ఆన్‌లైన్ ప్రేమలు, పెళ్లిళ్లు, మోసాలు, ఆత్మహత్యలు... ఇవన్నీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విపరీతంగా పెరిగిపోయాయని సర్వేలు చెబుతున్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం, తరువాత కబుర్లు, ఆ పైన స్నేహం, అది కూడా అయ్యాక ప్రేమ మొదలు. అది ఏ కొందరినో పెళ్లి దాకా చేరుస్తుంటే, ఎందరినో మోసపోయేలా చేసి జీవితాలను చాలించేందుకు ప్రేరేపిస్తోంది. ఇలాంటి సంఘటనలను నివారించాలని, సైబర్ క్రైమ్‌రేట్‌ని తగ్గించాలని పోలీసులు ఎంతగా ప్రయత్నించినా జరగాల్సినవి జరిగిపోతూనే ఉన్నాయి.
ఇటీవల అలహాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి. భర్తను కోల్పోయి, బిడ్డతో బతుకుతోంది. ఆమెకు ఫేస్‌బుక్‌లో ఒక యువకుడితో స్నేహం ఏర్పడింది. అతడామెని ప్రేమిస్తున్నానన్నాడు. నమ్మింది. పెళ్లి చేసుకుంటానన్నాడు. వెళ్లింది. పెళ్లయితే చేసుకున్నాడు. కానీ ఓ రాత్రి ఆమె నగలు, డబ్బు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు ఆరా తీస్తే తెలిసింది... అతగాడు అప్పటికి అలా ఎనిమిదిమంది మహిళలను మోసగించాడని. మంగుళూరుకు చెందిన మరో అమ్మాయి ఆన్‌లైన్‌లో ప్రేమించి, రిజిస్టరాఫీసులో పెళ్లాడి, అతడితో అమెరికా వెళ్లిపోయింది. కానీ అక్కడికెళ్లాక అతడు చిత్రహింసలు పెడితే పారిపోయింది. అక్కడి ఎంబసీ వారి సాయంతో స్వదేశానికి తిరిగొచ్చి పుట్టింటికి చేరింది.
ఇలాంటివన్నీ చూశాకయినా జాగ్రత్తగా ఉండకపోతే ఎలా! ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్పడం లేదు. స్నేహం చేయవద్దనీ అనడం లేదు. కానీ ఆ పరిచయానికి, స్నేహానికి హద్దులు ఏర్పరచాల్సిన అవసరం ఉంది. అందరూ చెడ్డవాళ్లే ఉంటారని కాదు. చెడ్డవాళ్లు కూడా ఉంటారని చెప్పడం. నిజంగా అతడి తోడు మీకు అవసరం అనుకుంటే... అసలతడు మీకు తోడవుతాడా, అందుకు తగిన అర్హతలు ఉన్నాయా అనేది ముందు తెలుసుకోండి. తరచు అతడిని కలవండి.
మాట దగ్గర్నుంచి అన్నిటినీ పరిశీలించండి. మీ పెద్దవాళ్లకు, బంధువులకు అతడి గురించి చెప్పండి. ఎంక్వయిరీ చేయించండి. ఇంత చదివాను అంటే సర్టిఫికెట్స్ చూడండి. ఫలానా చోట చదివాను అంటే అక్కడ ఆరా తీయండి. అతడి తరఫు వాళ్లందరినీ కలిసి, మాట్లాడి, అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోండి. అతడేమనుకుంటాడో అని వెనకడుగు వేశారో... జీవితంలో మీరు ముందడుగు వేయలేరు.
ఫేస్ బుక్‌లో ఫేక్ లుక్ ! అమ్మాయిలూ జాగ్రత్త
Published Tue, Dec 17 2013 11:47 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement