రాష్ట్ట్రమ్రంతా.. ఉరిసాగు | Everything rasttra hanging cultivation .. | Sakshi
Sakshi News home page

రాష్ట్ట్రమ్రంతా.. ఉరిసాగు

Published Wed, Jun 1 2016 12:18 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

రాష్ట్ట్రమ్రంతా.. ఉరిసాగు - Sakshi

రాష్ట్ట్రమ్రంతా.. ఉరిసాగు

రైతు ప్రాణాపాయంలో ఉంటే

 

మీ రక్షణకు 5.5 కోట్ల బస్సా?...
రైతుకు సెక్యూరిటీ అక్కర్లేదు. అతడు నిర్భయంగా పొలానికి వెళతాడు. కారు చీకటిలో కూడా నిర్భితీగా పొలానికి కాపాలా కాస్తాడు. పంటకు పట్టే చీడపీడలను ఎంతో సాహసంగా ధైర్యంగా ఎదుర్కొంటాడు. కాని పాలకులు అలా కాదు. ప్రతి క్షణం భయపడతారు. ప్రతి క్షణం తమ రక్షణ కోరుకుంటారు. ప్రతి క్షణం తమ ప్రాణాల భద్రత చూసుకుంటారు. ఈ విషయాన్నే తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంకు చెందిన రైతు సింహాద్రి వెంకటేశ్వరరావు (59) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎత్తి చూపాడు. ‘నేడు రాష్ట్రంలో బ్యారెన్ లెసైన్సులు కలిగిన 14,000 మంది పొగాకు రైతులు అప్పుల ఊబిలో కూరుకుని ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నారు. మీరు మాత్రం ఐదున్నర కోట్లు పెట్టి మీ భద్రత కోసం బస్సు తయారు చేసుకున్నారు. అంటే మీ ప్రాణానికి తప్ప రైతు ప్రాణానికి విలువ లేదా.  పొగాకు రైతుల్లో ఒక్కరు కూడా ప్రాణత్యాగం చేయడానికి నిరోధించడానికి నేను ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని సెప్టెంబర్ 2015లో ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. సొంతవూళ్లో చాలా కాలం సొంత భూమిలో పొగాకు పండించిన వెంకటేశ్వరరావు  నష్టాల వల్ల  భూమిని అమ్మేసి ఊరిలోని దేవాలయ భూమిని 22 ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు వేశాడు. కాని నష్టాలు వచ్చాయి. అప్పు పెరిగిపోయింది. చంద్రబాబుకు లేఖ రాసినా ఫలితం లేకపోవడంతో పురుగుల మందు తాగి వెంకటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. సేద్యానికి, ప్రకృతి వైపరిత్యాలకి భయపడని ఒక రైతు కేవలం అప్పు అనే రెండక్షరాల పదానికి భయపడి నిండు జీవితాన్ని అర్ధంతరంగా ముగించాడు.

 

అన్నం పెట్టే రైతుకు చెత్త పెట్టిన ప్రభుత్వం
రైతు అన్నం పెడతాడు. ఆకలి తీరుస్తాడు. తను మట్టి పిసికి మనకు మాత్రం ఆయుష్షును పోస్తాడు. కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు బదులుగా అతడికి చెత్తతో సన్మానం చేసింది. అవమానించి ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో 45 ఏళ్ల ఆదినారాయణ అనే రైతు పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నాడు. అయితే చాలా కాలంగా అతడు ఆస్తి పన్ను కట్టలేకపోతున్నాడు. మునిసిపల్ అధికారులు నోటీసులిస్తే వారి నుంచి వాయిదాలు అడుగుతూ పన్ను కట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. కాని మునిసిపల్ అధికారులు ఓపిక పట్టలేకపోయారు. రైతు అని కూడా చూడకుండా అతడు ‘ఎగవేతదారుడు’ అని లోకానికి తెలియచేయడానికి నిశ్చయించుకున్నారు. మార్చి 29, 2015నాడు ఇంటి ముందుకు చెత్త ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టి వెళ్లిపోయారు. చెప్పుకు అంటిన పేడ ఇంటి వాకిలికి అంటితేనే ఎవరైనా ఎంతో బాధ పడతారు. అలాంటిది ట్రాక్టరు చెత్త తెచ్చి ఇంటి ముందు పెడితే? పన్ను ఎగవేసే బాడాబాబుల పట్ల ఇలా ఎవరూ వ్యవహరించరు. కాని రైతు అనే సరికి ప్రతి ఒక్కరికీ అలుసు. రైతు ఆదినారాయణ ఈ అవమానాన్ని భరించలేకపోయాడు. తన ఇంటి ముందున్న చెత్త ట్రాక్టరును చూసి ఇంట్లోకెల్లి ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, కొడుకు దిక్కులేని వారై మిగిలారు. ఈ పాపం ఎవరిది?

 

రుణమాఫీ ఆశ  తీసింది శ్వాస...
అందలం ఎక్కడానికి అబద్ధాన్ని ఒక నిచ్చెనగా వాడుకుంటే వచ్చే ఫలితాలు విషమంగానే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ‘రుణమాఫీ’ నినాదాన్ని హోరెత్తించి అధికారంలోకి వచ్చింది. కాని ముందొకమాట తర్వాత ఒకమాట వైఖరితో అది రైతుల ఆశల మీద నీళ్లు పోసింది. ఫలితం ఒక రైతు ప్రాణం బలైంది. వై.ఎస్.ఆర్ కడప జిల్లా మల్లెంవారిపల్లెకు కొలవలి సుబ్రహ్మణ్యం రెడ్డి (45) తన రెండున్నర ఎకరాల వ్యవసాయం కోసం బ్యాంకులో ఐదు లక్షల అప్పు చేశాడు. కాని వర్షాభావ పరిస్థితులు, బోర్లలో నీరు ఎండిపోవడం ఇవి పంటను రైతునూ నష్టపరిచాయి. ఆ సమయంలోనే చంద్రబాబు హామీ ప్రాణం పోసింది. రుణమాఫీ చేస్తే తాను అప్పుల ఊబి నుంచి బయటపడతానని ఆశపడ్డాడు. అయితే ఎన్నాళ్లు ఎదురు చూసినా రుణమాఫీ జరగకపోవడంతో పురుగుమందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా ఆత్మహత్యకు చంద్రబాబే కారణం’ అని అతడు రాసిన సూసైడ్ నోట్‌లో ఉంది. ఒక రైతు తన ముఖ్యమంత్రి పేరు రాసి ప్రాణాలు వదలడానికి మించి ఒక ప్రభుత్వానికి మచ్చ ఉంటుందా? ఈ చావుకు ఎవరు జవాబు చెప్తారు?

 

లెక్క వేరు... నిజం వేరు!
1995 నుంచి చూస్తే 2014 కల్లా దేశంలో రైతుల ఆత్మహత్యలు ఏకంగా 3 లక్షలు దాటాయి.2014 నుంచి ‘జాతీయ నేర రికార్డుల బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి) తాను ఏవేవి ఏ నేర విభాగం కిందకు వస్తాయో లెక్కించే పద్ధతిని (మెథడాలజీని) మార్చుకుంది. ఈ కొత్త పద్ధతిలో పెట్టుకున్న కొత్త పరామితుల వల్ల 2014 నుంచి రైతు ఆత్మహత్యల మరణాల్ని కూడా కొత్త, ఇతర విభాగాల్లోకి చేర్చేస్తున్నారు. దాంతో, రైతు ఆత్మహత్యల సంఖ్య అంతకు ముందు ఏడాది కన్నా తగ్గినట్లు పైకి లెక్కల్లో కనిపిస్తోంది.

