
స్వాతంత్య్రానికి పూర్వం ఇవి చాలా ఫేమస్... దేశవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో రకరకాల వంటకాలను ఆ తరంవారు ఆ రోజుల్లో కొత్తగా పరిచయం చేశారు. అవి నేటికీ అందరినీ ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్... గతం ఎన్నటికీ ఔట్‌డేటెడ్ కాదు. వంద సంవత్సరాల నాటి వంటకాలను నేటికీ ఆస్వాదిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు వాటికి ఉన్న క్రేజు కొద్దిగా కూడా తగ్గలేదు.భోజన ప్రియులను ఎన్నడూ నిరాశ పరచలేదు ఈ క్విజీన్లు. ఈ తరం వారిని కూడాఅటు లాగుతున్నాయి. అటువంటి వాటిలో కొన్నింటిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం...
1 టుండే కబాబీ – లక్నో
1905లో లక్నోలో హాజీ మురాద్ అలీ ‘టుండే కబాబీ’ని ప్రారంభించారు. ఇక్కడ రుచికరమైన మాంసాహార కబాబ్, కుర్మా, బిర్యానీలు లభ్యమవుతాయి. లక్నో నవాబు దగ్గర పనిచేసిన వంటవాడు ఈ క్విజీన్‌లో వంట చేసేవాడు. లక్నోలోని అతి పురాతన ఇరుకుసందుల్లో ఉంది ఈ క్విజీన్. ఇప్పటికీ పాత పద్ధతిలోనే మాంసాహార వంటకాలను తయారుచేస్తున్నారు. ఆ పురాతన వంటకాలను నేటికీ ఆస్వాదిస్తున్నారు.
2 ఇండియన్ కాఫీ హౌస్ – కలకత్తా
ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులంతా ఇండియన్ కాఫీ హౌస్‌కి వచ్చి, ఎన్నోరకాలుగా చర్చించుకునేవారు. కాలేజ్ స్ట్రీట్‌లో ఉన్న ఈ ఇండియన్ కాఫీహౌస్‌కి రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్త్యసేన్, మన్నాడే, సత్యజిత్‌రే, రవిశంకర్ వంటివారు తరచుగా వెళ్తుండేవారట. మటన్ కట్‌లెట్, చికెన్ కబిరాజీలు నేటికీ తక్కువ ధరకు అక్కడ దొరుకుతున్నాయి.
3 బ్రిటానియా అండ్ కో – ముంబై
1923లో ముంబై ఫోర్ట్ ఏరియాలో బ్రిటిషు ఆఫీసర్లు మొట్టమొదటి బ్రిటానియా కంపెనీ ప్రారంభించారు. ఒక సంప్రదాయ పార్సీ ఫేర్ జరిగినప్పుడు బ్రిటానియా బిస్కెట్లు అక్కడి వారి ఆకలి తీర్చాయి. ఇప్పటికీ వారి ఘనతను ప్రతిబింబిస్తూ, నాటి ఫర్నిచర్‌ను అలాగే ఉంచి, కొన్ని కొత్త వస్తువులను జత చేశారు. మటన్, చికెన్ బెర్రీ పులావ్ వీరి ప్రత్యేకత.
4 మావల్లి టిఫిన్ రూమ్ – బెంగళూరు
మావల్లి టిఫిన్ రూమ్ అనే కంటే ఎంటిఆర్ అంటేనే అందరికీ పరిచితం. 1924లో యజ్ఞనారాయణ మయ్యా ఎంటిఆర్‌ను ప్రారంభించారు. 1975 – 76 ప్రాంతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఎంటిఆర్ వారు అతి తక్కువ ధరలకు భోజనం సరఫరా చేయడంతో ఎంటిఆర్‌కి చాలా నష్టాలు వచ్చాయి. దానితో ఇన్‌స్టంట్ సరుకుల వ్యాపారం ప్రారంభించారు. రెడీ టు ఈట్ స్నాక్స్, చట్నీలు, రసం పొడులు అమ్మడం ప్రారంభించారు. వెండి వస్తువులను ఉపయోగించడం వీరి ప్రత్యేకత.
5 కరీమ్స్ – న్యూఢిల్లీ
1913లో హాజీ కరీముద్దీన్ ‘కరీమ్’ను ఢిల్లీలో చాందినీచౌక్ నడిబొడ్డున ప్రారంభించారు. ఇక్కడ లభించే రుచికరమైన వంటకాలకుగాను అనేక అవార్డులు అందుకున్నారు కరీముద్దీన్. నోరూరించే మాంసాహార వంటకాలు ఇక్కడ ప్రత్యేకం. చుట్టూ అందమైన జామా మసీదుతో అందరినీ ఆ ప్రదేశం ఆకట్టుకుంటుంది. మొఘలుల కాలం నాటి నుంచి ఉన్న వంటకాలను కరీమ్ తయారుచేసి ఫుడ్ లవర్స్‌కి రుచి చూపించారు. మటన్ నిహారీ, చికెన్ జహంగీరీ వంటకాల పేరు చెప్పగానే నోరూరనివారు ఉండరు.
6 జోషీ బుద్ధాకాకా మాహిమ్ హల్వావాలా – ముంబై
ముంబై మాహిమ్‌లో ఇదొక చిన్న హల్వా షాపు. ఈ షాపును సుమారు 200 సంవత్సరాల క్రితం... గిరిధర్ మావ్‌జీ ఒక ప్రత్యేకమైన హల్వా తయారుచేసి అమ్మడం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఈ హల్వా ముంబై నగరమంతా వ్యాపించి, అందరి ఆదరణకు నోచుకుంది. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది మిఠాయి ప్రేమికులు ఇక్కడకు వచ్చి, మాహిమ్ హల్వా కొని తింటుంటారు. ఇతర సంప్రదాయహల్వాలకు విరుద్ధంగా, ముంబై హల్వా విలక్షణంగా ఉంటుంది. గోధుమపిండి, పంచదార, నెయ్యి ఈ మూడింటినీ కలిపి, కర్రతో రోల్ చేసి, షీట్లుగా తయారుచేసి, చల్లారబెట్టి, చతురస్రాలుగా కట్ చేసి అమ్ముతారు.
7 రాయర్స్ మెస్ – చెన్నై
చెన్నై మైలాపూర్‌లోని ఒక మారుమూల ప్రదేశంలో రాయర్స్ మెస్‌ను 1940లో శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆయనను అందరూ ప్రేమగా ‘రాయర్’ అని పిలుచుకుంటారు. 80 సంవత్సరాలుగా రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. ఇక్కడ ఇడ్లీలు, కరకరలాడే వడలు (గట్టి చట్నీతో), ఘుమఘుమలాడే వేడి వేడి కాఫీ దొరుకుతాయి. ఎంతోమంది భోజనప్రియులు ఇక్కడకు వచ్చి కొన్నిగంటలు గడిపి వెళ్తుంటారు. పరిశుభ్రతను పాటిస్తారు. రుచిలో ఏ రోజూ లోటు రాదు. అందుకే దూరమని కూడా ఆలోచించకుండా ఫుడ్ లవర్స్ ఇక్కడకు వస్తుంటారు.
8 షేక్ బ్రదర్స్ బేకరీ – పూణె
1800 సంవత్సరంలో షేక్ గులామ్ ఇబ్రహీం ‘షేక్ బ్రదర్స్ బేకరీ’ని స్థాపించారు. గౌహతిలో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, అక్కడకు వెళ్లి తినడం నిత్యకృత్యంగా మారింది. స్థానికులు మాత్రమే కాకుండా బ్రిటిషు అధికారులు కూడా ఇక్కడ తినేవారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు ఈ బేకరీ ఉత్పత్తులంటే మమకారం. నెహ్రూ గౌహతి వచ్చినప్పుడల్లా ఆయన టేబుల్ మీద చీజ్ సిప్పర్స్‌ని తప్పనిసరిగా అందించేవారు.
9 మిత్ర సమాజ్ – ఉడిపి
సుమారు వంద సంవత్సరాల క్రితం సంప్రదాయ ఉడిపి రెస్టారెంటును స్థాపించారు. అక్కడ రుచికరమైన దోసె, బులెట్ ఇడ్లీ, గోలీ బాజే (మంగళూరు బజ్జీ) ప్రత్యేకంగా లభిస్తాయి. ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి నిషేధం. ఇక్కడకు కొత్తగా వచ్చేవారు తప్పనిసరిగా రుచి చూడవలసినవి... మంగళూరు బన్, మసాలా దోసె, దక్షిణ్ కన్నడ స్టైల్ ఖాస్తా కచోరీ, బాదం పాలు.
10 కేసర్ దా ధాబా – అమృత్‌సర్
పాకిస్థాన్ షేఖ్‌పురాలో 1916లో లాలా కేసర్ మాల్ తన భార్యతో కలిసి ధాబాను ప్రారంభించారు. 1947 లో భారత్ నుంచి పాక్ వేరుపడిన తరవాత ఇది అమృత్‌సర్‌కి మారడంతో, అమృత్‌సర్‌కి ఇదొక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఇక్కడకు లాలా లజపతిరాయ్, జవహర్‌లాల్ నెహ్రూ తరచుగా వస్తుండేవారట. ఈ ధాబాలో లభించే మృదువైన వెల్వెట్‌లాంటి దాల్ మఖ్‌నీ రుచి చూడవలసిందే. సన్నని మంట మీద ఒకరోజు రాత్రంతా ఉడికిస్తారు, ప్లేటులో అందించడానికి ముందు క్రీమ్‌తో అలంకరిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా తయారయ్యే క్రీమీ పాలక్ పనీర్, స్టఫ్‌డ్ పరాఠా, ఫిర్నీలను తప్పనిసరిగా రుచి చూసి తీరవలసిందే.
Comments
Please login to add a commentAdd a comment