నిశాచరుల్లోనే తాగుబోతులెక్కువ
పరిపరి శోధన
వేళకు నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో కంటే రాత్రి పొద్దుపోయినా నిద్రపోకుండా గుడ్లగూబల్లా మేలుకొనే నిశాచరుల్లోనే తాగుబోతులు ఎక్కువగా ఉంటారట. టీవీ చూడటం, ఇంటర్నెట్‌లో చాటింగ్ చేయడం, వీడియోలు చూడటం వంటి ఊసుపోని కాలక్షేపం పనుల కోసం కొందరు వేళకు నిద్రపోకుండా మెలకువగా ఉంటూ ఉంటారు.
ఇలాంటి వాళ్లు చేతికి దొరికిన చిరుతిళ్లను నాన్‌స్టాప్‌గా నములుతూ ఉండటం, మందు కూడా అందుబాటులో ఉంటే, ఆరారగా గొంతు తడుపుకుంటూ ఉండటం చేస్తారట. గంటల తరబడి ఇదే ప్రక్రియ కొనసాగిస్తూ, తమకు తెలియకుండానే అతిగా తినేసి, అతిగా తాగేసి ‘నిషా’చరుల్లా మారుతారట. ఫిట్‌నెస్ ట్రాకర్ యాప్ ‘జాబోన్ యూపీ’ సాయంతో అమెరికన్ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ విషయాన్ని గుర్తించారు.