్ దగ్గరకు ధనియా పక్షి వస్తుంది. చేప తలను కొరికి చిట్టితల్లిని రక్షిస్తుంది. తన పిల్లలతో పాటే తాను తెచ్చిన ఆహారాన్ని ఈ అమ్మాయి నోటికీ అందిస్తుంది’వినడానికే ఈ కథ ఇంత అందంగా ఇంపుగా ఉంటే... బొమ్మల్లో చూడడానికి ఇంకెంత సొంపుగా ఉంటుందో!
- పున్నా కృష్ణమూర్తి