పొరపాట్లు... ఏమరుపాట్లు
రాంగ్ డైరెక్షన్
గాడ్ గివ్స్ అండ్ ఫర్‌గివ్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. సినిమా ప్రేక్షకులు కూడా దర్శక , నిర్మాతలకు దేవుళ్ల వంటివారే. పిక్చర్‌ను హిట్ చేసి కోట్లకు కోట్లు కుమ్మరిస్తారు. పిక్చర్‌లోని తప్పులను చూసీ చూడనట్లు పెద్ద మనసుతో క్షమించేస్తారు! తప్పులంటే పెద్ద తప్పులేం కాదు లెండి, మానవ తప్పిదాలు. వాటిని పొరపాట్లు, ఏమరుపాట్లు అనుకోవాలి. సరదాగా తీసుకుని నవ్వుకోవాలి. అలా కాసేపు మీ ముఖంపై చిరునవ్వుల్ని చిందించే కొన్ని బాలీవుడ్ ‘చిత్ర’ విచిత్రాలు ఇవి. ఎంజాయ్ చెయ్యండి.
1. ఓవర్‌కి 6 బంతులా?
‘లగాన్’ సినిమా కథ 1892 నాటిది. అందులో రెండు క్రికెట్ టీములూ ఓవర్‌కి ఆరు బంతులు చొప్పున ఆడతాయి! కానీ ఇంగ్లండ్‌లో ఆ కాలంలో ఓవర్‌కి 5 బంతులే ఆడేవారు! హౌ ఈజ్ దాట్!!
2. రెండున్నర ‘నవమాసాలు’!
‘క్రిష్’ చిత్రంలో రోహిత్ (హృతిక్ రోషన్) రెండేళ్లుగా సింగపూర్‌లో ఉంటాడు. ఇక్కడ ఇండియాలో ఉన్న రోహిత్ భార్య ప్రీతీ జింతా ఈ రెండేళ్లూ ప్రెగ్నెంట్‌గానే ఉంటుంది!
3. పాట 1950ల సినిమాలో!
‘భాగ్ మిల్కా భాగ్’ మూవీ కథాంశం 1950ల నాటిది. అందులో ఫర్హాన్ అఖ్తర్ ‘నన్హా మున్నా రహీ హూ’ అనే పాట పాడతాడు. అయితే ఆ పాట 1962 నాటి ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రంలోనిది! భలే బుక్ అయ్యారు రాకేశ్ ఓం ప్రకాష్ మిశ్రా. మిశ్రా ఎవరా? ఆ సినిమా డైరెక్టర్.
4. రాంగ్ అడ్రస్!
‘పికె’ చిత్రంలో సర్ఫరాజ్ (సుశాంత్ సింగ్) తను బ్రూజెస్‌లోని పాకిస్తానీ రాయబార కార్యాలయంలో పనిచేస్తుంటానని జగ్గుతో (అనుష్క) చెబుతాడు. కానీ బ్రూజెస్‌లో ఆ కార్యాలయం లేదు. బ్రస్సెల్స్‌లో ఉంది. (ఈ రెండు ప్రాంతాలూ బెల్జియంలోనివే.)
5. రాంగ్ ట్రైన్
ఇదే సినిమాలో సంజయ్‌దత్ 12290 నెంబర్ ట్రైన్‌లో ఢిల్లీ వస్తాడు. కానీ అది ముంబై, నాగపూర్‌ల మధ్య నడిచే ‘దురంతో’ ఎక్స్‌ప్రెస్! ట్రైన్ మీద ‘కల్యాణ్’ అనే ఇంగ్లీషు అక్షరాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి... అది ‘దురంతో’ ఎక్స్‌ప్రెస్ అనేదానికి రుజువుగా.
6. క్రిస్టియన్ చితాభస్మం!
‘రా.1’ చిత్రంలో షారుఖ్ ఖాన్ దక్షిణాది హిందువు. అతడిని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం శవపేటికలో ఉంచి, ఖననం చేస్తారు! ఆ తర్వాత వచ్చే సీన్‌లో షారుఖ్ భార్య అతడి చితాభస్మాన్ని నదిలో కలుపుతూ కనిపిస్తుంది! దేవుడా!!
7. ‘టాప్’ మిస్టేక్
‘జిందగీ న మిలేగీ దొబారా’ మూవీలో ఒకే సన్నివేశంలో కత్రినా కైఫ్ టీషర్ట్ కలర్ మారిపోతుంది. హృతిక్ రోషన్‌ని కలవడం కోసం ఈ పిల్ల తన ఫ్రెండ్ బైక్ అడిగి తీసుకుని బయల్దేరినప్పుడు పింక్ టాప్‌లో ఉంటుంది. తర్వాతి సీన్‌లో బైక్ దిగి, హృతిక్ రోషన్‌ని కలిసినప్పుడు మెరూన్ కలర్ టాప్‌లో ఉంటుంది.
8. బేతాళుడి బుక్
‘యే జవానీ హై దీవానీ’ చిత్రంలో బన్నీ (రణబీర్ కపూర్), నైనా (దీపికా పదుకొనే) పట్టుకొని ఉన్న లగేజీతో పాటు, ఆమె చేతిలోని పుస్తకం కూడా అందుకుంటాడు. ఆ వెంటనే వచ్చే సీన్‌లో ఆ బుక్ ఇంకా నైనా చేతిలోనే ఉంటుంది! బేతాళుడు తిరిగి చెట్టెక్కినట్టుగా!
9. ఫోర్త్ ఇడియట్!
‘త్రీ ఇడియట్స్’ ఎండింగ్ సీన్‌లో సుహాస్ (ఆలివర్ సంజయ్ లఫాంట్) ఆల్రెడీ పెళ్లి మండపం లోపల ఉంటాడు. కానీ ఆ వెంటనే అతడు మెయిన్ గేటులో నుంచి పెళ్లి మండపంలోకి పరుగెత్తి వస్తూ కనిపిస్తాడు.
10. షేప్ మారిపోయింది
‘దమ్ లగాకే హైస్సా’ మూవీలో సంధ్యను కలవడానికి ప్రేమ్, అతడి కుటుంబం లేత నీలి రంగు ఆమ్నీ వ్యాన్‌లో బయల్దేరతారు. దారి మధ్యలో ఆమ్నీ కాస్తా డొక్కు వ్యానుగా మారిపోతుంది!
11. లేని చానల్‌లో అల్లర్ల న్యూస్!
‘కాయ్ పో చె’ చిత్రంలో గుజరాత్ అల్లర్ల సీన్ ఉంటుంది. ఆ అల్లర్లను సినిమాలో ‘హెడ్‌లైన్స్ టుడే’ ఛానల్ చూపిస్తూ ఉంటుంది. నిజానికి అప్పటికి ఆ ఛానల్ లేదు. అల్లర్లు జరిగింది 2002లో. చానల్ స్టార్ట్ అయింది 2003లో!