అదిరెన్‌ ఇడ్లీ | Family food special story | Sakshi
Sakshi News home page

అదిరెన్‌ ఇడ్లీ

Published Sat, Sep 22 2018 12:19 AM | Last Updated on Sat, Sep 22 2018 12:19 AM

Family food special story - Sakshi

అ షాపులో అరటి ఆకు వేస్తారు... నాలుగు రకాల పచ్చళ్లు వడ్డిస్తారు...మరోవ్యక్తి పళ్లెం నిండా ఇడ్లీలు, గారెలు పుచ్చుకుని వస్తాడు... ఇంకొకరు శొంఠి పొడి, నెయ్యి తీసుకువస్తారు...‘మీకు ఏం కావాలి’ అంటూ తమిళ భాషలో ప్రశ్నిస్తూ, కొసరికొసరి వడ్డిస్తారు...ఆ ప్రదేశం పేరు మురుగన్‌ ఇడ్లీ షాపు...ఆ యజమాని పేరు మనోహర్‌...మదురై పేవ్‌మెంట్‌ ప్రారంభమైన వీరి ప్రయాణం‘మురుగన్‌ ఇడ్లీ షాపు’ గా విదేశాల స్థాయికి ఎదిగింది.  ఆ ఫుడ్‌ ప్రింట్స్‌ ఈ వారం...

‘‘మా తల్లిదండ్రులు చెప్పినట్టు విని ఉంటే, నేను వంటగదిలోకి అడుగుపెట్టేవాడినే కాదు. వాళ్లు నన్ను బ్యాంకు ఉద్యోగిగానో, కాలేజీ ప్రొఫెసర్‌గానో చూడాలనుకున్నారు’’ అంటారు మురుగన్‌ ఇడ్లీ షాపు అధినేత 55 సంవత్సరాల మనోహర్‌. చదివిన లా డిగ్రీని పక్కనపెట్టి, తల్లిదండ్రులు నడుపుతున్న చిన్న కాఫీ షాపుని మదురై నుంచి చెన్నైకి, అక్కడ నుంచి సింగపూర్‌ స్థాయికి తీసుకువచ్చారు.  ప్రతిరోజూ మురుగన్‌ ఇడ్లీ షాపు కనీసం రోజూ 25,000 ఇడ్లీలను, 13 బ్రాంచీలలో అమ్ముతోంది. బిజీ సమయాల్లో ఇడ్లీ తినాలంటే ఇక్కడ కనీసం 45 నిమిషాలు నిరీక్షించాల్సిందే. ఇక్కడ ఇడ్లీ తిన్న తరవాత చాలామంది ‘మెత్తగా ఉండే మురుగన్‌ ఇడ్లీ, రకరకాల చట్నీలు కావాలి’ అని అడగడం సహజమైపోయింది. 

అలా మొదలైంది...
కుటుంబ ఆదాయానికి వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్లుగా మనోహర్‌ తల్లి 1960 ప్రాంతంలో మదురై పేవ్‌మెంట్‌ మీద హంగు ఆర్భాటం లేకుండా అతి సామాన్యంగా ఇడ్లీ దుకాణం ప్రారంభించారు. ‘‘మా తల్లిగారు కేవలం ఇడ్లీలు తయారుచేసి అమ్మేవారు. ఇడ్లీలలోకి రెండు రకాల చట్నీలు మాత్రమే చేసేవారు. సాంబారు కూడా ఉండేది కాదు. కస్టమర్లు వాటిని ఎంతో ఇష్టంగా తినేవారు. ఆ చిన్న స్టాలే ఎంతో పేరు సంపాదించుకుంది’’ అంటారు మనోహర్‌.ఒకసారి దివంగత కె. కామరాజు కారులో అటు వెళ్తున్న సమయంలో, ఆ షాపు దగ్గర జనం గుమిగూడి ఉండటం చూసి, తాను కూడా అక్కడ ఇడ్లీ తినాలని కారు ఆపుకున్నారంటే ఆ ఇడ్లీలకు ఎంత పేరు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 1970 నాటికి ఆ స్టాల్‌ చిన్న దుకాణంగా మారింది. ‘‘మురుగన్‌ మా కులదైవం కావడం వల్ల మా షాపుకి ‘మురుగన్‌ కాఫీ నిలయం’ అని పేరు పెట్టాం’’ అని గతం వివరిస్తారు మనోహర్‌.

1993 నాటికి మనోహర్‌ చదువు పూర్తి చేయడంతో, ఇంట్లో వారి కోరికను కాదని  పూర్తిస్థాయిగా ఈ వ్యాపారంలోకి ప్రవేశించారు. ‘‘చిన్నతనం నుంచీ నాకు ఇలాంటి ఒక షాపు నడపాలని కోరికగా ఉండేది. మా తల్లిదండ్రులు మాత్రం, ‘చదువుకున్నవారు పనివాళ్లతో పనిచేయించలేరు’ అని నన్ను వెనక్కులాగారు. నేను ఏ మాత్రం పట్టు విడిచిపెట్టలేదు. ఈ దుకాణం నా చేతిలోకి వచ్చాక సీటింగ్‌ కెపాసిటీ పెంచాను. ఇంటీరియర్‌లో మార్పులు చేశాను. మెనూలో ఇడ్లీలతో పాటు చక్ర పొంగలి, దోసె, వడ, మరిన్ని చట్నీలు, సాంబారు... వంటివి చేర్చాను’’ అని ఎంతో ఆన ందంగా చెబుతున్న మనోహర్, కేవలం రెండు సంవత్సరాలలో మదురైలో మరో రెండు శాఖలు తెరిచి, పది సంవత్సరాల కాలంలో 30 లక్షల టర్నోవర్‌ స్థాయికి తీసుకువెళ్లారు. 

‘‘రెండు నెలల పాటు చెన్నై అంతా తిరిగిన తర్వాత టి. నగర్‌లో మొట్టమొదటి ఇడ్లీ షాపును ప్రారంభించాను. ‘ఇడ్లీ కడై’ అని తమిళ పేరుతో ప్రారంభించడంతో ఆ పేరు ఎలా వినపడుతుందో అని సందేహపడ్డాను. ఆంగ్లంలో ‘మురుగన్‌ ఇడ్లీ షాప్‌’ అని పేరు స్థిరపరిచాను. ఆరు నెలల తర్వాత టి. నగర్‌లోనే మరో ఇడ్లీ షాపు తెరిచాను. ప్రస్తుతం చెన్నపట్టణంలో పది షాపులు ఉన్నాయి. ఇక ధైర్యం వచ్చింది. 2008లో సింగపూర్‌లో తెలుగు, తమిళలు ఎక్కువగా ఉండే ముస్తఫా స్టోర్‌ ఎదురుగా ఒక షాపు ప్రారంభించాను. ఆ రోజే అక్కడ ఇడ్లీలు తినడానికి పెద్ద క్యూ ఏర్పడింది’’ అని సంబరంగా చెబుతారు మనోహర్‌. మురుగన్‌ ఇడ్లీ షాపులో వడ్డించే విధానం, తయారుచేసే విధానం... భోజన ప్రియుల్ని బాగా ఆకర్షిస్తుంది.

‘‘ఇన్ని రెస్టారెంట్లు ఉన్నప్పటికీ ఇడ్లీలు మాత్రం ఒకే చోట తయారుచేసి, అన్ని బ్రాంచీలకు సప్లయి చేస్తారు. ఆరోగ్యకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ‘‘అన్నిరకాల పదార్థాలు అరటి ఆకుల్లోనే వడ్డిస్తాం. అన్‌లిమిటెడ్‌ చట్నీ సాంబారు వడ్డిస్తాం’’ అని చెబుతున్న వీరి ఇడ్లీ షాపులో ‘పొడి కావాలా’, ‘నెయ్యి కావాలా’ అని కొసరి కొసరి వడ్డిస్తారు. వీరికి పోటీగా ఉన్న హోటల్స్‌లో పెద్ద పుస్తకం పరిమాణంలో మెనూ కార్డులు ఇస్తారు. ఇక్కడ కేవలం ఆరోగ్యకరమైన భారతీయ వంటకాలు మాత్రమే దొరుకుతాయి. చెన్నైలోని ఒక మార్కెట్‌ రిసెర్చర్‌ మురుగన్‌ ఇడ్లీ షాపు గురించి ‘ఈ షాపు చైనీ వంటకాల నుంచి చాట్‌ వరకు అమ్మకపోవడం చాలా సంతోషం’ అంటారు.

‘‘ఇడ్లీ తయారీలో మినప్పప్పు, ఉప్పుడు బియ్యం పరిమాణం ఎంత అన్నది రహస్యంగానే ఉంచాం’’ అంటున్న మనోహర్‌ మెనూను స్వయంగా తయారుచేసుకున్నారు. ఇక్కడి కాఫీ కూడా రుచిగా ఉంటుంది. ‘మా అమ్మ తయారుచేసే వాటికే మరి కొన్ని జోడించాను’ అంటారు మనోహర్‌. చాలామంది వీటిని అనుకరించడానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. ఇడ్లీ, వడ, దోసెతో పాటు జిగర్‌ఠండా, ఉల్లి ఊతప్పమ్‌ వీరి ప్రత్యేకం. చిన్న ఉల్లిపాయలు మాత్రమే ఇందుకు ఉపయోగిస్తారు. వాటి తొక్క తీయడం చాలా కష్టం. చిన్న ఉల్లిపాయల వల్లే ఊతప్పానికి రుచి చేరుతుంది. ‘ఉల్లి పాయలు ఒలవడానికి 20 మందిని నియోగించాను. వారంతా మదురైలోనే ఉంటారు. వారు తొక్క తీసి అన్ని ప్రాంతాలకు చేర వేస్తారు. మేం ఇంతవరకూ మురుగన్‌ ఇడ్లీ షాపు ప్రకటనల కోసం ఎక్కువ ఖర్చు చేయలేదు’’ అని గర్వంగా చెబుతారు మనోహర్‌.‘‘మా తల్లిదండ్రుల్లా కాకుండా నేను మాత్రం ఈ వ్యాపారాన్ని నా కుమారుడితో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా ప్రపంచ దేశాల మీద ఉంది. రానున్న పది సంవత్సరాలలో మరో 300 శాఖలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అంటారు మనోహర్‌.
– వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement