ఎగ్జామ్ టిప్స్
జవాబు పత్రం తెరవగానే శుభ్రంగా కనిపించాలి. అంటే మొదటి పేజీలో కొట్టి వేతలు అలికినట్టుగా ఉండటం ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. అంటే కచ్చితంగా తెలిసిన జవాబులు ఉన్న ప్రశ్నలనే మొదట ఆన్సర్ చేయడం మంచిది.అక్షరాలు ముత్యాల్లా ఉండాల్సిన పని లేదు. కాని శుభ్రంగా కనిపిస్తే చాలు. పేపర్ దిద్దేవారికి ఈ స్టూడెంట్ తను రాస్తున్న దాని పట్ల శ్రద్ధాసక్తులు కలిగినవాడు అని అనిపించాలి. అప్పుడు మీ జవాబును వారి శ్రద్ధగా చదివి మార్కులు వేస్తారు. {పశ్నను అరకొరగా చదవకండి. ఏ ప్రశ్న ఎన్ని మార్కులకు అడిగారో స్పష్టంగా గమనించండి. ఆ ప్రశ్నకు ఎంత సమాధానం రాయాలో అంతే రాయండి. ఉత్సాహం కొద్దీ అవసరం లేని వివరాలు రాయవద్దు.
వ్యాకరణం, అన్వయం ముఖ్యం. మీరు సమాధానాలు సరిగ్గా రాసినా వ్యాకరణం సరిగా లేని ఒక అర్థం రావలసిన వాక్యానికి మరో అర్థం వచ్చే అవకాశం ఉంది. కనుక పరీక్ష మొత్తం రాసే సమయాన్ని రాసింది ‘వెరిఫై’ చేసుకునే సమయాన్ని విభజించుకోవాలి. చివరి పదిహేను నిమిషాలు అంత వరకూ రాసిన సమాధానాలను వెరిఫై చేసుకోవడానికి వాడుకోవాలి. ఆ సమయంలో రాసిన వాటిలో ఉన్న లోటుపాట్లను గమనించి సరి చేసుకోవాలి. కొందరు గ్రూప్ సబ్జెక్ట్‌లను శ్రద్ధగా లాంగ్వేజ్‌లను తేలిక దృష్టిలో రాస్తారు. ఒక విద్యార్థి ప్రతి పరీక్ష ముఖ్యమైనదే. సరిగ్గా చదివి సరిగ్గా రాయగలిగితే లాంగ్వేజ్‌లలో చాలా మంచి మార్కులు సాధించవచ్చు.
‘అస్పష్టమైన చేతిరాత అసంపూర్ణ విద్యకు సంకేతం’ అన్నారు మహాత్మాగాంధీ. మీ చేతిరాత ఎగుడు దిగుడుగా చిన్నగా లేక పెద్దగా ఎలాగైనా ఉండొచ్చు. కాని అస్పష్టంగా మాత్రం ఉండరాదు. అక్షరాలు స్పష్టంగా రాయడమే పరీక్షలో సగం విజయం అని గ్రహించాలి.
- వై. మల్లికార్జునరావు, డెరైక్టర్, నేషనల్ హ్యాండ్‌రైటింగ్ అకాడెమీ, హైదరాబాద్.