ఓ ఆత్మ కథ | The story of a soul | Sakshi
Sakshi News home page

ఓ ఆత్మ కథ

Published Sun, Mar 9 2014 1:07 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఓ ఆత్మ కథ - Sakshi

ఓ ఆత్మ కథ

 1897... అమెరికా, పశ్చిమ వర్జీనియాలోని గ్రీన్‌బ్రయర్. ‘‘లాయర్‌గారున్నారా?’’
 తలుపు తీసి గుమ్మంలో నిలబడిన పనివాడిని అడిగింది మేరీ జేన్ హీస్టర్. ‘‘ఉన్నారు... రండి’’ అంటూ తప్పుకున్నాడతను. లోనికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది మేరీ. అరచేతుల్లో పట్టిన చెమటను ఖర్చీఫ్‌తో తుడుచుకుంది. పొడిబారిన పెదవులను నాలుకతో తడి చేసుకుంది. మాటిమాటికీ నుదుటిని వేళ్లతో నొక్కుకుంటోంది. ఆమె టెన్షన్‌లో ఉందని అర్థమైంది పనివాడికి. ‘‘సార్ ప్రార్థనలో ఉన్నారు... వచ్చేస్తారు’’ అంటూ మంచినీళ్లు ఇచ్చి వెళ్లిపోయాడు.
 
 నీళ్లు గటగటా తాగేసింది మేరీ. ఏదో గాభరాగా ఉంది. లాయర్‌గారు ఏమంటారో! తాను చెప్పింది నమ్ముతారో లేదో! బయటకు పొమ్మంటారేమో! ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. ఆమె ఆ టెన్షన్‌లో ఉండగానే లాయర్ జాన్ ఆల్ఫ్రెడ్ ప్రీస్టన్ వచ్చాడు. లేచి నిలబడింది మేరీ. కూర్చోమన్నట్టు సైగ చేస్తూ ఆమెకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడాయన. మేరీ కూడా కూర్చున్నాక అడిగాడు... ‘‘చెప్పండి, ఏం కావాలి?’’
 
 ‘‘న్యాయం కావాలి సర్. నా కూతురిని ఆమె భర్త చంపేశాడు. అతడికి శిక్ష వేయించాలి’’
 ‘‘చంపేశాడా? పోలీస్ కంప్లయింట్ ఇచ్చారా?’’
 ‘‘ఇద్దామనే వెళ్లాను. కానీ వాళ్లు నా మాట నమ్మడం లేదు. ఎలాగైనా మీరే న్యాయం చేయాలి’’... గడగడా చెప్పింది.
 ‘‘తప్పకుండా. ఇంతకీ మీ అమ్మాయిని మీ అల్లుడే చంపాడనడానికి సాక్ష్యాలు మీ దగ్గరున్నాయా?’’
 లేవన్నట్టు అడ్డంగా తలూపింది మేరీ.
 ‘‘మరి అతడే చంపాడని అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారు?’’
 ‘‘నా కూతురు చెప్పింది సర్’’
 ఉలిక్కిపడ్డాడు లాయర్. ‘‘వ్వాట్... మీ కూతురు చెప్పిందా. అంటే, మీకింకో కూతురుందా? తను హత్యను చూసిందా?’’... తేరిపార చూస్తూ అన్నాడు.
 ‘‘లేదు. నాకున్నది ఒకే ఒక్క కూతురు. తననే మా అల్లుడు చంపేశాడు. తను మూడు రోజులుగా నాకు కనిపిస్తోంది. తన భర్తే తనని చంపాడని చెబుతోంది. తనకి న్యాయం చేయమని ఏడుస్తోంది. దయచేసి వాడిని చట్టానికి పట్టించండి.’’
 చివ్వున లేచి నిలబడ్డాడు ప్రీస్టన్. అతడి ముఖంలో మారిన భావాలను గమనించిన మేరీ భయంగా లేచి నిలబడింది. ‘‘సర్... అదీ... మరీ...’’
 ఏం చెప్పవద్దన్నట్టు చెయ్యి చూపించాడు. ‘‘మీరు కూతురు పోయిన బాధలో ఉన్నారు. వెళ్లి రెస్ట్ తీసుకోండి. తర్వాత మాట్లాడుకుందాం’’
 
 ‘‘అది కాదు... నేను చెప్పేది..’’
 ‘‘ప్లీజ్... నాకు కోర్టుకు టైమయ్యింది. వెళ్లిరండి’’ అనేసి విసురుగా లోనికి వెళ్లిపోయాడతను. మౌనంగా అక్కడి నుంచి బయటికి వచ్చేసింది మేరీ. అతడు అర్థం చేసుకుంటే బాగుణ్ను అనుకుంది. అలా జరగలేదే అని ఆమె మనసు బాధగా మూలిగింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఇంటివైపు అడుగులు వేసింది.

 
 రాత్రి పదకొండున్నర కావస్తోంది. నిద్ర రావడం లేదు మేరీకి. అటూ ఇటూ తిరగసాగింది. కళ్లల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. టేబుల్ మీద ఉన్న తన చిట్టితల్లి ఫొటోని తీసుకుని, గుండెలకు హత్తుకుంది. అంతలో కిటికీలోంచి ఈదురుగాలి రివ్వున లోనికి వచ్చింది. అంతవరకూ స్తబ్దుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారినట్టనిపించింది. మేరీకి తెలుసు... అది తన కూతురి రాకకు చిహ్నమని. గబగబా గార్డెన్‌లోకి పరుగు తీసింది. ‘‘జోనా... ఎక్కడున్నావ్ తల్లీ’’.... అరుస్తూ తోటంతా తిరుగుతోన్న మేరీ ఠక్కున ఆగిపోయింది. ఎదురుగా ఏదో అస్పష్టమైన రూపం కదలాడుతోంది. ‘అమ్మా’ అన్న పిలుపు చెవులను సోకింది. ఆ తల్లి ఒళ్లు పులకరించింది.
 
 ‘‘వచ్చావా తల్లీ... నన్ను క్షమించమ్మా... నీకు న్యాయం చేయలేకపోతున్నాను. నిన్ను చంపినవాడికి శిక్ష వేయించలేకపోతున్నాను’’... మేరీ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.
 
 ‘‘ఏడవకమ్మా. నీ మాట వినకుండా వాణ్ని పెళ్లి చేసుకున్నందుకు మంచి శాస్తే జరిగింది నాకు.’’
 
 మేరీ మనసు విలవిల్లాడింది. ‘‘వాడిని వదలను తల్లీ.  నీకు మాటిస్తున్నాను. వాడిని వదలను. శిక్ష వేయిస్తాను...’’
 
 పరిగెత్తుకు వచ్చి మేరీని పట్టుకున్నాడు ఆమె భర్త. ‘‘ఈ టైములో గార్డెన్‌లోకి ఎందుకొచ్చావ్? నీ అరుపులు వినిపించి వచ్చాను. అసలేమయ్యింది నీకు’’ అంటూ పట్టి కుదిపాడు.
 
 భర్తని వాటేసుకుని భోరుమంది మేరీ. ‘‘జోనా వచ్చింది. చూడు ఎలా బాధపడుతోందో’’... మేరీ చూపించినవైపు చూశాడతను. ఎవరూ లేరు. ‘‘సరేలే... ముందు నువ్వు లోపలికి పద’’ అంటూ మేరీని లోనికి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. చాలాసేపు ఏడ్చి, ఎప్పటికో నిద్రలోకి జారుకుంది మేరీ.
 
 
 ‘‘అర్థం చేసుకోండి మిసెస్ హీస్టర్. మీరు చెప్పేది నిజం కాదు. అంతా మీ భ్రమ’’ అన్నాడు లాయర్ ప్రీస్టన్ కూల్‌గా.
 
 ‘‘లేదు. ఏ తల్లీ తన బిడ్డ గురించి భ్రమపడదు. జోనా బాడీకి పోస్ట్‌మార్టమ్ చేయించండి. అన్ని విషయాలూ మీకే తెలుస్తాయి. అలా చేయించమని జోనాయే చెప్పింది’’
 నవ్వాడు లాయర్. ‘‘నేను దెయ్యాల్ని నమ్మను. కానీ తల్లిగా మీరు పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. మీ కేసు నేను టేకప్ చేస్తాను.’’
 
 ఆనంద బాష్పాలు జాలువారాయి మేరీ కళ్ల నుంచి. ‘‘ఈ ఒక్క మాటా చాలు సర్’’ అంటూ చేతులు జోడించింది.
 
 జనవరి 23, 1897 ఉదయం, నిండు గర్భిణి అయిన జోనా మృతదేహం ఆమె నివసిస్తోన్న ఇంటి హాల్లో రక్తపు మడుగులో కనిపించింది. వాళ్లింటికి వచ్చిన ఓ యువకుడు అది గమనించి పోలీసులకు కబురందించాడు. విచారణలో జోనా మెట్ల మీది నుంచి జారిపడి చనిపోయినట్లు తేలింది. దాంతో కేసును మూసేశారు. కానీ ఆమెది హత్య అని మేరీ పట్టుబట్టడంతో కేసును మళ్లీ తెరిపించాడు లాయర్ ప్రీస్టన్. జోనా దేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. మెడ ఎముక విరిగిపోయింది. శ్వాసనాళం ఛిద్రమైపోయింది. గొంతును పిసికినట్టుగా వేళ్లముద్రలున్నాయి. పలుచోట్ల ఎముకలు విరిగిపోయాయి. లాయర్ షాక్ తిన్నాడు. ఎందుకంటే తన భర్త ఎక్కడెక్కడ తనని కొట్టాడో, ఒంటిమీద ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయో జోనా తనకు చెప్పిందని మేరీ అతడితో చెప్పింది. ఆమె చెప్పిన వివరాలన్నీ పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఉన్నాయి. మేరీకి న్యాయం చేయాలని ఆ క్షణమే నిర్ణయించేసుకున్నాడతడు. తన నివేదికను కోర్టుకు సమర్పించాడు. జోనా భర్త ఎడ్వర్డ్ షూని అరెస్ట్ చేయించాడు.
 
 
 జోనా కేసు అందరినీ కలిచివేసింది. తల్లిదండ్రుల్ని ఎదిరించి ఎడ్వర్డ్ షూని పెళ్లి చేసుకుంది. ఊరి శివార్లలో కాపురం పెట్టారు. మొదట్లో అంతా బాగానే ఉంది కానీ రానురాను షూ ప్రవర్తనలో మార్పు వచ్చింది. పని చేసేవాడు కాదు. ఇంటి అవసరాల్ని పట్టించుకునేవాడు కాదు. జోనాయే ఆ పనీ ఈ పనీ చేసి డబ్బు సంపాదించేది. భర్త పెట్టే హింసలన్నీ భరించేది. ఓ రోజు బాగా తాగి వచ్చిన షూ భార్యతో గొడవపడ్డాడు. కొట్టి, మెట్ల మీది నుంచి తోసేశాడు. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తనను వదిలిపెట్టమని బతిమాలింది జోనా. ఆ రాక్షసుడు కనికరించలేదు. కర్రతో కొట్టాడు. తలమీద మోదాడు. పీక నులిమాడు. భార్య మరణయాత పడుతుంటే కర్కశంగా నవ్వుకుని వెళ్లిపోయాడు. జోనా చనిపోయిందని కబురు వచ్చాక వెళ్లి మొసలి కన్నీళ్లు కార్చాడు. పడివున్న స్థితిని బట్టి ఆమె మెట్ల మీది నుంచి పడిందనే పోలీసులు కూడా అనుకున్నారు. దాంతో షూ తప్పించుకున్నాడు.
 
 కానీ తన భార్యే తనను పట్టిస్తుందని అతడు ఊహించలేదు. భర్త చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోయిన జోనా ఆత్మ రూపంలో వచ్చి, తన తల్లి సాయంతో న్యాయపోరాటం మొదలుపెట్టింది. చివరికి గెలిచింది. జోనా ఆత్మ గురించి మేరీ చెప్పిన విషయాలను కోర్టు నమ్మకపోయినా... లాయర్ చూపిన ఆధారాలు, పోస్ట్‌మార్టమ్ రిపోర్టును బట్టి షూకి జైలుశిక్ష విధించింది. అయితే ఆ శిక్ష పూర్తి కాకముందే దేవుడు అతడికి మరణశిక్ష విధించాడు. మూడేళ్లు జైల్లో మగ్గిన తరువాత అనారోగ్యంతో షూ కన్నుమూశాడు.
 ఆ తర్వాత జోనా ఆత్మ మేరీకి మరెప్పుడూ కనిపించలేదు!
 - సమీర నేలపూడి
 
 గ్రీన్‌బ్రయర్ ప్రాంతానికి వెళ్తే... ఊరి పొలిమేరలో శ్మశానం గేటు దగ్గర ‘గ్రీన్‌బ్రయర్ ఘోస్ట్’ అని రాసివున్న ఓ బోర్డు కనిపిస్తుంది. దాని మీద... ‘ఇక్కడ జోనా సమాధి ఉంది. ఆమె భర్త చేతిలో హత్యకు గురైంది. ఆత్మగా వచ్చి అతడిని చట్టానికి పట్టించింది’ అని రాసివుంటుంది. జోనా ఆత్మ గురించిన కథనాన్ని కొందరు నమ్మలేదు కానీ ఎక్కువశాతం మంది మాత్రం నమ్మారు. అందుకే ఇప్పటికీ ఆ బోర్డు అక్కడ ఉంది. జోనా ఆత్మ కూడా అక్కడే తిరుగుతూ ఉంటుందన్న నమ్మకమూ నిలిచివుంది!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement