ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్!
ఆన్లైన్ ప్రపంచంలో ప్రేమలను వెతుక్కోవడం అంటే సముద్రంలో పారబోసుకున్న మంచినీళ్లను దోసిళ్లతో పట్టుకోవాలనుకోవడం లాంటిది. డిజిటల్ యుగంలో ప్రపంచం చిన్నదైనప్పటికీ మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలు ఒంటరితనం వైపుగా పయనిస్తున్నాయి. ఫలితంగా ఒంటరి మనసులు భావోద్వేగాల జడిని కనపడని వ్యక్తులతో పంచుకుంటున్నారు.
డేటింగ్ యాప్‌లలో మహిళలు భాగస్వాముల కోసం వెతుకుతూ, వారితో మానసిక అనుబంధాలను పెంచుకొని, కొంతకాలానికి డిప్రెషన్‌కు గురవుతున్నారని, వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు మానసిక నిపుణులు.
పెరుగుతున్న సమస్య... 35 ఏళ్లు దాటిన వసు (పేరుమార్చడమైనది) లక్షల వ్యాపారాన్ని సులువుగా నిర్వహించే స్టార్టప్‌ను రన్ చేస్తుంది. కానీ, మానసిక సంబంధాన్ని సరిగా నిర్వహించలేక డిప్రెషన్ బారిన పడింది. వసు తల్లి ఈ విషయాన్ని చెబుతూ ‘నా కూతురు సొంతంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో పెళ్లి విషయంలో ఆలస్యం చేసింది. సెటిల్ అయ్యాక ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతను కూడా నా కూతురితో రోజూ ఆన్లైన్లో మాట్లాడుతుండేవాడు. ప్రేమిస్తున్నట్టు చెప్పాడు.
కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకునేవారు. కానీ, కలవడానికి దూరంగా ఉండేవాడు. నా కూతురు అతనితో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యింది. కానీ, ఆ అబ్బాయి సరైనవాడు అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే, కలుద్దామంటే అతను చూడటానికి రావడం లేదు. నా కూతురిని అతని నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో తెలియట్లేదు’అనేది ఆమె ఆవేదన.‘వర్చువల్ ప్రపంచంలో ప్రేమలు వెతికేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతున్న ఈ సమయంలో కూతుళ్ల పట్ల తల్లుల ఆందోళన కూడా పెరుగుతోంది’ అంటున్నారు రిలేషన్షిప్ కౌన్సెలర్ డాక్టర్ మాధవీ సేథ్. ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు.
తెలివిగా వ్యవహరించాలి... ఈ రోజుల్లో తల్లులు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కూతుళ్లు బాగా చదువుకుంటూ, బిజినెస్ ఉమెన్‌గా నిలదొక్కుకుంటున్నవారున్నారు. వారికి తమ మంచి చెడులు బాగా తెలుసు. అందుకని, వాళ్లు చాటింగ్ చేయడాన్ని లేదా అబ్బాయితో మాట్లాడడాన్ని నిషేధిస్తే మీ మాట వినరు. నిఘా పెడితే మీ పై నమ్మకం కోల్పోతారు. నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా మాత్రమే మీరు మీ కూతురిని అర్థం చేసుకోగలరు.
సమయం ఇవ్వండి.. స్త్రీ ఎంతటి సమర్థత, విజయం సాధించినా ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కాబట్టి ఆమె అవతలి వ్యక్తి లోపాలను చూడలేదు. కానీ, తెలివిగా ఆమెకు నిజం చెప్పాలి. దీని కోసం మీరు మీ కుమార్తెతో సమయం గడపడం అవసరం. మొదట ఆమె ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవును అయితే ఆ విషయం గురించి ప్రేమగానే మాట్లాడాలి.
అబ్బాయిని ఇంటికి పిలవమని, అతని తల్లిదండ్రులను కలవడానికి ప్లాన్ చేయమని చెప్పాలి. తర్వాత నెమ్మదిగా సాక్ష్యాధారాలతో ఆ అబ్బాయి గురించి నిజాలను కూతురికి చెప్పాలి. నిజానికి ఈ విషయాలు చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ‘ఆమె’ ఒంటరితనం ఫీలవుతుంది. ఆమెకు మీ ప్రేమపూర్వక మద్దతు అవసరం. ప్రతి పరిస్థితిలో మీరు ఆమెతో ఉన్నారని మీ కుమార్తెకు భరోసా ఇవ్వండి. వీలైతే మీ కూతురిని కొంతకాలం దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్లండి. దీనివల్ల ఆమె మానసిక స్థితిలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు.
వర్చువల్ ప్రపంచం నుండి బయటకు రండి... ఆన్లైన్ ప్రేమ కోసం వెతుకుతున్న యువత వర్చువల్ ప్రపంచం నుండి బయటపడి జనంతో కలిసి΄ోవాలి. ఒకటి లేదా రెండు రోజులు ఆన్లైన్ చాటింగ్ అవతలి వ్యక్తి గురించి ఎక్కువ సమాచారాన్ని అందివ్వవు. డేటింగ్‌యాప్‌లలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాస్తవ ప్రపంచంలో నిజమైన ప్రేమలను వెతుక్కోవాలి. ఒకరికొకరు పరస్పరం కలిసి మాట్లాడుకోవడంలో సాంత్వన ΄÷ందుతారు. ఇటువంటి వాటిలో మోసం, భయం ఉండవు. ప్రేమ సంబంధాలలో నమ్మకం ముఖ్యం.
వర్చువల్... నిజాలు... లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధన ప్రకారం దాదాపు 70 శాతం మంది డేటింగ్ యాప్‌లలో భాగస్వాముల కోసం వెతుకుతున్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురవుతున్నారనీ, అది వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని తేలింది. ఈ రోజుల్లో వ్యక్తులు తరచుగా సంబంధాలను వదులుకోవడానికి చాలా త్వరపడుతుంటారు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఆ దిశగా అన్వేషణ చేయడం కూడా ఇందుకు కారణం అవుతుంటుంది. కోవిడ్ లాక్డౌన్ మార్పులు కూడా ఈ స్థితికి బాగా కారణమైంది. ఇంటి నుండి పని మొదలు డేటింగ్ యాప్‌లో రొమాన్స్ చేయడానికి ఓ కొత్తమార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది.
మరికొన్ని సూచనలు.. ∙ఒంటరిగా ఉండటం వల్ల కలిగే ప్రతికూలతలపై దృష్టి సారించే బదులు మీరు ఆనందించే అంశాలు, అది తెచ్చే స్వేచ్ఛపై దృష్టి పెట్టాలి ∙జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం, అభిరుచులవైపు మనసును మళ్లించాలి. కుటుంబం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
సామాజికంగా కలవాలి...
► ఆన్లైన్ డేటింగ్లో మరొక వ్యక్తి జీవితాన్ని, సంబంధాలను, వివరాలను ఎప్పటికీ తెలుసుకోలేరు. సోషల్ మీడియా ΄ోస్ట్‌లో సంతృప్తికరమైన సంబంధంలా కనిపించేది నిజ జీవితంలో చాలా భిన్నంగా కనిపించవచ్చు
► ఒంటరిగా ఉన్నప్పుడు వర్చువల్ మీట్–అప్‌లను కూడా స్నేహితులతోప్లాన్ చేయడం మంచిది
►వారానికి కొన్నిసార్లు మీ ప్రియమైన వారితో ఫోన్లో చాట్ చేసినా, ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవుతున్నా మీ ఒంటరితనం అనే భావన దూరం అవుతుంటుంది
►స్వచ్ఛంద సేవ, స్థానిక స్పోర్ట్స్ క్లబ్‌లలో పాల్గొనడం, రీడర్స్ క్లబ్.. వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఒంటరితనం దూరం అవడమే కాదు, మనసులో ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా దొరకవచ్చు
► జీవితం ఒక రేస్ కాదు. ఒక నిర్దిష్ట వేగంతో జీవితంలోని మైలురాళ్లను చేరుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికన్నా ముందు మీకు మీరే ప్రియమైనవారని గుర్తుచేసుకోండి. డేటింగ్ యాప్‌లలోనే కాదు మీ ఆసక్తులు, లక్ష్యాలు, విలువలు పంచుకునే ఒంటరి వ్యక్తులు మీ చుట్టూ పుష్కలంగా ఉన్నారనే విషయం గ్రహించాలి. – డాక్టర్ మాధవీ సేథ్, రిలేషన్షిప్ కౌన్సెలర్