     
మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా), కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ - ఈ 5 రాష్ట్రాల్లో దేశంలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దశాబ్ద కాలంగా - దేశం మొత్తంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల్లో మూడింట రెండు వంతులు ఈ 5 రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయి. అయితే, 2014 నుంచి ఎన్.సి.ఆర్.బి. కొత్త మెథడాలజీ ప్రకారం ఈ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పైకి మాత్రం తగ్గిపోయినట్లు కనిపించడం విచిత్రం.

     
వేలాది కౌలు రైతుల ఆత్మహత్యల్ని కూడా ‘రైతు కూలీల’ఆత్మహత్యల కింద వర్గీకరించారు.  దాంతో, రైతుల ఆత్మహత్యలు తగ్గిపోయాయనే భ్రమ కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ని చూస్తే, రాష్ట్రంలోని మొత్తం రైతుల్లో మూడింట ఒక వంతు మంది (దాదాపు 32 లక్షల పైచిలుకు మంది అని ఒక లెక్క) కౌలు రైతులే. కానీ, ఈ కొత్త మెథడాలజీ వల్ల రాష్ట్రంలో 2014లో రైతు ఆత్మహత్యలు అతి తక్కువగా 160 జరిగినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ‘ఇతర’ విభాగంలో మరణాలు గణనీయంగా పెరగడాన్ని బట్టి అసలు కథేమిటో అర్థమవుతోంది.

     
రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగే 5 రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఈ పైకి చెబుతున్న ‘ఇతర కారణాలు’ కింద చనిపోయిన రైతుల సంఖ్య ఏకంగా 138 శాతం పెరిగింది. దీన్నిబట్టి లెక్క ఎక్కడ తప్పిందో తెలుస్తూనే ఉంది. కాబట్టి, అంతకు ముందు 19 ఏళ్ళుగా ఉన్న రైతు ఆత్మహత్యల డేటాని, 2014 నాటి నుంచి డేటాతో పోల్చిచూడలేం. లెక్కపెట్టే విధానం మార్చేసరికి, లెక్కే మారిపోతోంది. నిజం మరుగునపడుతోంది.

    

ఆంధ్రప్రదేశ్‌లో  అధికం!
అక్షర క్రమంలోనే కాదు... రైతుల ఆత్మహత్యల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉంది. కానివాళ్ళు కాదు... అధ్యయనాలు చెబుతున్న మాట ఇది. దేశంలో అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. వ్యవస్థలోని లోపాల ఫలితంగా ప్రభుత్వం అందించే వ్యవసాయ ఋణాలు చిన్న, సన్నకారు రైతులకు చేరకపోవడంతో తెలుగు రాష్ట్రాలు ఆత్మహత్యల్లో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్నాయి. ‘వ్యవసాయ రంగంలో సంస్కరణలు’ అనే అంశంపై ‘అసోచామ్’ గత ఏడాది నిర్వహించిన అధ్యయనం ఈ సంగతి వెల్లడించింది. దేశంలోని రైతు కుటుంబాల్లో మూడింట రెండు వంతుల కుటుంబాలకు ఒక హెక్టారు, అంత కన్నా తక్కువ భూములే ఉన్నాయి. దాంతో, ప్రభుత్వ ఋణాలు వారికి చేరడం లేదు. వారంతా అప్పుల కోసం వడ్డీవ్యాపారుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇలా తీసుకొనే అప్పులకు వడ్డీ రేట్లూ ఎక్కువే. 25 శాతం, అంతకన్నా ఎక్కువే వడ్డీ రేటు ఉంటుంది. ఇది వారి భూమి విలువ భరించే భారం కన్నా ఎక్కువ. అలా వారికి అధిక మొత్తంలో అప్పు పెరుగుతోంది. మరోపక్క నాణ్యమైన సాగు పద్ధతుల్ని కూడా అనుసరించలేకపోతున్నారు. గడచిన కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ (ఇప్పటి తెలంగాణతో కలిపి)లోనే అధిక రైతు ఆత్మహత్యల రేటు నెలకొంది.

