వాన కురిసే.. గుగ్గిళ్లు ఉడికే..! | Fast food | Sakshi
Sakshi News home page

వాన కురిసే.. గుగ్గిళ్లు ఉడికే..!

Jul 22 2016 12:19 AM | Updated on Sep 4 2017 5:41 AM

వాన కురిసే..   గుగ్గిళ్లు ఉడికే..!

వాన కురిసే.. గుగ్గిళ్లు ఉడికే..!

వాన తుంపర్లు ముఖం మీద పడుతుంటే ఉలిక్కిపడి నిద్రలేచాను.

చిరు తిండి

వాన తుంపర్లు ముఖం మీద పడుతుంటే ఉలిక్కిపడి నిద్రలేచాను. సగం మూసి ఉన్న కిటికీ తలుపులో నుంచి వానజల్లు గిలిగింతలు పెడుతోందని నాకు అర్థమైంది. చిన్నగా ఆవలించి, కిటికీ రెక్క వెయ్యబోయి, మళ్లీ ఎందుకో మనసు మార్చుకుని, కిటికీలోనుంచి రోడ్డు మీదికి చూస్తూ ఉండిపోయాను. పక్కింటిలోనుంచి పకోడీల వాసన ముక్కులో నుంచి కడుపులోకి దూరింది. నేనూ ఏమైనా తింటే బాగుండనిపించింది. లేచి అమ్మ దగ్గరకెళ్లాను. మెల్లగా కొంగుపట్టి లాగుతూ, ‘అమ్మా... ఆకలేస్తోంది’ అన్నాను. అమ్మ నవ్వుకుంటూ, బాదం ఆకులో ఏవో పోసి నా చేతికిచ్చింది. ఇంగువ తిరగమోత వేసి, తెల్లటి చిక్కుడు గింజల్లా ఉన్న వాటిని ఆశ్చర్యంగా చూస్తూ, ‘ఏంటమ్మా ఇవి?’ అన్నాను.

‘ముందు తిని చూడు, తర్వాత చెబుతాను’ అంది అమ్మ.  ఒక్కో గింజా నోట్లో వేసుకుంటుంటే కరిగిపోతున్నట్లనిపిస్తోంది. మళ్లీ అడిగా... ‘ఏంట మ్మా ఇవి, భలే బాగున్నాయి, ఎట్లా చేశావు’ అని.  ‘అవి అలచంద గుగ్గిళ్లు. మొన్న ఎవరో మా చేలో పండినయ్యి అని తెచ్చిస్తే, వాటిని కడిగి, నానబోశాను పొద్దున. ఇందాకనే వాటిని కాస్త పలుకుగా ఉండేలా ఉడకబెట్టాను. ఆ తర్వాత బాణలిలో

 
రెండు చెంచాల నూనె వేసి, అందులో చెంచాడు సెనగపప్పు, అరచెంచా ఆవాలు, అరచెంచా జీలకర్ర, అరచెంచాడు మినపగుళ్లు, ఒక కరివేపాకు రెబ్బ వేశాను. నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీరి అందులో పడేశాను. చిటికెడు ఇంగువ కూడా వేశాక ఈ ఉడికించిన అలచందలను అందులో వేసి మూతపెట్టాను. వేగేటప్పుడే ఒక స్పూను ఉప్పేసి బాగా కలియపెట్టాను. అంతే! అలచంద గుగ్గిళ్లు రెడీ. నువ్వు బజ్జోని లేచేసరికి టిఫిన్ సిద్ధం’ అంటూ నాటకఫక్కీలో చెప్పింది అమ్మ.

నేను ఇంకాసిని గుగ్గిళ్లు కప్పులో పోయించుకుని, కిటికీలోనుంచి పడుతున్న వానను చూస్తూ, ఒక్కోటీ తింటుంటే ప్రాణం ఎక్కడికో వెళ్లినట్లనిపించింది. ఇంతలో పక్కింటి చింటూగాడు ఆడుకోవడానికి వచ్చాడు. వాడి జేబు ఉబ్బెత్తుగా కనిపించింది. ఏంటిరా అది అని అడిగేలోపు వాడే నాలుగు పకోడీలు తీసిచ్చాడు. ఇస్తూ నా కప్పులోనుంచి నాలుగు గుగ్గిళ్లు  తీసి నోట్లో వేసుకున్నాడు. భలే బాగున్నాయిరా, ఏంటివి? అని అడిగాడు. నేను అమ్మ నాకెలా చెప్పిందో, వాడికి అలానే చెప్పా... అప్పటినుంచి వాళ్లింట్లో పకోడీలు వేగిన చప్పుడు వినిపించలేదు... గుగ్గిళ్ల ఘుమఘుమలు తప్ప! 

 - బాచి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement