ఫటాఫట్
ఇది తాగండి!
రోజూ ఓ పావులీటరు కాన్‌బెర్రీ జ్యూస్ తాగితే మంచిది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు! దీని వల్ల యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ (యు.టి.ఐ) రాకుండా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
రెండున్నర కోట్ల సార్లు!
మన చేతివేళ్ళను ముడుస్తూ ఉంటాం, తెరుస్తూ ఉంటాం, వంచుతూ ఉంటాం. చాలామందికి తెలియనిది ఏమిటంటే, జీవితంలో మన చేతి వేళ్ళు ఏకంగా సుమారు రెండున్నర కోట్ల సార్లు ఇలా ముడవడం, తెరవడం జరుగుతుందట!
బుర్ర పని చేయట్లేదా?
ఆఫీసులో బుర్ర చురుగ్గా పనిచేయడం లేదా? అయితే, ఒక్కసారి చుట్టుపక్కల చూడండి. అది ఎందుకు అంటారా? చుట్టుపక్కల వాతావరణం, మనుషులు నిరుత్సాహంగా, విసుగు తెప్పించేలా ఉన్నా, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఆ ప్రభావం మన బుర్ర పనిచేసే తీరు మీద పడుతుందట!
ఆరోగ్యానికి... చాక్లెట్
► చాక్లెట్ తింటే వచ్చే నష్టాల గురించి చాలా చెబుతుంటారు కానీ, డార్క్ చాక్లెట్ వల్ల లాభాలూ ఉన్నాయి. డార్క్ చాక్లెట్‌కు రక్తపోటును తగ్గించే సుగుణం ఉంది. అలాగే, గుండె పోటు ముప్పును కూడా తగ్గిస్తుందట.
► డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆ మాటకొస్తే, ఇతర ఆహారపదార్థాల కన్నా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా, పొటాషియమ్, ఫాస్ఫరస్, జింక్, సెలీనియమ్‌ల కూడా ఇందులో పుష్కలం.
►డార్క్ చాక్లెట్ తింటే, అందులోని బయో యాక్టివ్ పదార్థాల మూలంగా చర్మం అందంగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.