
స్నేహం ఎప్పుడూ నిండుగా చేయాలి. ఆప్యాయతని నిండుగా పంచుకోవాలి. ఈ గాలి.. ఈ నీరు.. ఈ ఆకాశం... ఈ యేరు..ఈ నేడు.. ఈ రేపు అన్నీ మనవే అనుకునిఉత్సాహపడేవాళ్లే స్నేహితులు.ఏ ఇద్దరు స్నేహితులు కలిసిన క్షణాలైనా నిండైనవి. వాటిని బోలు పదార్థాలతో ఎందుకు చప్పగా మార్చాలి?ఇలా కూరిన స్నాక్స్‌తోకూరిమి (స్నేహాన్ని)వెలిగించండి.
ఆలూ కుల్చా
కావలసినవి: గోధుమ పిండి – ఒక కప్పు (120 గ్రా.); మైదాపిండి – ఒక కప్పు; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; నెయ్యి లేదా నూనె – 3 టీ స్పూన్లు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; కుల్చాలు కాల్చడానికి నూనె లేదా నెయ్యి – తగినంత; నువ్వులు – ఒక టేబుల్ స్పూను
స్టఫింగ్ కోసం: బంగాళ దుంపలు – 3 (సుమారు 350 గ్రా. ఉండాలి); సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 5; మిరప కారం – అర టీ స్పూను; ఆమ్‌చూర్ పొడి – అర టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, మైదాపిండి, బేకింగ్ సోడా, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పెరుగు, మూడు టీ స్పూన్ల నూనె జత చేసి, మృదువుగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి, చేతితో అదుముతూ ఎక్కువ సేపు కలిపి, మూత ఉంచి రెండు గంటలు నాననివ్వాలి ∙అరగంట తరవాత ఒకసారి పిండిని బాగా కలిపి, మళ్లీ మూత ఉంచాలి ∙బంగాళ దుంపలను ఉడకబెట్టి, తొక్క తీసేసి, దుంపలను చేతితో మెత్తగా మెదిపి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙పచ్చిమిర్చి తరుగు, ఆమ్ చూర్ పొడి, గరం మసాలా, కొత్తిమీర తరుగు జత చేయాలి ∙అన్నీ బాగా కలిసే వరకు మరోమారు చేతితో బాగా కలపాలి ∙కలిపి ఉంచుకున్న గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ∙ఒక్కో ఉండను చిన్న చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి ∙తయారుచేసి ఉంచుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని, చపాతీ మీద కొద్దిగా ఉంచి అంచులను మధ్యలోకి తీసుకువచ్చి మూసేయాలి ∙కొద్దిగా గోధుమ పిండి అద్దుతూ, జాగ్రత్తగా ఒత్తాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక ఒత్తి ఉంచుకున్న కుల్చాను ఉంచి, రెండు వైపులా నెయ్యి వేసి బాగా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి (ఇవి కాలడానికి ఎక్కువ సమయం పడుతుంది. రెండు మూడుసార్లు అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. లేదంటా పచ్చిగా ఉంటాయి)
క్యాబేజీ రోల్స్
కావలసినవి: క్యారట్ తురుము – అర కప్పు; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; పచ్చి బఠాణీ – పావు కప్పు; కార్న్ ఫ్లోర్ – పావు కప్పు; ఉప్పు – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు (సన్నగా తరగాలి); క్యాబేజీ పెద్ద పువ్వు – 1
తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో నిండుగా నీళ్లు పోసి బాగా మరిగించి, దింపేయాలి ∙క్యాబేజీ పువ్వును ఆ నీళ్లలో వేసి మూత పెట్టి, పావుగంటసేపు అలాగే ఉంచేయాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి
ఆవాలు, జీలకర్ర ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
క్యారట్ తురుము, పచ్చిబఠాణీ వేసి బాగా వేయించాలి ∙ఉప్పు జతచేసి మరోమారు కలిపి, కొద్దిగా నీళ్లు పోసి మూత ఉంచాలి ∙కార్న్‌ఫ్లోర్‌కు తగినన్ని నీళ్లు జత చేసి బాగా కలిపి, ఉడుకుతున్న క్యారట్ మిశ్రమం మీద పోసి కలపాలి
మిరియాల పొడి, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి బాగా కలిపి దింపేయాలి ∙వేడినీళ్లలో ఉన్న క్యాబేజీని బయటకు తీయాలి క్యాబేజీ పొరలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసి పక్కన ఉంచాలి ∙తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని స్పూనుతో తీసుకుని క్యాబేజీ పొరలో ఉంచి, పొట్లం మాదిరిగా రోల్ చేయాలి
కార్న్‌ఫ్లోర్ నీళ్లతో పైభాగం అంచులు మూసేయాలి ∙ఇలా అన్నీ చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారు చేసి ఉంచుకున్న క్యాబేజీ రోల్స్‌ను వేసి, సన్నని మంటమీద కొద్దిసేపు దోరగా వేయించాక పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. టొమాటో సాస్, చిల్లీ సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి.
బ్రెడ్ రోల్స్
కావలసినవి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 5; పచ్చి బఠాణీ – 3 టేబుల్ స్పూన్లు; స్వీట్‌కార్న్ గింజలు – 3 టేబుల్ స్పూన్లు; బంగాళ దుంపలు – 5 ; పసుపు – పావు టీ స్పూను; కాశ్మీరీ మిరప కారం – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; ఆమ్‌చూర్ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; పనీర్ తురుము – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; బ్రెడ్ స్లయిసులు – 6; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మూడు టీ స్పూన్ల నూనె వేయాలి ∙ఉల్లి తరుగు వేసి రంగు మారేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి ∙మెదిపిన బంగాళదుంప ముద్ద, పసుపు, మిరప కారం, గరం మసాలా, ఆమ్ చూర్ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పనీర్ తురుము జత చేయాలి ∙రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలిపి దింపి, చల్లారబెట్టాలి ∙బ్రెడ్ స్లయిసుల అంచులు కట్ చేసేయాలి ∙బ్రెడ్‌ను నీళ్లలో ముంచి వెంటనే తీసేసి నీళ్లు పూర్తిగా పోయేలా గట్టిగా పిండేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పొడవుగా రోల్ చేసి, బ్రెడ్‌మీద ఉంచాలి ∙బ్రెడ్‌ను రోల్ చేసి అంచులు మూసేయాలి (అంచులు తెరుచుకుని ఉంటే, నూనెలో వేయగానే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది) ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న బ్రెడ్ రోల్స్ వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో కెచప్‌తో అందిస్తే రుచిగా ఉంటాయి.
నూడుల్స్ సమోసా
కావలసినవి: మైదాపిండి – పావు కేజీ; ఉడికించిన నూడుల్స్ – 2 కప్పులు; వాము – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; క్యాబేజీ తరుగు – పావు కప్పు; చిల్లీ సాస్ – ఒక టీ స్పూను; సోయా సాస్ – 2 టీ స్పూన్లు; ఉల్లికాడల తరుగు – పావు కప్పు; కార్న్‌ఫ్లోర్ – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి ∙క్యాబేజీ తరుగు, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కలియబెట్టాలి ∙ఉల్లి కాడల తరుగు జత చేసి మరోమారు కలపాలి ∙ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి మరోమారు కలపాలి ∙పదార్థాలన్నీ బాగా వేగిన తరవాత నూడుల్స్ జత చేయాలి ∙బాగా వేగిన తరవాత బయటకు తీసి ప్లేటులోకి తీసుకోవాలి ∙తడి పోయే వరకు ఆరనివ్వాలి ∙ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్లు వేసి పిండిని ముద్దలా కలిపి, మూత పెట్టి పక్కన ఉంచాలి ∙అర గంట తరవాత పిండిని తీసుకుని, చిన్న చిన్న ఉండలుగా చేసి, పూరీలా ఒత్తుకోవాలి ∙పూరీని సగానికి కోసి, త్రికోణాకారంలో మడతపెట్టాలి ∙నూడుల్స్ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని, ఇందులో స్టఫ్ చేసి అంచులు మూసేయాలి ∙ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమో సాలను వేసి, దోరగా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.
శ్రీలంకన్ వెజిటబుల్ పాన్‌కేక్‌రోల్స్
కావలసినవి: మైదాపిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; పాలు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; నూనె – ఒకటిన్నర టీ స్పూన్లు.
ఫిల్లింగ్ కోసం: క్యారట్ తరుగు – ఒక కప్పు; బంగాళదుంప ముక్కలు – ఒక కప్పు; పచ్చి బఠాణీ – ఒక కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పచ్చిమిర్చి – 4; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను.
తయారీ: ∙స్టౌ మీ ఒక పెద్ద పాత్ర ఉంచి వేడయ్యాక, నూనె వేసి వేడి చేయాలి ∙బంగాళ దుంప ముక్కలు వేసి వేయించి, మధ్యమధ్య లో కలుపుతూ సుమారు నాలుగు నిమిషాలు వేయించాలి ∙క్యారట్ తరుగు, టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు జత చేసి బాగా కలపాలి ∙తగినంత ఉప్పు జత చేయాలి ∙మిరప కారం జత చేసి మరోమారు కలపాలి ∙జీలకర్ర పొడి, మిరియాలు, పసుపు వేసి కలిపి అర కప్పు నీళ్లు జత చేసి బాగా కలపాలి ∙బంగాళ దుంప ముక్కలు బాగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బఠాణీ జత చేసి, మూత ఉంచి, ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ∙ఒక పాత్రలో మైదాపిండి, నూనె, ఉప్పు, పాలు, నీళ్లు వేసి, ఉండలు లేకుండా బాగా కలపాలి ∙స్టౌ మీద నాన్‌స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక, కలిపి ఉంచుకున్న పిండిని చిన్న దోసె మాదిరిగా వేయాలి ∙పిండి సమానంగా పరుచుకునేలా పాన్‌ను నాలుగువైపులకు కలపాలి ∙బాగా కాలి, అంచులు విడేవరకు ఉంచాలి (సుమారు ఐదు నిమిషాల సమయం పడుతుంది. ఒక వైపు మాత్రమే కాల్చాలి. బాగా కాలిన తరవాత చేతితో తీస్తే వచ్చేస్తుంది) చిన్న పూరీ పరిమాణంలో చేసుకున్న పాన్ కేక్‌లో కొద్దిగా స్టఫింగ్ ఉంచి అంచులను మూస్తూ పొట్లంలా తయారుచేసి, రోల్ చేయాలి ∙ఇలా అన్నీ చేసుకోవాలి ∙మిగిలిన పిండిలో, తయారుచేసి ఉంచుకున్న రోల్స్‌ను ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారు చేసి ఉంచుకున్న రోల్స్‌ను అందులో వేసి దోరగా వేయించాలి (నూనె బాగా మరగకూడదు, మీడియం మంట మీద తయారుచేయాలి) ∙వేగిన రోల్స్‌ను పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙సాస్‌తో అందించాలి.
ఆలూ బోండా
కావలసినవి: సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; నీళ్లు – అరకప్పుకి కొద్దిగా తక్కువ; పసుపు – పావు టీ స్పూను; మిరపకారం – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత.
స్టఫింగ్ కోసం: బంగాళ దుంపలు – 5; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – ఒక టీ స్పూను; నిమ్మ రసం – అర టీ స్పూను; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారీ: ∙బంగాళ దుంపలను ఉడికించి, తొక్కతీసి, చేతితో మెత్తగా మెదపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి బంగారురంగులోకి మారేవరకు వేయించాలి ∙అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి ∙పసుపు, ఇంగువ జత చేసి బాగా కలిపిన తరవాత, కొత్తిమీర జత చేసి కలపాలి ∙బంగాళ దుంప ముద్ద జత చేసి కలియబెట్టాలి ∙తడిపోయి, పొడిపొడిలాడే వరకు స్టౌ మీదే ఉంచి కలుపుతుండాలి ∙నిమ్మ రసం, ఉప్పు జత చేసి, దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఈ మిశ్రమాన్ని పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో సెనగపిండి, బియ్యప్పిండి, నీళ్లు, పసుపు, మిరప కారం, ఇంగువ, బేకింగ్ సోడా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు జోడించి బజ్జీల పిండిగా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాచాలి ∙తయారు చేసి ఉంచుకున్న బంగాళ దుంప ఉండలను ఒక స్పూనుతో తీసుకుని, పిండిలో ముంచి, జాగ్రత్తగా నూనెలో వేసి బంగారు రంగులోకి మారే వరకు రెండు వైపులా వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి పచ్చడి, సాస్‌లతో తింటే రుచిగా ఉంటాయి.
చీజ్ స్టఫ్‌డ్ మష్రూమ్‌బాల్స్
కావలసినవి: పుట్టగొడుగులు – 8 (పెద్ద సైజువి); బ్రెడ్ క్రంబ్స్ – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; టూత్‌పిక్స్ – తగినన్ని.
స్టఫింగ్ కోసం: ఉడికించిన బంగాళ దుంప – 1 (మెత్తగా మెదపాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర – రెండు టీ స్పూన్లు; మోజరిల్లా చీజ్ – పావు కప్పు; మిరపకారం – అర టీ స్పూను; చాట్ మసాలా – పావు టీ స్పూను; ఆమ్‌చూర్ పొడి – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత.
పైభాగం కోసం: మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు; కార్న్ స్టార్చ్ – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – పావు కప్పు.
స్టఫింగ్ తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో ఉడికించిన బంగాళ దుపం వేసి మెత్తగా మెదపాలి ∙ఉల్లి తరుగు, అల్లం తురుము, కొత్తిమీర జత చేయాలి ∙చీజ్ తురుము జత చేసి బాగా కలపాలి ∙మిరప కారం, చాట్ మసాలా, ఆమ్ చూర్ పొడి, ఉప్పు వేసి మరోమారు కలిపి పక్కన ఉంచాలి ∙పుట్టగొడుగులను తీసుకుని, జాగ్రత్తగా పైన ఉండే తొడిమ వంటి భాగాన్ని కట్ చేసి తీసేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న స్టఫింగ్‌ను కొద్దికొద్దిగా తీసుకుని పుట్టగొడుగులలోకి స్టఫ్ చేయాలి ∙రెండేసి పుట్టగొడుగులను ఎదురెదురుగా ఉంచి దగ్గరగా అయ్యేలా అదిమి, టూత్ పిక్‌తో కలపాలి ∙వీటిని కార్న్ ఫ్లోర్, మైదా పిండి మిశ్రమంలో ముంచాలి ∙బ్రెడ్ క్రంబ్స్‌లో దొర్లించాలి ∙మైదాలోను, బ్రెడ్ క్రంబ్స్‌లోను రెండు సార్లు ఇదే విధంగా చేయాలి (రెండుసార్లు తప్పనిసరిగా చేయాలి. లేదంటే పుట్టగొడుగులు విడిపోతాయి) ∙వీటిని ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఫ్రిజ్‌లో నుంచి పుట్టగొడుగుల బాల్స్ తీసి నూనెలో వేసి గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment