యానల్‌ ఫిషర్‌ సమస్య  తగ్గుతుందా? | Family health counciling | Sakshi
Sakshi News home page

యానల్‌ ఫిషర్‌ సమస్య  తగ్గుతుందా?

Published Thu, Sep 20 2018 12:30 AM | Last Updated on Thu, Sep 20 2018 12:30 AM

Family health counciling - Sakshi

నా వయసు 36 ఏళ్లు. నేను గత కొంతకాలంగా మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, మంట, మలంలో రక్తం కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదించాను. కొన్ని పరీక్షలు నిర్వహించి యానల్‌ ఫిషర్స్‌ సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియో మందులతో నాకు పూర్తిగా నయం అవుతుందా?  – డి. సూర్యారావు, విజయవాడ 
దీర్ఘకాలికంగా మలబద్దకం లేదా తరచూ విరేచనాలు అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు ఈ యానల్‌ ఫిషర్స్‌ బారిన పడే అవకాశం ఎక్కువ. ఇటీవలి కాలంలో ఉన్న పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వంటి అంశాలు జీర్ణవ్యవస్థౖపై ప్రభావం చూపి పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. వీటిల్లో ఫిషర్‌ అంటే ఏమిటో తెలుసుకుందాం. మలద్వారం దగ్గర ఏర్పడే నిట్టనిలువు చీలికను యానల్‌ ఫిషర్‌ అంటారు. ఈ చీలిక వల్ల ఈ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల ఇది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన తర్వాత గానీ తీవ్రమైన నొప్పిని, రక్తస్రావాన్ని కలగజేస్తుంది. 

కారణాలు : దీర్ఘకాలిక మలబద్దకం, తరచూ విరేచనాలు, పేగులకు ఇన్ఫెక్షన్‌ కలిగించే వ్యాధులు (ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌), ప్రసవ సమయంలో పెద్దపేగు చివరి భాగం... పురీషనాళానికి (రెక్టమ్‌కు) రక్తప్రసరణ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫిషర్‌ ఏర్పడే అవకాశం ఉంది. 

చికిత్స : జెనెటిక్‌ కాన్‌స్టిట్యూషనల్‌ విధానం ద్వారా ఫిషర్స్‌ సమస్యను హోమియో మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. సంపూర్ణంగా చికిత్స అందించడం ద్వారా ఆపరేషన్‌ అవసరం లేకుండానే వాటిని తగ్గించి, అవి మళ్లీ తిరగబెట్టకుండా  చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో వైద్యులను సంప్రదించి, మీ లక్షణాలను వివరించి తగిన చికిత్స తీసుకోండి. 
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌  ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

సోరియాసిస్‌కి చికిత్స ఉందా? 
నా వయసు 41 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని  మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? 
– డి. రఘురామరెడ్డి, కర్నూలు 

సోరియాసిస్‌ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ సమస్య. ఇది చర్మ సమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ  ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది. సోరియాసిస్‌ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌’ అంటారు. 
కారణాలు : ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. 
లక్షణాలు : ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. 
నిర్ధారణ పరీక్షలు : స్కిన్‌ బయాప్సీ, ఈఎస్‌ఆర్, సీబీపీ, ఎక్స్‌–రే పరీక్షలు. 
చికిత్స : సోరియాసిస్‌ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమై మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. 
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

సైనసైటిస్‌ తగ్గుతుందా? 
నా వయసు 36 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను. కానీ సమస్య తగ్గడం లేదు.  శాశ్వతంగా తగ్గేందుకు  చికిత్స హోమియోలో చికిత్స ఉందా? 
– ఆర్‌. వెంకటేశ్వరరావు, కోదాడ 

సైనస్‌ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్‌ల లోపలివైపున మ్యూకస్‌ మెంబ్రేన్‌ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతను మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్‌ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌ ఫ్యారింగ్స్‌ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్‌ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్‌ వస్తుంది. 

సైనసైటిస్‌ వచ్చిన వారికి 
∙తరచూ జలుబుగా ఉండటం 
∙ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం 
∙ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం 
∙కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం 
∙నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం 
∙తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్‌ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్షెక్షన్‌ వ్యాపించవచ్చు. 
ఎక్స్‌–రే, సీటీస్కాన్‌ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు. 
సైనస్‌ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్‌ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా  నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి... 
∙హెపార్‌ సల్ఫూరికమ్‌ : అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్‌ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు. 

మెర్క్‌సాల్‌ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శరీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్‌ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్‌ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు. 
డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, 
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement