Florence Nightingale Award
-
కోటి టీకాలు ‘నర్సింగ్’ అంకితభావం ఫలితమే
సాక్షి, న్యూఢిల్లీ: నర్సింగ్ సిబ్బంది అంకితభావం వల్లే దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కోటి టీకాలు అందించడం సాధ్యమైందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం నర్సింగ్ సిబ్బందికి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదాన కార్యక్రమం వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది అవిశ్రాంత మద్దతు వల్లే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామని కొనియాడారు. కరోనా సమయంలో సేవలందిస్తూ చాలామంది నర్సింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నైటింగేల్ అవార్డు గ్రహీతల్లో ఒకరు కూడా ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ‘నర్సెస్: ఎ వాయిస్ టు లీడ్.. ఎ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్‌కేర్’థీమ్‌తో ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ని ర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికైన వారికి వర్చువల్ ద్వారా రాష్ట్రపతి అవార్డు అందజేశారు. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిం చారు. అవార్డు, ధ్రువపత్రం, రూ.25 వేల నగదును అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. ఏపీ, తెలంగాణల నుంచి నలుగురుకి ఈ అవార్డు దక్కింది. ఏపీ, తెలంగాణల నుంచి నలుగురికి అవార్డులు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 12 ఏళ్లుగా సేవలందిస్తున్న డి.రూపకళ, తిరుపతి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అములూరు పద్మజ, హైదరాబాద్‌లోని అఫ్జల్ సాగర్‌కు చెందిన అనపర్తి అరుణకుమారి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపురం సబ్సెంటర్కు చెందిన ఎన్వీ షుకురా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. -
'కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకోలేదు'
ఒకరు శుక్రా... మరొకరు అరుణకుమారి. ఇద్దరూ నర్సులుగా జీవితాన్ని మొదలుపెట్టారు. వృత్తినే దైవంగా భావించారు. కుటుంబ సమస్యలేవీ వృత్తిలోకి రానివ్వలేదు. వృత్తిలో ఉండే ఒత్తిడి ఏదీ కుటుంబాన్ని చుట్టుముట్టనివ్వలేదు. నమ్ముకున్న పనికి సంపూర్ణ న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేశారు. దాని ఫలితంగానే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య సేవా రంగంలో జాతీయ స్థాయిలో 56 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల జాబితా ప్రకటించగా వారిలో తెలంగాణా నుంచి ఈ ఇద్దరూ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని సాక్షి పలకరించింది. ► నైటింగేల్ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? శుక్రా: ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్ప వరం ఇచ్చిండు. వర్ణించడానికి కూడా మాటల్లేవు. 28 ఏళ్లు కష్టం చేసిన. కానీ, ఇప్పుడు ఈ అవార్డు ముందట ఆ కష్టమేమీ కనిపించడం లేదు. మా ఇంట్ల, చుట్టుపక్కల, ఊర్లలో కూడా చాలా సంతోషపడుతున్నరు. సన్మానం చేస్తాం అంటున్నరు. వాళ్ల అభిమానమే నాకు పెద్ద అవార్డు. అరుణ: సేవలో దేవుని గుర్తింపు ఉంటుందని ఎప్పుడూ నమ్ముతాను. అది ఈ రోజు నిజమైనందుకు సంతోషంగా ఉంది. 22 ఏళ్లుగా ఏఎన్ఎమ్గా సేవలు అందిస్తున్నా. ఈ అవార్డు ఉందని తెలుసు. కానీ, అంతమందిలో నన్ను వరిస్తుందనుకోలేదు. ► ఈ రంగంలోకి రావాలని ఎలా అనుకున్నారు? శుక్రా: చిన్నప్పుడు తిండికి కూడా లేక బాధపడిన రోజులు ఉన్నాయి. మా ఊరి బడి 5వ తరగతి వరకే. ఆ తర్వాత మా నాన్న నన్ను బాలసదన్ లో వేశాడు. అక్కడే టెంత్ వరకు చదువుకున్నా. తర్వాత నర్స్ ట్రెయినింగ్ చేశాను. మా తాత వాళ్లది రామారం. అక్కడి వాళ్లకు సేవ చేయాలని ఉండేది. ఆ తండాల వాళ్లు అబ్దుల్లా మనవరాలు వచ్చిందని, డాక్టరమ్మ వచ్చిందని అనేవారు. నేను సిస్టర్‌నే కానీ, వాళ్లంతా నాకు డాక్టరమ్మ అని బిరుదు ఇచ్చారు. ఆ పిలుపు నాకెంతో అమూల్యమైనది. అరుణ: మా నాన్న జాన్, అమ్మ శోభారాణి నా కష్టానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడైనా సెలవు పెట్టినా నాన్న వెంటనే ‘ఏదైనా అత్యవసరం ఉంటేనే లీవు పెట్టు తల్లీ. అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటుందో ఏమో..’ అని చెప్పేవారు. మా నాన్న ఉండుంటే ఆయనకే ఈ అవార్డును కానుకగా ఇచ్చేదాన్ని. 1998లో హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని యుహెచ్పిలో జాయినయ్యాను. 2008 నుంచి విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో విధులు నిర్వర్తిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా చుట్టు ఉన్నవాళ్లకు నాకు చేతనయినంత సాయం చేయాలనుకునేదాన్ని. మా మేనమామలు నర్సింగ్ అయితే నీ ఆలోచనకు సూటవుతుందని చెప్పారు. దాంతో టెన్త్ తర్వాత ఎఎన్‌ఎమ్‌గా శిక్షణ తీసుకున్నాను. ► కోవిడ్–19 సమయంలో ఎదుర్కొన్న కష్టాలు.. శుక్రా: ఏం భయపడలేదు. ఉద్యోగమే దేవుడు. నాకేమైనా అయితే ఆ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. ఊరూరూ తిరిగి కరోనా గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన. ఇంట్లో వాళ్లు కూడా నన్ను దూరం పెట్టలేదు. నాకు కరోనా పాజిటివ్ వచ్చినా తట్టుకున్నా. కొన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత డ్యూటీకి వెళ్లిపోయిన. అరుణ: కోవిడ్ టైమ్‌లో తిండీ నిద్రా పట్టించుకున్నది లేదు. అర్ధరాత్రుళ్లు కూడా బయల్దేరేవాళ్లం. కరోనా పేషంట్స్ అంటే వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా భయపడేవాళ్లు. కానీ, వాళ్లను పట్టుకొని అంబులెన్స్ ఎక్కించి, హోమ్ క్వారంటైన్లో ఉంచి, రోజూ వెళ్లి వారి హెల్త్ చెక్ చేసి వస్తే ‘మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్లే పక్కకు పోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మాకు చేసిన సేవకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారు. అలా అందరి దీవెనలు నాకు, నా పిల్లలకు వస్తాయనుకుంటాను. కరోనా పేషంట్ల మధ్య ఉండటం వల్ల నాకూ కరోనా వచ్చింది. డాక్టర్ల సలహాతో 15 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఆ తర్వాత రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. మొదట్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే నన్ను చూసి భయపడేవారు వాళ్లకూ కరోనా వస్తుందేమో అని. మేం ఉండే అపార్ట్మెంట్లో చాలా మంది 50, 60 వయసు పైబడిన వారే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టారు. దేవుని మీద భారం వేసి ముందుకెళ్లేవాళ్లం. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం. మాతో పాటు ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా తీసుకున్నారు. ఎవరూ భయపడలేదు. వ్యాక్సిన్ తర్వాత కూడా అందరం ఆన్‌డ్యూటీలోనే ఉన్నాం. చేసే పని ఏదైనా అంకితభావంగా చేసుకుంటూ పోతే విజయం తప్పక వరిస్తుందన్నది నా నమ్మకం. ► ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు.. శుక్రా: తండాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడంలో అవార్డు వచ్చింది. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి చేతుల మీదుగా అందుకున్నాను. డిఎన్హెచ్ లో ఆరు అవార్డులు వచ్చాయి. వ్యాధుల గురించి అవగాహన కలిగించే పాటలు రాస్తాను. సీడీ ఆవిష్కరణ కూడా చేశాం. గిరిజన డ్యాన్సుల్లో పాల్గొన్నాను. అందుకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటిదాకా పదిహేనుకు పైగా అవార్డులు వచ్చాయి. కానీ, ఇన్నేళ్లయినా ప్రమోషన్లు లేవు. ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కలవాలన్నది నా ఆశ. అరుణ: ఇప్పటివరకు బెస్ట్ ఏఎన్ఎమ్గా ఆరు అవార్డులు తీసుకున్నాను. కోవిడ్ డ్యూటీ చేసినందుకు కేటీఆర్ సార్ నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడీ నైటింగేల్ అవార్డు. ఉద్యోగం ఎప్పుడూ నాకు బెస్ట్ ఇస్తూనే ఉంది. ► కుటుంబ జీవనంలో కష్టాలు విధి నిర్వహణకు అడ్డు పడిన సందర్భాలేమైనా ఉన్నాయా? శుక్రా: కుటుంబం గడవడానికి బాగా కష్టపడ్డా. టెన్త్ అయిపోగానే పెళ్లి చేశారు. మా ఆయనకు ఉద్యోగం లేదు. కొద్దిరోజులు కూలికి కూడా పోయిన. అప్పుడు ఆయన కొన్ని రోజులు డెయిలీ వేజ్ చేసేవారు. పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకున్నా వెంట తీసుకొని ఉద్యోగానికి పోయాను కానీ, విధి నిర్వహణకు అడ్డుపడనీయలేదు. అందుకే, ఇప్పుడు అవార్డు తీసుకొని ఊళ్లకు వచ్చిన రోజున ‘నిన్ను రథం మీద తీసుకొస్తం’ అంటున్నరు నా పిల్లలు. అరుణ: ట్రెయినింగ్ అవుతూనే పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరు అమ్మాయిలు. గుండెపోటు వల్ల 2006లో మా ఆయన చనిపోయారు. గుండె చిక్కబట్టుకొని పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేశాను. పెద్దమ్మాయి బీకామ్ కంప్యూటర్స్, చిన్నమ్మాయి బీఎస్సీ నర్సింగ్ అయింది. ఎంత కష్టమొచ్చినా ఉద్యోగం ఉద్యోగమే. మా అమ్మానాన్న, తమ్ముళ్లు, మేనమామలు.. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నిలదొక్కుకున్నాను. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో నర్సింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు అరుణ. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్రా. – నిర్మలారెడ్డి -
కర్నూలు నైటింగేల్
కర్నూలుకు చెందిన గుండాల సుగంధమ్మ 30 ఏళ్లుగా నర్స్‌గా పని చేస్తోంది. అయితే కేవలం ఆస్పత్రిలో మాత్రమే పని చేయడం తన ఉద్యోగం కాదు అనుకుందామె. అందుకే గ్రామాల్లో, మురికివాడల్లో కూడా పని చేస్తోంది. అవసరం ఉన్నవారికి సేవలు అందిస్తోంది. డాక్టర్ లేని చోట కనీసం నర్సైనా కనపడితే వచ్చే ధైర్యం పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. అలాంటి మేలు చేయడానికి సుగంధమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అందుకే కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఈ ఏడాది జాతీయ స్థాయిలో ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా సుగంధమ్మ ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకుంది. మా స్వగ్రామం కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం. నాన్న జి.మద్దిలేటి, అమ్మ సరోజమ్మ. ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైరయ్యారు. నా పాఠశాల విద్య అంతా హుసేనాపురం, ప్యాపిలిలో కొనసాగింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం విద్యను పూర్తి చేశాను. 1986 మార్చి ఒకటో తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్నర్సులో ఉద్యోగంలో చేరాను. మధ్యలో బిఎస్సీ నర్సింగ్ విద్యను పూర్తి చేసి ట్యూటర్‌గా పదోన్నతి పొంది ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)కు బదిలీ అయ్యాను. అక్కడే 2006 వరకు పనిచేశాను. 2006 నుంచి 2012 వరకు ప్రభుత్వ నర్సింగ్ కాలేజిలో పబ్లిక్‌హెల్త్ నర్సుగా పనిచేశాను. ఆ తర్వాత కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్‌గా పదోన్నతి రావడంతో ప్రస్తుతం అనంతపురం జిల్లా నార్పల పీహెచ్సీలో పనిచేస్తున్నాను. స్టాఫ్‌నర్సుగా పదేళ్లు, ట్యూటర్‌గా పదహారేళ్లు, సీహెచ్వోగా నాలుగేళ్లు సర్వీసు కలిగి ఉన్నాను. అమ్మకు చేదోడుగా ఉండాలని...! అమ్మా నాన్నకు నాతో పాటు 13 మంది సంతానం. అందులో నేను మూడవ సంతానం. ఇద్దరు అక్కలు, ఐదుగురు చెల్లెళ్లు, ఐదుగురు తమ్ముళ్లు ఉన్నారు. అప్పట్లో అమ్మానాన్న ప్రధానోపాధ్యాయులైనా వారికి పెద్దగా జీతాలు ఉండేవి కావు. అందుకే కుటుంబపోషణకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు రోగులకు సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావించి స్టాఫ్‌నర్సుగా విధుల్లో చేరాను. విధుల్లో చేరాక తెలిసింది- ఇలాంటి సేవకంటే మించినది లేదని. నా ఐదుగురు చెల్లెళ్లను నేనే చదివించాను. వారిలో సత్య కరుణావతి ఎమ్మిగనూరులో స్కూల్ అసిస్టెంట్‌గా, సత్య కళావతి గుజరాత్‌లోని సీఆర్పీఎఫ్లో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా, సత్యకృపావతి మహబూబ్‌నగర్ జిల్లా మాడుగుల బ్రాహ్మణపల్లిలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నాలుగో చెల్లెలు ప్రమీలా కుమారి ఎంఏ, ప్రసన్నకుమారి ఎల్ఎల్బీ పూర్తి చేసి గాస్పెల్ సింగర్‌గా వ్యవహరిస్తున్నారు. నా భర్త నర్సింహులు సప్లయర్స్ షాపు నిర్వహిస్తున్నారు. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు నా సేవా కార్యక్రమాలకు ఏనాడూ అడ్డు చెప్పలేదు. రోగుల సేవే పరమార్థంగా... కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పనిచేసే సమయంలో ఎక్కువగా ఐసీ వార్డులో డ్యూటీ ఉండేది. క్రిమిసంహారక మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు అప్పట్లో ప్రతి 15 నిమిషాలకు అడ్రినల్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా వేయాల్సి వచ్చేది. అలా వేస్తేనే వారు కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే పసిరికలు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండే రోగులకు కూడా క్రమం తప్పకుండా ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధులను తు.చ తప్పకుండా చేయడం వల్ల ఎంతో మంది రోగులు ప్రాణాపాయం నుంచి బయటపడి ఇంటికి వెళ్లిపోయారు. వారు వెళ్లేటప్పుడు మా వైపు చూసి రాల్చే ఆనందబాష్పాలు ఎంతో సంతృప్తినిచ్చేవి. ఫ్రీ క్లినిక్‌ల ద్వారా రోగులకు సేవ ఏ వ్యాధికి ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలనే అవగాహన పేద రోగులకు పెద్దగా ఉండదు. అందుకే వారికి సూచనలు, సలహాలు ఇచ్చి సరైన వైద్యుల వద్దకు పంపించేందుకు ఫ్రీ క్లినిక్‌లను ఏర్పాటు చేశాను. కర్నూలు నగరంలోని లక్ష్మినగర్‌లో ఏడేళ్లు, బుధవారపేటలో రెండేళ్లు, ఓల్డ్‌టౌన్‌లో ఒక సంవత్సరం పాటు ఈ క్లినిక్‌లను నడిపాను. ప్రతిరోజూ క్లినిక్‌లకు 20 నుంచి 30 మంది రోగులు వచ్చేవారు. అలాగే కర్నూలు మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన క్లినిక్‌లో సైతం హమాలీలకు సేవ చేశాను. సమాజ సేవలో... గ్రామీణ ప్రాంతాలు, మురికివాడల్లోని పేద ప్రజలకు సేవ చేసేందుకు సెయింట్ లూడ్స్ పీపుల్స్ సెల్ఫ్ సర్వీసు అండ్ సొసైటీని స్థాపించాను. తర్వాత ఝాన్సీ మహిళా ఉద్యోగినిల పరస్పర సహాయక పొదుపు సంఘం ఏర్పాటు చేశాను. లయన్స్ క్లబ్లో వివిధ హోదాల్లో పనిచేశాను. ప్రస్తుతం ఉమెన్స్ క్లబ్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాను. జన విజ్ఞాన వేదికలోనూ జిల్లా కో కన్వీనర్‌గా ఉండి సేవలందిస్తున్నాను. - జె.కుమార్, సాక్షి, కర్నూలు. ఎవరు ఏమన్నా కాదని... కర్నూలు మండలం బి.తాండ్రపాడులోని ఓ ఇంట్లో 12 మంది ఎయిడ్స్ రోగులను ఉంచి చికిత్స చేసేదాన్ని. కాని స్థానికులు అభ్యంతరం చెప్పారు. వారిని ఎక్కడికని పంపను? అందువల్ల ఆ 12 మందిని నా ఇంట్లోనే ఉంచి సేవ చేసి ఇంటికి పంపించాను. అంటువ్యాధులు నీకు అంటుకోవా అని అడుగుతుంటారు. నా ఒంట్లో ‘దయ’ అనే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంది. అది ఎంత పెద్ద మొండి వ్యాధినైనా దూరంగా ఉంచుతుంది. ఎదుటివారిలో నుంచి పారిపోయేలా చేస్తుంది అని చెప్తుంటాను. నాకు చదువుకునే ఆడపిల్లలంటే ఇష్టం. నా జీతం పెద్ద ఎక్కువ కాకపోవచ్చు. కాని అందులోని డబ్బుతోటే 100 మందికి పైగా విద్యార్థినులను గుంతకల్‌లోని పద్మావతి నర్సింగ్ స్కూల్లో నేను ఫీజులు కట్టి చదివించాను. 2009లో కర్నూలుకు వచ్చిన వరదలు అందరికీ గుర్తుండుంటాయ్. ఆ సమయంలో చాలా విస్తృతంగా తిరుగుతూ సేవలు అందించాను. ఇవన్నీ ప్రజల దృష్టికే కాదు ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లాయ్. అందుకే ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను (ఆమె ఈ అవార్డు నిన్న- మే 12న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు).