కర్నూలు నైటింగేల్ | Florence Nightingale Award to Sugandhamma nurse | Sakshi
Sakshi News home page

కర్నూలు నైటింగేల్

Published Thu, May 12 2016 10:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

కర్నూలు నైటింగేల్

కర్నూలు నైటింగేల్

కర్నూలుకు చెందిన గుండాల సుగంధమ్మ 30 ఏళ్లుగా నర్స్‌గా పని చేస్తోంది. అయితే కేవలం ఆస్పత్రిలో మాత్రమే పని చేయడం తన ఉద్యోగం కాదు అనుకుందామె. అందుకే గ్రామాల్లో, మురికివాడల్లో కూడా పని చేస్తోంది. అవసరం ఉన్నవారికి సేవలు అందిస్తోంది. డాక్టర్ లేని చోట కనీసం నర్సైనా కనపడితే వచ్చే ధైర్యం పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. అలాంటి మేలు చేయడానికి సుగంధమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అందుకే  కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ ఏడాది జాతీయ స్థాయిలో ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సుగంధమ్మ ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకుంది.
 
మా స్వగ్రామం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం. నాన్న జి.మద్దిలేటి, అమ్మ సరోజమ్మ. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైరయ్యారు. నా పాఠశాల విద్య అంతా హుసేనాపురం, ప్యాపిలిలో కొనసాగింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్‌లో జీఎన్‌ఎం విద్యను పూర్తి చేశాను. 1986 మార్చి ఒకటో తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్‌నర్సులో ఉద్యోగంలో చేరాను. మధ్యలో బిఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసి ట్యూటర్‌గా పదోన్నతి పొంది ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)కు బదిలీ అయ్యాను. అక్కడే 2006 వరకు పనిచేశాను. 2006 నుంచి 2012 వరకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజిలో పబ్లిక్‌హెల్త్ నర్సుగా పనిచేశాను. ఆ తర్వాత కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్‌గా పదోన్నతి రావడంతో ప్రస్తుతం అనంతపురం జిల్లా నార్పల పీహెచ్‌సీలో పనిచేస్తున్నాను. స్టాఫ్‌నర్సుగా పదేళ్లు, ట్యూటర్‌గా  పదహారేళ్లు, సీహెచ్‌వోగా నాలుగేళ్లు సర్వీసు కలిగి ఉన్నాను.
 
అమ్మకు చేదోడుగా ఉండాలని...!
అమ్మా నాన్నకు నాతో పాటు 13 మంది సంతానం. అందులో నేను మూడవ సంతానం. ఇద్దరు అక్కలు, ఐదుగురు చెల్లెళ్లు, ఐదుగురు తమ్ముళ్లు ఉన్నారు. అప్పట్లో అమ్మానాన్న ప్రధానోపాధ్యాయులైనా వారికి పెద్దగా జీతాలు ఉండేవి కావు. అందుకే కుటుంబపోషణకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు రోగులకు సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావించి స్టాఫ్‌నర్సుగా విధుల్లో చేరాను.

విధుల్లో చేరాక తెలిసింది- ఇలాంటి సేవకంటే మించినది లేదని.  నా ఐదుగురు చెల్లెళ్లను నేనే చదివించాను. వారిలో సత్య కరుణావతి ఎమ్మిగనూరులో స్కూల్ అసిస్టెంట్‌గా, సత్య కళావతి గుజరాత్‌లోని సీఆర్‌పీఎఫ్‌లో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, సత్యకృపావతి మహబూబ్‌నగర్ జిల్లా మాడుగుల బ్రాహ్మణపల్లిలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నాలుగో చెల్లెలు ప్రమీలా కుమారి ఎంఏ, ప్రసన్నకుమారి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి గాస్పెల్ సింగర్‌గా వ్యవహరిస్తున్నారు.  నా భర్త నర్సింహులు సప్లయర్స్ షాపు నిర్వహిస్తున్నారు. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు  నా సేవా కార్యక్రమాలకు ఏనాడూ అడ్డు చెప్పలేదు.
 
రోగుల సేవే పరమార్థంగా...
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేసే సమయంలో ఎక్కువగా ఐసీ వార్డులో డ్యూటీ ఉండేది. క్రిమిసంహారక మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు అప్పట్లో ప్రతి 15 నిమిషాలకు అడ్రినల్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా వేయాల్సి వచ్చేది. అలా వేస్తేనే వారు కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే పసిరికలు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు కూడా క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధులను తు.చ తప్పకుండా చేయడం వల్ల ఎంతో మంది రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంటికి వెళ్లిపోయారు. వారు వెళ్లేటప్పుడు మా వైపు చూసి రాల్చే ఆనందబాష్పాలు ఎంతో సంతృప్తినిచ్చేవి.
 
ఫ్రీ క్లినిక్‌ల ద్వారా రోగులకు సేవ
ఏ వ్యాధికి ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలనే అవగాహన పేద రోగులకు పెద్దగా ఉండదు. అందుకే వారికి సూచనలు, సలహాలు ఇచ్చి సరైన వైద్యుల వద్దకు పంపించేందుకు ఫ్రీ క్లినిక్‌లను ఏర్పాటు చేశాను. కర్నూలు నగరంలోని లక్ష్మినగర్‌లో ఏడేళ్లు, బుధవారపేటలో రెండేళ్లు, ఓల్డ్‌టౌన్‌లో ఒక సంవత్సరం పాటు ఈ క్లినిక్‌లను నడిపాను. ప్రతిరోజూ క్లినిక్‌లకు 20 నుంచి 30 మంది రోగులు వచ్చేవారు. అలాగే కర్నూలు మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన క్లినిక్‌లో సైతం హమాలీలకు సేవ చేశాను.
 
సమాజ సేవలో...
గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లోని పేద ప్రజలకు సేవ చేసేందుకు  సెయింట్ లూడ్స్ పీపుల్స్ సెల్ఫ్ సర్వీసు అండ్ సొసైటీని స్థాపించాను. తర్వాత ఝాన్సీ మహిళా ఉద్యోగినిల పరస్పర సహాయక పొదుపు సంఘం ఏర్పాటు చేశాను. లయన్స్ క్లబ్‌లో వివిధ హోదాల్లో పనిచేశాను. ప్రస్తుతం ఉమెన్స్ క్లబ్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాను. జన విజ్ఞాన వేదికలోనూ జిల్లా కో కన్వీనర్‌గా ఉండి సేవలందిస్తున్నాను.                 
- జె.కుమార్, సాక్షి, కర్నూలు.
 
ఎవరు ఏమన్నా కాదని...
కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని ఓ ఇంట్లో 12 మంది ఎయిడ్స్ రోగులను ఉంచి చికిత్స చేసేదాన్ని. కాని స్థానికులు అభ్యంతరం చెప్పారు. వారిని ఎక్కడికని పంపను? అందువల్ల  ఆ 12 మందిని నా ఇంట్లోనే ఉంచి సేవ చేసి ఇంటికి పంపించాను. అంటువ్యాధులు నీకు అంటుకోవా అని అడుగుతుంటారు. నా ఒంట్లో ‘దయ’ అనే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. అది ఎంత పెద్ద మొండి వ్యాధినైనా దూరంగా ఉంచుతుంది. ఎదుటివారిలో నుంచి పారిపోయేలా చేస్తుంది అని చెప్తుంటాను.

నాకు చదువుకునే ఆడపిల్లలంటే ఇష్టం. నా జీతం పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. కాని అందులోని డబ్బుతోటే 100 మందికి పైగా విద్యార్థినులను గుంతకల్‌లోని పద్మావతి నర్సింగ్ స్కూల్‌లో నేను ఫీజులు కట్టి చదివించాను. 2009లో కర్నూలుకు వచ్చిన వరదలు అందరికీ గుర్తుండుంటాయ్. ఆ సమయంలో చాలా విస్తృతంగా తిరుగుతూ సేవలు అందించాను. ఇవన్నీ ప్రజల దృష్టికే కాదు ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లాయ్. అందుకే ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను (ఆమె ఈ అవార్డు నిన్న- మే 12న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement