గెలుపులో ఉన్న ఒక ముఖ్యమైన దుర్లక్షణం ఏమిటంటే అది ఎదుటివారికి ఓటమి ఇస్తుంది.
‘ఏంటండీ డ్యూటీకి వెళ్లరా ఏంటి?’ ఇంకా పడుకునే ఉన్న భర్తని తట్టిలేపింది వల్లి (పేరు మార్చాం). అప్పటికే పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్లిపోయారు. సాధారణంగా ఆ టైమ్‌కు భర్త రెడీ అయిపోతాడు.కాని రూఫ్‌ను చూస్తూ ముభావంగా ఉన్న భర్తను చూసే సరికి జంకు పుట్టింది వల్లికి.‘ఏటండీ... ఏదైనా సమస్యా! ఎందుకు ఈ మధ్య ఇలా ఉంటున్నారు..’ అనునయంగా అడిగింది.భర్త ఆమెను దీర్ఘంగా చూశాడు.‘ఏమీ లేదులే.. స్నానానికి నీళ్లు పెట్టు..’బాత్రూమ్‌కు వెళ్లిపోయాడు.పది నిమిషాల్లో రెడీ అయి డ్యూటీకి వెళ్లబోతున్న భర్తను వారించి, ‘అదేంటి... టిఫిన్ కూడా చేయకుండా...’ అంది కంగారుగా. ‘లేదు.. అర్జంట్‌గా వెళ్లాలి’ అంటూ వెళ్లిపోయాడు.ఆమె చూస్తూ ఉండిపోయింది.
చీకటి పడింది. పిల్లలకు భోజనాలు పెట్టి, భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉంది వల్లి. ఇది కొత్తేమీ కాదు. టైమ్‌కు ఇల్లు చేరని డ్యూటీ అతనిది.‘మా పోలీసు డ్యూటీ ఇలాగే ఉంటుంది. ఎదురుచూడద్దు...’ అంటూ ఉంటాడు. అర్థరాత్రి కావస్తూ ఉంది. వల్లికి కళ్ళు మూతలు పడుతున్నాయి. గిన్నెలపై మూతలు సర్ది, పిల్లల పక్కన ముడుచుకుపడుకుంది. మెల్లగా కళ్లు నిద్ర అనే చీకటిని కప్పుకున్నాయి. అప్పుడే తెల తెలవారుతోంది. తలుపులెవరో దబ దబ బాదుతుండటంతో ఉలిక్కిపడి లేచింది వల్లి. డోర్ తీసింది. ఎదురుగా పోలీస్‌కానిస్టేబుల్. ఆశ్చర్యంగా చూసింది. ‘మేడమ్, సురేశ్ (పేరు మార్చాం) రాత్రి టూ వీలర్ మీద ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. ఆసుపత్రిలో ఉన్నాడు’.... అతనేదో చెప్తున్నాడు. కాని వల్లి స్థాణువులా వెర్రిగా అతణ్ణే చూస్తూ నిలుచుంది.
పోస్ట్‌మార్టం రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది. అందులో ఇలా ఉంది– 2010 ఫిబ్రవరి 9నాడు రాత్రి 7–7.30 గంటల సమయంలో టూ వీలర్ రోడ్ డివైడర్ ఢీ కొట్టడంతో తలకు గాయలు అయి మరణం సంభవించింది. పేరు: సురేశ్, వయసు: 33. వృత్తి, కానిస్టేబుల్, గోదావరిఖని వన్‌టౌన్‌చనిపోయినవారి ఇంటికి ఓదార్పు కోసం పై అధికారులు రావడం మామూలే.మరణించిన కానిస్టేబుల్ సురేశ్ ఇంటికి డీఐజీ పరామర్శకు వచ్చాడు. బూట్లు బయట వదిలి ఖాకీ మేజోళ్లతో ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సురేశ్ పటానికి పెద్ద పూలదండ వేసి ఉంది. పిల్లలు,వల్లిదుఃఖం నుంచి కోలుకోలేదని తెలుస్తూ ఉంది.‘ఊహించని యాక్సిడెంట్ అమ్మా. ధైర్యంగా ఉండండి. డిపార్ట్‌మెంట్ మీకు సపోర్ట్‌గా ఉంటుంది’ అన్నాడాయన.వల్లి తల అడ్డంగా ఊపింది.‘సార్, ఇది ప్రమాదం కాదు. హత్య’ అంది.డీఐజీ ఉలిక్కిపడ్డారు. ‘అవున్నార్! మీవాళ్లే చంపారు. మా సీఐ నన్ను బతకనిచ్చేట్టు లేడు అని నెల రోజులుగా ఆయన అంటూనే ఉన్నాడు. అతని వల్లే నా భర్త చనిపోయాడు’ ఆమె చెబుతున్న మాటలు డీఐజీని ఆలోచనలో పడేశాయి.
బాధితులకు ఒక సిక్స్ సెన్స్ ఉంటుంది. ఆ సిక్స్›్తసెన్స్‌తోనే ఆమె తన భర్తది హత్య అని చెప్పిందేమో అనిపించింది డిఐజీకి. వెంటనే సురేశ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వెరిఫై చేశాడు. ఆ తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించాడు. రంగంలో దిగిన సిట్ కేసుపై అనేక కోణాల్లో దర్యాప్తు చేసింది. ఎటువంటి క్లూ లభించలేదు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు క్లియర్‌గా యాక్సిడెంట్ అని చెబుతోంది. మరి ఎలా చంపినట్టు?! సిట్‌కి ఆదేశాలు వెళ్లాయి. సిట్ పట్టుదలగా దర్యాప్తు మొదలెట్టింది. ఘటన జరిగిన రోజు రాత్రి.. ఘటన జరిగిన చోట ట్రాన్స్‌ఫార్మర్ పేలిన చప్పుడు విన్నానని ఒక పేవ్‌మెంట్ మనిషి చెప్పాడు. దానికీ హత్యకీ సంబంధం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సురేశ్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోలేదు. మరి ఏంటి క్లూ?కాని పోలీసు బుర్ర ఊరికే ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేశారు.‘ట్రాన్స్‌ఫార్మర్ మార్చే సమయంలో స్ట్రేంజ్‌గా ఏదైనా గమనించారా?’ అని అడిగారు.‘మేం ట్రాన్స్‌ఫార్మర్ మార్చితే కదా. అసలు ట్రాన్స్‌ఫార్మర్ పేల్లేదు’ అని జవాబు వచ్చింది.మరి ఆ శబ్దం? టపాకాయలది కాదు. మరి?ఎస్. గన్ షాట్.అంటే సురేశ్ గన్ షాట్‌తో చనిపోయాడా?తీగలాగితే డొంకంతా కదిలింది. పోస్ట్‌మార్టమ్‌ను మేనేజ్ చేశారు. దీనికి వెనుక డిపార్ట్‌మెంట్‌లో చాలామంది తలకాయలు ఉన్నాయి. సురేశ్ బాడీకి రీపోస్ట్‌మార్టమ్ చేయాలని హుటాహుటిన ఆదేశాలు అందాయి. ఆ రిపోర్ట్‌లో సురేశ్ ముఖం భాగంలో కుడి కన్ను కింద పిస్టల్‌తో కాల్చినట్టుగా, 0.32 బుల్లెట్‌ను రిపోర్ట్‌తో జత చేసి ఇచ్చారు. 0.32 బుల్లెట్‌ను పోలీసులు ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగించింది ఎవరు?!
పోలీస్ ఇన్‌ఫార్మర్ వాసు(పేరుమార్చాం)కు 0.32 బుల్లెట్లు జారీ చేసినట్టు రికార్డులో రాసుంది. అంటే కూపీ ఇతని దగ్గరే ఉంది. వెంటనే పోలీసులు వాసును పట్టుకుని డిఐజీ ముందు హాజరుపరిచారు. ‘సార్ ఇది ఆధిపత్యం గొడవ సార్’ అన్నాడతను.‘అంటే?’ డిఐజీ అడిగాడు.‘నేను ఐదేళ్లుగా పోలీస్ ఇన్ఫార్మర్‌గా ఉన్నాను. డిపార్ట్‌మెంట్ పేరు చెప్పి లాండ్ సెటిల్‌మెంట్, దందాలు చేస్తూ ఉండేవాడిని. నా పనికి సురేశ్ అడ్డుపడేవాడు. పెద్ద సార్లకు చెబుతా అంటూ బెదిరించేవాడు. ఈ దందాల్లో పెద్దసార్లూ ఉన్నారని అతనికి తెలియదు. సార్... నేను గెలుస్తూ వెళుతుంటే నన్ను ఓడించడానికి ఎవరైనా వస్తే ఎలా ఉంటుంది? అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు రాత్రి సురేశ్ నాకు ఎదురయ్యాడు. ‘నీ సంగతి చూస్తాను’ అని బెదిరించాడు. కోపంలో పిస్టల్ తీసి కాల్చేశాను. విషయం పెద్దసార్లకు చెప్పాను. వాళ్లు మేం చూసుకుంటాం అన్నారు’ అంటూ ముగించాడు.
సురేశ్‌ది యాక్సిడెంట్ కాదని హత్య అని కేసు నమోదయ్యింది.పోస్ట్‌మార్టమ్ రిపోర్టును తప్పు దోవ పట్టించిన డాక్టర్‌తో సహా మొత్తం ఏడు మంది ముద్దాయిలుగా ఉన్నారు. వారిలో కొందరు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద పోస్టుల్లో ఉన్నారు కూడా. కేసు నడుస్తూ ఉంది. న్యాయం జరగాల్సి ఉంది.చట్టం చేతుల్లో ఉందని తప్పు చేసినవారు కొన్నాళ్లు తప్పించుకోవచ్చు.కాని చట్టం కఠినమైనది. న్యాయంతో కలిసి నేరస్తులను దండించే తీరుతుంది.
కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదు...
హత్యకు గురైనట్టుగా చెబుతున్న సురేశ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. సురేశ్ భార్య వల్లి హైదరాబాద్‌కు Ðð ళ్ళి పోలీస్ ఉన్నతాధికారులను కలిసినా పోలీస్ అమరవీరులకు అందించే ప్రయోజనాలు కూడా వీరికి కల్పించలేదు. ఆనాడు సిట్ సమర్పించిన కేసులో ముద్దాయిలుగా ఉన్న పోలీస్ అధికారులకు కేసు పరిష్కారమయ్యే వరకు నాన్–పోకల్ పోస్టుల్లోనే ఉంచాలని ఆనాటి పోలీస్ ఉన్నతాధికారులు సూచించగా... ప్రభుత్వం మారడంతో నేడు అందరు అధికారులు పోకల్ పోస్టుల్లో కొనసాగుతున్నారు.
– గడ్డం రాజిరెడ్డి, బ్యూరో ఇన్‌ఛార్జి, సాక్షి, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment