నిద్రలో మరణం సహజమే కావచ్చు. కాని సహజంగా కనిపించే ప్రతి మరణం సహజం కాకపోవచ్చు. చీకటిలో కోరికలు ఉంటాయి. అవి తీరే ఏకాంతం దొరకడం మనుషులకు ప్రమాదకరం. బుద్ధి చీకటి దారి తప్పితే జీవితం అంధకారంలో పడుతుంది. నేరం జరిగిన తర్వాత వగచే కన్నా నేరం జరిగే పరిస్థితులను ముందే నివారించడం తెలివైన పని.
2012– అక్టోబర్ 13.కాజీపేట ప్రశాంత్ నగర్.ఉదయం 6 గంటల 3 నిమిషాలు.వేంకటేశ్వర గుడిలో నుంచి మైకులో వస్తున్న సుప్రభాతం వింటూ రెండు కప్పుల కాఫీ తయారు చేసింది సుజాత. తను ముందుగా కాఫీ తాగుతూ టీవీ ఆన్ చేసింది. అరగంట టీవీ చూసి తర్వాత గిన్నెలో ఉన్నకాఫీని మళ్ళీ వేడి చేసి కప్పులో పోసి, అత్త సువర్ణమ్మ రూమ్‌వైపుగా వెళ్లింది. బయట నుంచే డోర్ మీద తడుతూ ‘అత్తయ్యా..అత్తయ్యా..’ అని పిలిచింది. ఎలాంటి అలికిడి వినిపించలేదు. ‘అదేంటీ.. రోజూ ఈ టైమ్‌కి లేస్తారు. ఈ రోజు ఇంకా లేవలేదా?’ అనుకుంటూ డోర్ తీసుకొని లోపలికి వెళ్లి మళ్లీ పిలిచింది. పడుకున్న మనిషి పడుకున్నట్టే ఉంది. దగ్గరగా వెళ్లి తట్టింది. చెయ్యి చల్లగా తగిలింది. ఆందోళనగా టీపాయి మీద కాఫీ కప్పు పెట్టి, మరోసారి అత్తను లేపే ప్రయత్నం చేసింది. కానీ, సువర్ణమ్మ లేవలేదు. సుజాతకు మాటరాలేదు. ‘ఇప్పుడేం చేయాలి...’ కంగారుగా కాలనీలోనే ఉంటున్న తల్లిగారింటికి ఫోన్ చేసింది. అప్పటికి సమయం 7.15.సుజాత తల్లీదండ్రితో పాటు ఇరుగు పొరుగూ సువర్ణమ్మ మంచం చుట్టూ చేరారు. ‘అకస్మాత్తుగా ఇలా జరిగిందంటే నిద్రలోనే గుండెపోటు వచ్చి ఉండవచ్చు’ అన్నారంతా! సుజాత ఏడుస్తూ ఉంటే.. ‘కోడలివైనా ఇన్నాళ్లూ కూతురులా చూసుకున్నావు. ఆమె అదృష్టవంతురాలు.నిద్రలోనే పోయింది.’ అంటూ సముదాయిస్తున్నారు సుజాతని..
సువర్ణమ్మ (పేరుమార్చాం) అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగినిగా పని చేసేది. వయసు 55 పైనే. ఇద్దరు కొడుకులు. ఇద్దరూ ఉద్యోగరీత్యా విదేశాలలో ఉంటున్నారు. మూడేళ్ల క్రితం భర్త చనిపోయాడు. కొడుకులు కోడళ్లతో కలిసి పండగలకు వచ్చిపోతుండేవారు. సంవత్సరం క్రితం పెద్ద కొడుకు వచ్చినప్పుడు తల్లికి ఆరోగ్యం బాగుండడం లేదని భార్య సుజాతను ఇక్కడే వదిలి వెళ్లాడు. అందువల్ల సుజాత అత్తతోనే ఉంటోంది.విషయం తెలిసిన వెంటనే కొడుకులు ఇద్దరు బయల్దేరారు. అక్టోబర్ 17న ఇంటికి చేరుకున్నారు. అదే రోజున తల్లి దహన సంస్కరాలు పూర్తి చేశారు. నెలమాసికం తర్వాత తిరుగు ప్రయాణం పెట్టుకుందామనుకున్నారు. కానీ, కుదరక మరో నెల రోజులకు ప్రయాణం వాయిదా వేసుకున్నారు. నవంబర్ 19. ‘వదినా... అమ్మ సెల్‌ఫోన్ కనిపించడం లేదేంటీ..’ అన్నాడు çసువర్ణమ్మ రెండో కొడుకు సతీష్ ఏదో గుర్తుచ్చినట్టు.‘ఏమో సతీష్. ఫోన్ రిపేర్‌కు ఇచ్చిందనుకుంట. ఎక్కడ ఇచ్చిందో నాకూ దాని గురించి తెలియదు’ అంది సుజాత.‘అలాగా. సరే వదినా. నేను బయటకెళ్లొస్తా. అన్నయ్య వస్తే చెప్పు’ అంటూ వెళ్లిపోయాడు సతీష్. షోరూమ్‌కెళ్లి తల్లి మొబైల్ నెంబర్ పై కొత్త సిమ్ తీసుకుని తన దగ్గర ఉన్న మరో ఫోన్‌లో వేశాడు. సిమ్ యాక్టివేట్ అయిన కొద్దిసేపట్లోనే ఆంధ్రా బ్యాంక్ నుంచి మూడు మెసేజ్‌లు ఆ నంబర్‌కు వచ్చాయి. అక్టోబర్ 15న, నవంబర్ 2న మొత్తం 75 వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా అయినట్టు ఉందా సమాచారం. ఆంధ్రాబ్యాంక్ అకౌంట్‌ను తన ఫోన్ నెంబర్‌కు జత చేసుకుంది సువర్ణమ్మ. డబ్బు డ్రా చేస్తే మెసేజ్ వస్తుంది. అలాంటి మెసేజులే అవి.వాటిని చూడగానే సతీష్ ఆశ్చర్యపోయాడు. ‘అక్టోబర్ 13న అమ్మ చనిపోయింది. మేమెవరమూ డబ్బు డ్రా చేయలేదు. అక్టోబర్ 15న నవంబర్ 2న డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చిందేంటి?’ అనుమానంతో వెంటనే బ్యాంక్‌కు వెళ్లి అధికారులను అడిగితే వాళ్లు స్టేట్‌మెంట్ తీసిచ్చారు. ఏయే ఏటీఎమ్‌ల నుంచి డబ్బులు డ్రా అయ్యాయో బ్యాంక్‌వాళ్లు చెప్పారు. ‘ఏటీఎం కార్డులు ఎవరు తీసుకెళ్ళి డ్రా చేశారు? ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగిందా? అసలు ఇన్ని రోజులు తాత్సారం చేయడం తనదే తప్పు’ అనుకుంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు సతీష్.
సువర్ణమ్మ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఏయే బ్యాంక్ ఏటీఎంల నుంచి డ్రా అయ్యాయో పూర్తి వివరాలు తీసుకున్నారు పోలీసులు. కాజీపేటలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అయినట్లు తెల్సింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ అధికారులను కలిశారు. ‘అక్టోబర్ 15న, నవంబర్ 2న సాయంత్రం సమయంలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తున్న సీసీ పూటేజీ కావాలి’ అని సీఐ కోరాడు. బ్యాంక్ అధికారులు ఆ పుటేజీని పోలీసులకు అప్పగించారు. ఫుటేజ్ పరిశీలిస్తే ఒక మనిషి కనిపించాడు. పురుషుడు. 35 ఏళ్లు ఉండొచ్చు. అతనే డబ్బులు డ్రా చేసినట్టు తెలుసుకున్నారు. ‘ఆ వ్యక్తికి సువర్ణమ్మ ఏటీఎమ్ కార్డులు ఎలా దొరికాయి? వన్నాట్ టూ... ఈ కేసులో క్లూ దొరికిందయ్యా. పద’ అంటూ బయటకు దారి తీశాడు. అతన్ని అనుసరించారు మిగతా సిబ్బంది. డిసెంబర్ 3 సాయంత్రంపోలీసులు సువర్ణమ్మ ఇంటికి వచ్చారు.మగ్గురు అన్నదమ్ములతో మాట్లాడారు.పెద్దకోడలు సుజాతను పిలిచాడు సీఐ. ‘సువర్ణమ్మతో పాటు మీరొక్కరే ఈ ఇంట్లో ఉంటున్నారు కదా. అందరికంటే మీకే బాగా తెలియాలి. ఆ రోజు ఏం జరిగింది?’ అన్నాడు. ‘రోజులాగే అత్తయ్యకు భోజనం పెట్టి, నేను తిని పడుకోవడానికి నా రూమ్‌కి వెళ్లిపోయాను. ఉదయం 6 గంటలకే ఆవిడ నిద్రలేస్తారు. ఆ రోజు ఏడు అయినా లేవలేదు. నేనే కాఫీ తీసుకెళ్లి లేపాను. కానీ అప్పటికే ఆవిడ చనిపోయింది. నాకేం చేయాలో అర్ధం కాలేదు. మా నాన్నకు ఫోన్ చేసి విషయం చెప్పాను. గతంలో ఆమెకు ఓసారి గుండెపోటు వచ్చింది. ఆ రోజు నిద్రలోనే గుండెపోటువచ్చి ఉంటుంది’ అంది సుజాత. మరిన్ని వివరాలు అడిగి వెళ్లిపోయారు పోలీసులు.
సుజాత ఫోన్ నెంబర్ తెలుసుకొని ఆమె కాల్ డేటాను తీయించారు పోలీసులు. ఒక ఫోన్ నెంబర్‌తో ఏడాది నుంచి తరచూ మాట్లాడినట్టు రికార్డ్ అయి ఉంది. సువర్ణమ్మ చనిపోవడానికి కొన్ని రోజుల ముందుగంటల తరబడి మాట్లాడినట్టు రికార్డ్‌లో ఉంది. ఆ నెంబర్ ఎవరిదో వెరిఫై చేయిస్తే నరేష్ అనే వ్యక్తిదని తెలిసింది.2012అక్టోబర్ 12న అర్థరాత్రి నరేష్, సుజాత సెల్‌లు ఒకే సెల్ టవర్ పరిధిలో ఉండటంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది. çసువర్ణమ్మ చనిపోయిన రోజున ఇద్దరి కాల్ లిస్టులను పరిశీలించగా ఆ సమయంలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నట్లుగా వెల్లడయ్యింది. సుజాతను ఎన్నిసార్లు అడిగినా తన సమా«ధానం ఒక్కటే .. ‘నాకేం తెలియదు’ అని. కానీ పోలీసుల నిఘా మాత్రం సుజాతను నీడలా వెంటాడింది. డిసెంబర్ 4న ఉదయం సుజాత, నరేష్ ఇద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు ముందే అనుకున్న ప్లాన్ ప్రకారం. ఇది గమనించిన పోలీసులు రైల్వేస్టేషన్‌లోనే ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరినీ విచారించడం మొదలుపెట్టడంతోనే తామే సువర్ణమ్మను హత్య చేశామని ఒప్పుకున్నారు. నిజాలను బైట పెట్టారు. కుటుంబసభ్యులంతా మౌనంగా తలదించుకున్నారు.
సుజాత భర్త నాలుగేళ్ల క్రితం తమ్ముడితో కలిసి విదేశాలకు వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.సుజాత కూడ కొన్నాళ్లు అక్కడే ఉంది. ఏడాది క్రితం పండక్కి అందరూ వచ్చారు. ఆ సమయంలో సువర్ణమ్మకు ఆరోగ్యం బాగుండకపోవడంతో సుజాతను అమ్మకు తోడుగా ఉండమన్నాడు భర్త. దీంతో సుజాత ఏడాదిగా ఇక్కడే ఉంటోంది. ఈ సమయంలోనే సుజాతకు నరేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సువర్ణమ్మ ఉద్యోగానికి వెళ్లిపోవడంతో సుజాత ఒక్కర్తే ఇంట్లో ఉండేది.ఓసారి ఇంట్లో సుజాతతో నరేష్ ఉండటం చూసి సువర్ణమ్మ కోడలిని హెచ్చరించింది. కొడుకుతో చెబుతానని తల్లిదండ్రినిపిలిపించి నిలదీస్తానని మందలించింది. అత్త అడ్డుతొలగిపోతే తమ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందనుకుంది సుజాత.ఇద్దరూ సువర్ణమ్మను ఎవరికీ అనుమాన ం కలగకుండా హత్య చేయాలని ప్లాన్ చేశారు. దీనికి నరేష్ ఫ్రెండ్స్ కిరణ్, క్రాంతిలు కూడా తోడయ్యారు. అక్టోబర్ 12 అర్ధరాత్రి.సువర్ణమ్మ గాఢ నిద్రలో ఉంది. ఆమె ముఖంపై దిండు పెట్టి, నలుగురూ ఊపిరి ఆడకుండా చేసి చంపివేశారు. ఏటీఎమ్ కార్డులను పిన్‌నెంబర్‌తో సహా నరేష్‌కి ఇచ్చింది సుజాత. ఏటీఎంలలో డబ్బులను డ్రా చేసిన నరేష్ ఆ డబ్బుతో ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేశాడు.డిసెంబర్ 5న ఈ నలుగురిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
– గజవెల్లి షణ్ముఖరాజు,
వరంగల్ రూరల్ స్టాఫ్ రిపోర్టర్
Comments
Please login to add a commentAdd a comment