 

పంట లేక... పంచన చేరలేక..
రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన దాంట్లో నలుగురికి పెట్టడమే తప్ప ఏనాడూ ఎవరి వద్దా చేయిసాచ ని ఆత్మాభిమానం ఆ రైతు దంపతులది. అనంతపురం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం అంతరగంగ గ్రామానికి చెందిన నేసే వన్నూరప్ప, నారాయణమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. సంబరంగా పెళ్ళిళ్లు జరిపించి గౌరవంగా అత్తింటికి సాగనంపారు. వ్యవసాయ అప్పులు, పిల్లల పెళ్లిళ్ళ ఖర్చులను పంటమీద తీరుద్దామని ముదిమికి చేరువవుతున్నా కష్టాన్నే నమ్ముకున్నారు. కానీ, కాలం పగబట్టింది. సాగు నీళ్లు లేవు. వర్షాలు కానరావు. పంట చేతికొచ్చే దారిలేదు. గుండెరాయి చేసుకొని ఐదెకరాల్లో మూడెకరాలు అమ్మితే కొన్ని అప్పులే తీరాయి. నీళ్లు లేని భూమిలో పంట సాగు చేసే పరిస్థితి లేదు. అప్పులు తీరే మార్గం లేదు. ఉన్న రెండెకరాలు అమ్మితే తమ జీవనం గడిచేదెట్లా?! ఒక అయ్య చేతిలో పెట్టి బాధ్యత తీర్చుకున్నాం. అలాంటి ఆడపిల్లల పంచన చేరి బతికేదెట్లా! పగలూ రాత్రీ నిద్రకు కరువై రోజుల తరబడి కుమిలిపోయారు వన్నూరప్ప, నారాయణమ్మలు. చావే శరణ్యం అనుకున్నారు. 2014 జూన్ 29 రాత్రికి గ్రామ సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు.

 

పైరు ప్రాణం మేసింది...
అనంతపురం జిల్లా రొద్దం మండలం గోనమేకలపల్లికి చెందిన ఉప్పర జల్లప్పకు తొమ్మిదెకరాల భూమి ఉంది. భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జల్లప్ప షుగర్ పేషెంట్. దీంతో ఇరవై ఒక్కేళ్ల కొడుకు గోపీనాథ్ చదువుకు స్వస్తి చెప్పి కాడి భుజానేసుకున్నాడు. తొమ్మిదెకరాల సొంత పొలానికి తోడు మూడెకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఏడెకరాల్లో కందిపంట వేశాడు. పూత పిందె దశలో అడవిజింకల మంద కందిచేను మేసిపోయింది. కౌలు భూమిలో సాగుచేసిన పత్తి పురుగుబారిన పడింది. పులిమీద పుట్రలా 2014 అక్టోబరు 16న బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. తండ్రిపేరుతో రూ.80 వేలు, తల్లి పేరుతో ఉన్న డ్వాక్రా రుణం రూ.1.70లక్షలు వడ్డీతో సహా చెల్లించాలంటూ వచ్చిన నోటీసులు చూసి గోపీనాథ్ రాత్రంతా కలత చెందాడు. 17వ తేదీ ఉదయం ఇంట్లో పురుగులమందు తాగి కుప్పకూలిపోయాడు. తమకు తలకొరివి పెట్టాల్సిన చెట్టంత కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. చనిపోయిన గోపీనాథ్ పేరుపై కాకుండా తండ్రి జల్లప్ప పేరుపైనే భూమి ఉంది కాబట్టి గోపీనాథ్ రైతు కాదని, జీవో 421 ఈ మృతికి వర్తించదంటూ రెవిన్యూ అధికారులు భాష్యం చెపుతున్నారు. దీనికి ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడంపై అధికారులపై జల్లప్ప హైకోర్టును ఆశ్రయించారు.

 

ఆడవాళ్ళు  రైతులు కారా?
ఎన్.సి.ఆర్.బి. లెక్కల్లో ప్రధానమైన లోపాలేమి టంటే - కేవలం ‘పట్టా’ ఉన్నవాళ్ళనే రైతులుగా పరిగణిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న మహిళల్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. నిజానికి, వ్యవసాయ పనుల్లో 60 నుంచి 67 శాతం మహిళలే చేస్తారు. అయితే, మన దేశంలోని అధిక శాతం రాష్ట్రాల్లో భూములు మగవాళ్ళ పేరు మీదే ఉంటాయి. వ్యవసాయ మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటే, భూములు వాళ్ళ పేరు మీద లేవనే ఏకైక కారణంతో - ఆ సంఖ్యను రైతు ఆత్మహత్యల జాబితాలో కాకుండా, ‘ఇతరుల’ జాబితాలో చూపిస్తున్నారు.

     
పంజాబ్, హర్యానాల్లో ఇలాగే మహిళా రైతుల ఆత్మహత్యల్ని కూడా మామూలు స్త్రీల ఆత్మహత్యలుగా చూపుతున్నారు. రైతు కుటుంబాలు అప్పుల పెనుభారంలో కూరుకుపోవడంతో, కౌమార వయసు ఆడపిల్లలు పలువురు స్కూలు, కాలేజీ చదువుల్ని అర్ధంతరంగా ఆపేయాల్సొస్తోంది. చివరకి ఈ రైతు కుటుంబాల్లోని ఆడపిల్లలు చేసుకుంటున్న ఆత్మహత్యల్ని విద్యార్థుల ఆత్మహత్యలుగా చూపిస్తున్నారు.

 

ఎవరైనా పల్లెటూళ్లకు వెళితే పట్టెడన్నం పెట్టే అన్నదాత కుటుంబానికి నేడు కష్టం వచ్చింది. వర్షాలు కురవక, చేసిన అప్పులు తీర్చే దారిలేక రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇంటికి అండగా ఉండాల్సిన రైతులు బలన్మవరణం పొందడంతో ఆ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆసరా కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ప్రభుత్వం అందించే అరకొర సాయానికి కూడా అధికారులు అనేకరకాలైన ఆంక్షలు విధిస్తున్నారు. దాంతో వ్యవసాయాన్ని పక్కనబెట్టి పిల్లల చదువులు మాన్పించి కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలు ఆగడం లేదు. ఆ మధ్య పక్షం రోజుల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లావ్యాప్తంగా వర్షాలు సక్రమంగా పడకపోవడం, పంటలసాగుకు పెట్టుబడులు తడిసి మోపెడు కావడం... అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో దిక్కుతోచని స్ధితిలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడారు. రైతుల ఆకాల మరణంతో వారిపై ఆధారపడ్డ కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఆ కుటుంబాలు నేడు ఆర్థికంగా చితికిపోయి దిక్కుతోచనిస్ధితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

 


నీరు లేక... కరెంటు లేక... అప్పులు తీర్చలేక...
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన పారేపల్లి మంగరాజు (27)అనే కౌలు రైతు గత ఏడాది 2015 అక్టోబర్ 4 వతేదీన  పురుగు మందు సేవించి మృతి చెందాడు. లక్కవరంలోని కొందరు రైతుల వద్ద సుమారు 7 ఎకరాలు మంగరాజు కౌలుకి తీసుకున్నాడు. ఐదెకరాల్లో మొక్కజొన్న పంట, మరో రెండెకరాల్లో వరి పంట సాగు చేస్తూ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. విద్యుత్ కోతలు, మరోపక్క  ఎర్రకాలువ కుడి కాలువ  సబ్‌ఛానల్ నుంచి నీరు పంటలకు అందక సాగుచేసిన  మొక్కజొన్న పంట ఎండిపోయే స్థితికి చేరి పొత్తులు కూడా రాకపోవడంతో పశువుల మేతకు వదిలేశాడు.  ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులకు గురై విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో ఉన్న మోటారు నుంచి నీరు సక్రమంగా పొలాలకు అందక  తీవ్ర నష్టం వచ్చిందని మృతుడు మంగరాజు బంధువులు తెలిపారు. మంగరాజుకు ఉన్న 25 సెంట్ల భూమిని 2 లక్షల రూపాయలకు విక్రయించి  పలువురు వద్ద తీసుకున్న అప్పులు తీర్చాడని, అలాగే 5 లక్షలకు ట్రాక్టర్‌ను అమ్మి ట్రాక్టర్ ఫైనాన్స్ కూడా తీర్చారని మంగరాజు సోదరుడు పారేపల్లి నాగరాజు తెలిపారు. అవికాక, బయట వ్యక్తుల నుంచి మంగరాజు తీసుకున్న సుమారు 6 లక్షల రూపాయల వరకు అప్పులు తీర్చాల్సి ఉందని బంధువులు తెలిపారు. అప్పుల బాధతో పాటు,  పంటల నష్టంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తడంతో మనస్తాపానికి గురైన మంగరాజు మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మార్లు కౌలు తీసుకున్న పొలంపై రుణాలు ఇవ్వాలంటూ మంగరాజు బ్యాంకర్ల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడని, కానీ బ్యాంకులు మాత్రం ముందుకు రాలేదని పలువురు రైతులు తెలిపారు. కౌలు వ్యవసాయానికి ప్రయివేట్ వ్యక్తుల నుంచి రుణాన్ని తెచ్చి మరీ పెట్టుబడి పెట్టి సాగు చేసేవాడని, అయినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.

 

అంకెల్లో అన్నదాత ఆక్రందన 
ప్రతి 32 నిమిషాలకూ ఒక భారతీయ రైతు ఆత్మహత్య. 1997 నుంచి 2005 మధ్య కాలానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించిన విషయం. 5 రాష్ట్రాలు - మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ సహా), కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రైతుల ఆత్మహత్యలు దేశంలోకెల్లా ఎక్కువ. 2014 లెక్క ప్రకారం నూటికి 90 ఆత్మహత్యలు ఈ రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి.

 

 80 శాతం
ఇది ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతుల్లో వాణిజ్య పంటలు సాగు చేస్తున్నవారి శాతం!

 

91.6 శాతం
ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో మగవారి శాతం ఇది. ఇక వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రాణాలు తీసుకుంటున్న మహిళా రైతులు 8.4 శాతం మంది.

 

21.4 శాతం మహిళా రైతుల ఆత్మహత్యలకు కారణం వ్యవసాయ సమస్యలే! 20.6 శాతం మంది  ఆత్మత్యాగాలకు కుటుంబ సమస్యలు, 10.8 శాతం మంది బలిదానాలకు దివాళా తీయడం కారణాలు.

 

రచయితలు ఏమంటున్నారు?  రైతును మనిషిగా గుర్తించాలి
రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రం లేదిప్పుడు. ఇందుకు ప్రదాన కారణం వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వాల ఆర్థిక విధానాలే. బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు చూస్తే చాలు రైతుల పట్ల పాలక వర్గాలకు గల ఆదరణ ఏమిటో అర్థమవుతుంది. పండిన పంటకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, ఉపాధి హామీ పథకం కారణంగా కూలీల రేట్లను భరించలేక పోవడం, ఏటేటా ఋణభారం పెరిగిపోవడం... ఈ కారణంగా రైతులు ఋణాలు తీర్చలేని నిస్సహాయస్థితిలో అనివార్యంగా ఆత్మహత్యలకు గురవుతున్నారు. అనంతపురంలాంటి వెనుకబడిన ప్రాంతాలలో ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యల వార్తలను పత్రికల్లో చూస్తూనే ఉన్నారు. దీనికి విరుగుడు ఏమిటంటే వెనుకబడిన ప్రాంతాలలో సాగునీటి సౌకర్యాలు పెంచడమే. రైతు పెట్టే పెట్టుబడులలో సగం ఖర్చును ప్రభుత్వం రాయితీ కింద అందించగలగాలి. విద్యను, వైద్యాన్ని రైతుకు ఉచితంగా అందించేలా చేయగలగాలి. ప్రభుత్వాలు రైతును ఒక మనిషిగా గుర్తించగలిగినప్పుడు మాత్రమే రైతులు బతికి బట్టకట్టగలరు.  - సింగమనేని నారాయణ, రచయిత

 

భూమి ఒక వస్తువైపోయింది
రైతు తన పంటకు కావలసిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను కార్పొరేట్ కంపెనీల నిర్థారించిన ధరలకు కొనుగోలు చేయాలి. కాని ఆ రైతు తన పంటకు తాను గిట్టుబాటు ధర నిర్ణయించలేకపోతాడు. వ్యవసాయ విధ్వంసానికి ఇదొక కారణంగా కనపడుతుంది. వ్యవసాయం అనేది కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగినప్పుడే వ్యవసాయం సంక్షోభం నుంచి బయటపడుతుంది. ఇప్పుడు వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో రైతులు వ్యవసాయం వదిలి, కూలికోసం వలసలు వెళ్లిపోతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు భూమి అంటే ఒక వస్తువుగా మారిపోయింది. వ్యాపారం అయిపోయింది. అది కూడా వ్యవసాయ విధ్వంసానికి ఒక కారణం. ఎప్పుడైతే వృత్తి విధ్వంసం జరుగుతుందో దాన్ని నమ్ముకున్న వారు వలసల వైపో, ఉద్యమాల వైపో, ఆత్మహత్యల వైపో వెళ్లిపోతారు. అదే వారికి ప్రత్యామ్నాయంగా కనపడుతుంది.  - కాట్రగడ్డ దయానంద్, రచయిత

 

వ్యవసాయాన్ని ఆధునికీకరించాలి
వ్యవసాయంపై 55 శాతంపైగా ప్రజలు ఆధారపడి ఉన్న భారతదేశంలో పాలకుల దృష్టి మొత్తం పారిశ్రామికీకరణ మీద లగ్నమవడం మనం ప్రస్తుతం చూస్తున్న అతి పెద్ద వైరుధ్యం. ఈ కారణం చేత వ్యవసాయం చిన్న చూపుకు గురవుతుంది. ఇప్పుడు వున్న ఆర్థిక విధానాలు, అభివృద్ధి నమూనాలు రైతుల పట్ల ప్రభుత్వాలకున్న హీనపక్షాన్ని తెలియచేస్తున్నాయి. రాజ్యానికి రైతు పట్ల ఉండవలసిన ప్రత్యేక దృష్టి ఆవశ్యకతను ఈ ఆత్మహత్యలు తెలియపరుస్తున్నాయి. అత్యవసరంగా పాలకుల దృష్టి కోణాన్ని మార్చుకుని వ్యవసాయాన్ని ఆధునికీకరించాలి. వ్యవసాయదారులను ఎడ్యుకేట్ చేయాలి. మిశ్రమ వ్యవసాయం, చిన్న వ్యవసాయ క్షేత్రాలను గుదిగుచ్చుకోవడం, నీటి వనరుల నిర్వహణ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అన్నిటికంటె ముఖ్యంగా రైతులకు అక్కరకొచ్చే, ఆదుకునే ఇన్సూరెన్స్ విధానాలను రూపొందించాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ‘మేం మీ పక్షమే’ అని ఎప్పుడు రైతులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయో అప్పుడు ఈ ఆత్మహత్యలు వాటంతట అవే ఆగిపోతాయి. - సామాన్య, రచయిత్రి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement