ప్రేమ పల్లమెరుగు | Flat love to improve | Sakshi
Sakshi News home page

ప్రేమ పల్లమెరుగు

Published Fri, Dec 18 2015 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

ప్రేమ పల్లమెరుగు

ప్రేమ పల్లమెరుగు

బాటసారికి చెట్టుతో, దుప్పికి చెలమతో,
పిల్లలకు గురువుతో,
చెల్లికి పుట్టింటితో బంధం ఉంది.
కాని- ఆ బంధువులే ఛీ కొడితే
శూన్యాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి?
తమ ఏకాంతాలనే ఒక బంధంగా
మార్చుకున్న బంగారుతల్లుల కథ ఇది.

 
దేవుడు ఒక బంధాన్ని తెంపేస్తే ఇంకో అనుబంధాన్ని ఇస్తాడు. ఒక కష్టాన్ని కలిగిస్తే ఇంకో ఓదార్పు అందిస్తాడు. ఒక నీడ తీసేస్తే మరో ఆసరా కల్పిస్తాడు. ఆశ ఓడిపోకపోతే, బతుకు పట్ల నిస్పృహ కలగకపోతే, జీవితాన్ని చూసి భయపడకపోతే రేపు అనేది ఒకటి కచ్చితంగా ఉంటుంది. వెలుగు అనేది కచ్చితంగా ఉంటుంది. భవిష్యత్తు అనేది కచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని ‘దివ్యదిశ’ హోమ్‌ను చూస్తే అదే అనిపిస్తుంది. ఎక్కడెక్కడి వాళ్లో... ఇక్కడ కలిశారు. ఆత్మీయులయ్యారు. చేయీ చేయీ పట్టుకొని నిర్భయంగా ముందుకు నడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి స్ఫూర్తి కలిగిస్తున్నారు.

ఆ అయిదుగురు...
వీరి పేర్లు- సుజాత, మానస, సుల్తానా, జ్యోతి, అలీఫియా, సమ్రీన్...! అంతా కౌమారంలో ఉన్నవారే! కళకళలాడుతున్న ఈ ఆడపిల్లలందరూ తమ తమ సొంత ఇళ్లల్లో తల్లిదండ్రుల అనురాగంలో ఉండాలి. కాని పరిస్థితి ఇక్కడకు చేర్చింది. ఒక్కొక్కరిది ఒక్కో కథ. హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్.. మతాలు వేరైనా కష్టం ఒకటే.
 
చుట్టూ చేరుతారు...
 పంతొమ్మిదేళ్ల సుజాత ఇంటర్మీయెట్ చదువుతోంది. ఎమ్‌కామ్ చేసి పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలనే కోరికతో ఉంది. హోమ్‌కు వెళ్లినప్పుడు మొదటగా హుషారుగా పలకరించింది ఈ అమ్మాయే. ‘మాది వైజాగ్. నేను ఎనిమిదో తరగతి చదువుతుండగా మా అమ్మానాన్నలు బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. చదువుకోవాలని అనిపించేది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా కాదని ఒకరోజు ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. స్టేషన్‌కు చేరుకుంటే కదులుతున్న రైలు కనిపించింది. భయం భయంగానే ఎక్కేశాను. చివరకు రైలు హైదరాబాద్‌కు చేరింది. కొంచెం ధైర్యం అనిపించింది. అమ్మయ్య... అమ్మనాన్నలు, బంధువుల కంటపడకుండా ఇక్కడ ఉండిపోవచ్చు అనుకున్నాను. రెండుమూడు రోజులు రైల్వేస్టేషన్‌లో ఉండేసరికి కొందరు వాలంటీర్లు నన్ను చూశారు. నా విషయం తెలుసుకుని ఈ ఫౌండేషన్‌లో ఉండటానికి ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఎప్పుడైనా ఊరు గుర్తుస్తోంది. తమ్ముడు, చెల్లెలు ఎలా ఉన్నారో అని ఏడ్చుకుంటాను. అమ్మనాన్న.. గుర్తుకొస్తారు. కాని మా ఊరికి కానీ ఆ ఇంటికి కానీ వెళ్లాలని అనిపించదు. అయితే ఇంకా బాగా చదువుకొని, ఉద్యోగం వచ్చాక ఒకసారి వెళ్లాలని ఉంది’ అందా అమ్మాయి.
 ‘దిగులుగా ఉన్నప్పుడు ఏం చేస్తావ్’ అని అడిగితే భయం లేదులే అన్నట్టుగా భరోసాగా నవ్వింది. చుట్టూ ఉన్న స్నేహితులను చూపిస్తూ ‘‘వీరంతా ఉన్నారుగా. నా చెల్లెళ్లే. ఏ కొంచెం దిగులుగా అనిపించినా నా చుట్టూ చేరుతారు. జోక్స్ చెప్పి నవ్విస్తారు. ఒంట్లో బాగోలేకపోతే తెల్లవార్లూ మేలుకొని సేవలు చేస్తారు. ఇంట్లో ఉన్నా ఇంత బాగా చూసుకోరు. నేను ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదేమో’’ అంది సుజాత. అప్పుడు ఆ అమ్మాయి కళ్లు తడిశాయి. కన్నీరా... ఆనందబాష్పాలా తెలియలేదు.
 
భరోసానిచ్చే స్నేహం...
 మానసది ఇంకో కథ. ఆ అమ్మాయి చెబుతుంటే జరిగిన విషాదాన్ని చెబుతున్నట్టుగా లేదు... గుండెలోని ఏదో బాధను పంచుకుంటున్నట్టుగా అనిపించింది. ‘నాకు ఏడేళ్ల వయసులో అమ్మ చనిపోయింది. నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు. కొత్త అమ్మ ఏం చెప్పిందో ఏమో నన్ను మా మేనత్త ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత చూడటానికే రాలేదు. అత్త నన్ను ఓ ఇంట్లో పనిలో పెట్టింది. అక్కడ చాలా పని. చేయకపోతే విపరీతంగా కొట్టేవారు. చాలా ఏడుపొచ్చేది. చెప్పుకోవడానికి అమ్మలేదు. నాన్న రాడు. ఓ రోజు తెగించాను. రాత్రిపూట బయటపడి చీకట్లోనే రైల్వేస్టేషన్ చేరుకున్నాను. వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఓ రెలైక్కాశాను. రైలు ఎక్కడో ఓ చోట ఆగితే దిగాను. అదో రైల్వేస్టేషన్. నాలుగురోజులు ఉన్నాను. దొరికింది తిని, నీళ్లు తాగి కడుపు నింపుకునేదాన్ని. ఐదో రోజు ఒక అక్క పరిచయం అయ్యింది. నా గురించి విని, తనతో పాటు తీసుకెళతానంది. ఆమెతో వెళుతుంటే అప్పుడే పోలీసులు వచ్చి, నా గురించి అడిగారు. ఇంటి నుంచి వచ్చేశానని, ఎవరూ లేరని తెలుసుకున్నాక వారు ఆ అక్కను తిట్టి, నన్ను ఈ హోమ్‌లో చేర్చారు. ఆమెతో వెళ్లుంటే ఏమై ఉండేదాన్నో. తలుచుకుంటే భయం వేస్తుంది. ఆరేళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్నాను. ఎప్పుడైనా అర్ధరాత్రి మెలకువ వచ్చినప్పుడు చాలా భయమేస్తుంది. కానీ వీళ్లను చూడగానే ‘హమ్మయ్య’ అనుకుని మళ్లీ నిద్రపోతాను’ అని చెప్పిన మానస తండ్రి గురించి గానీ, బంధువుల గురించి మరోమాట చెప్పడానికీ ఇష్టపడలేదు.
 
అన్ని పండగల్లోనూ సందడే...

పన్నెండేళ్ల అలీఫియా ఈ గ్రూప్‌లో అందరికన్నా చిన్న. ఆరేడేళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోతే సొంత అక్కే ఆమెను వదిలించుకోవడానికి రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లిపోయింది. అలా ముంబై నుంచి హైదరాబాద్ చేరుకుంది అలీఫియా. ‘ఇక్కడకు వచ్చాక ఈ అక్కలే నాకు తెలుగు నేర్పించారు.’ అంది చక్కటి తెలుగులో మాట్లాడుతూ. తనకు డాన్స్ బాగా వచ్చట. ‘మేమంతా ఏ చిన్న పండగ వచ్చినా కలిసి సంబరంగా జరుపుకుంటాం. డ్యాన్సులతో అదర గొట్టేస్తాం. నేనే ఫస్ట్ వస్తాననుకో’ అంది గర్వంగా. కాకినాడ నుంచి వచ్చిన సుల్తానా, మహారాష్ట్ర నుంచి వచ్చిన సమ్రీన్‌ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాంటిదే! ఇక తల్లీతండ్రీ లేని జ్యోతికి ఏడేళ్ల వయసుకే లోకం అర్థమైపోయింది. బంధువులు కంటి తుడుపు మాటలు చెప్పగలరేకాని ఆసరా ఇచ్చే సమయానికి ముఖం చాటేస్తారని అర్థమైంది. కాని ఈ హోమ్‌కు చేరుకున్నాక చాలామంది బంధువులు దొరికినట్టనిపించింది. ‘సొంత బంధువుల మధ్య పెరిగినా ఇంత ఆనందంగా ఉండేదాన్ని కాదు’ అందా అమ్మాయి.

 ఏ దిక్కుకు వెళుతున్నామో తెలియకుండానే ఒంటరి పోరాటం చేయడానికి బయల్దేరిన వీరు ఇప్పుడిప్పుడే ఓ గమ్యం ఏర్పరుచుకుంటున్నారు. అక్కా, చెల్లీ.. అని ఒక జట్టుగా ఉన్న తమలోని వారినే పిలుచుకుంటూ ఆప్యాయతలు పెంచుకుంటున్న వీరు ఏ చిన్న సమస్య వచ్చినా పంచుకోవడానికి వారికి వారే అప్తులు అవుతున్నారు. వీరికి మనం చెప్పాల్సింది సానుభూతి వచనాలు కాదు. ఇవ్వాల్సింది స్నేహం. మనమూ ఉన్నామన్న భరోసా. అంతే.
 - నిర్మలారెడ్డి
 ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
 
1987లో దివ్యదిశ ఫౌండేషన్‌ను ప్రారంభించాం. ముందుగా స్లమ్స్‌లోని పిల్లలను, వీధి పిల్లలను చేరదీసి చదువులు చెప్పించేవాళ్లం. ఆ తర్వాత తప్పిపోయిన పిల్లలు మా దృష్టికి వచ్చారు. దివ్యదిశ హోమ్స్ ఉప్పల్‌లో రెండు, తిరుమలగిరిలో ఒకటి, సంగారెడ్డిలో రెండు ఉన్నాయి. తమవారినే నమ్మకుండా పారిపోయి వచ్చిన పిల్లలకు మా మీద నమ్మకం ఏర్పడేవరకు ఓపికగా ఎదురుచూస్తాం. ఇప్పటి వరకు మా ఫౌండేషన్ కింద వేల మంది పిల్లలు పెరిగి కొత్త జీవితాన్ని ఏర్పరుచుకున్నారు.
 - ఇసిడోర్ ఫిలిప్స్, డెరైక్టర్ దివ్యదిశ
 
 చైల్డ్ లైఫ్ లైన్
 ఇల్లు వదిలిన ప్రతీ అమ్మాయి, అబ్బాయికి జీవితంలో ఏదో ఒక కష్టం ఉంటుంది. ఆ కష్టం తీరి జీవితంలో నిలదొక్కుకోవాలంటే ఓ భరోసా కావాలి. అందుకు మనమూ చేయూతనివ్వాలి. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా పిల్లలు తప్పిపోయి, ఒంటరిగా కనిపించినప్పుడు (రోజుల బిడ్డ నుంచి 18 ఏళ్లలోపువారు)ై హెదరాబాద్ నాంపల్లిలో ఉన్న చైల్డ్ లైన్‌కి కాల్ చేయండి... టోల్‌ఫ్రీ నెం. 1098.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement