పిడుగుల దినోత్స‌వం | Funday Childrens Day special story | Sakshi
Sakshi News home page

పిడుగుల దినోత్స‌వం

Published Sun, Nov 11 2018 12:26 AM | Last Updated on Sun, Nov 11 2018 12:26 AM

Funday Childrens Day special story - Sakshi

అల్లరి చేసే చిన్నారులను చిచ్చర పిడుగులతో పోలుస్తారు. కొందరు పిల్లలు సాధించిన విజయాలను చూస్తే కొంతమంది పిల్లలు పుట్టుకతో పిడుగులు. అనుకోక తప్పదు. కొందరు చిన్నారులు వయసులో మాత్రమే చిన్నవాళ్లు. పెద్దలు సైతం సాధించలేని విజయాలను సొంతం చేసుకున్న ఘనత వారిది. శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించిన చిన్నారులు కొందరు, మేధాశక్తితో మేధావులనే మెప్పించిన వాళ్లు కొందరు, కాల్పనిక శక్తిని చాటిన వారు కొందరు, కళా సేవా రంగాల్లో కొందరు...  ఆటలాడుకునే వయసులో ఆడుతూ పాడుతూనే అద్భుతాలను సాధించిన కొందరు చిన్నారుల విజయగాథలు బాలల దినోత్సవం సందర్భంగా...

శ్రవణ్‌–సంజయ్‌ కుమరన్‌
శ్రవణ్‌ కుమరన్, సంజయ్‌ కుమరన్‌ అన్నదమ్ములు. చెన్నైలో ఉంటారు వీళ్లు. శ్రవణ్‌ వయసు పదహారేళ్లు, సంజయ్‌ వయసు పదిహేనేళ్లు. సాధారణంగా ఈ వయసులోని పిల్లల చేతికి మొబైల్‌ఫోన్‌ చిక్కితే వీడియోగేమ్స్‌ ఆడటం లేదా చాటింగ్‌ చేయడంతో కాలక్షేపం చేస్తారు. ఈ గడుగ్గాయిలు అలాంటిలాంటి వాళ్లు కాదు. బడికి వెళ్లే వయసులోనే మొబైల్‌ ఫోన్‌లతో ఆటలాడుకున్నారు. అంతటితో ఆగలేదు. మొబైల్‌ ఫోన్‌లలోని రకరకాల యాప్స్‌ వాళ్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి యాప్స్‌ స్వయంగా రూపొందించాలని బలంగా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రకరకాల మొబైల్‌ఫోన్స్‌పై ప్రయోగాలు ప్రారంభించారు. సొంతంగా యాప్స్‌ రూపొందించారు. వాటిని బంధు మిత్రులకు పరిచయం చేశారు. యాప్స్‌ అద్భుతంగా పనిచేస్తుండటంతో ఈ గడుగ్గాయిలకు బంధు మిత్రుల నుంచి ప్రోత్సాహం దొరికింది.  తల్లి దండ్రుల సహకారం కూడా తోడైంది. దాదాపు డజను వరకు యాప్స్‌ రూపొందించారు. తాము రూపొందించిన యాప్స్‌ను స్వయంగా తామే మార్కెట్‌లోకి విడుదల చేయడానికి వీలుగా 2012లో ‘గో డైమెన్షన్స్‌’ పేరిట కంపెనీని ప్రారంభించారు. దానికి ఈ అన్నదమ్ములే సీఈవోలు. దేశంలోని అతి పిన్నవయస్కులైన సీఈవోలుగా రికార్డులకెక్కారు. శ్రవణ్‌ ఇప్పుడు పన్నెండో తరగతి, సంజయ్‌ పదో తరగతి చదువుకుంటున్నారు. వీళ్లిద్దరి విజయగాథ ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌కెక్కిందంటే వీళ్లు సాధించిన ఘనత ఏ స్థాయికి చెందినదో ఊహించుకోవాల్సిందే. వీళ్లు రూపొందించిన యాప్స్‌ అన్నింటిలోకీ ఆహార వృథాను అరికట్టడానికి వీళ్లు రూపొందించిన ‘గో డొనేట్‌’ యాప్‌ విశేషంగా ప్రశంసలు పొందింది. 

మెలిటా టెస్సీ
పదిహేనేళ్ల వయసులో ఉండే చాలామంది పిల్లలు వ్యాసరచన రాయడానికే తంటాలు పడతారు. చెన్నైకి చెందిన చిన్నారి మెలిటా టెస్సీ మాత్రం ఆ వయసులో ఏకంగా నవల రాసేసింది. చిన్నారుల కాల్పనిక శక్తికి నిదర్శనంగా నిలిచిన ఆమె నవల ‘బ్యాటిల్‌ ఆఫ్‌ ది స్ఫియర్స్‌ ప్రతులు దేశవ్యాప్తంగా పలు పుస్తక ప్రదర్శనల్లోను, బుక్‌స్టోర్స్‌లోను, ఆన్‌లైన్‌లోను ఇప్పటికీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి.  చిన్నప్పటి నుంచి మెలిటాకు ఇష్టమైన వ్యాపకం చదవడం. తొమ్మిదేళ్ల వయసులోనే ‘డెయిరీ ఆఫ్‌ వింపీ కిడ్‌’ నవల చదివింది. ఆ తర్వాత ఇక ఆగలేదు. దొరికిన నవలలను, కథల పుస్తకాలను వదలకుండా చదవసాగింది. ఆమె ఆసక్తిని గమనించిన తండ్రి కోరిన పుస్తకాన్నల్లా ఆమెకు సమకూర్చారు. చదవడంతో సరిపెట్టుకోకుండా స్వయంగా ఏదైనా రాస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో పదమూడేళ్ల వయసులో రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టింది. పదిహేనేళ్ల వయసుకే పర్యావరణ పరిరక్షణ ముఖ్యాంశంగా తొలి కాల్పనిక నవలను విజయవంతంగా రాసేసింది. నోషన్‌ ప్రెస్‌ ప్రచురణకర్తలకు ఈ నవల నచ్చడంతో వారు దీనిని ప్రచురించారు. కాల్పనిక సాహిత్యం అంటే తనకు చాలా ఇష్టమని, ‘హ్యారీ పాటర్‌’ రాసిన జేకే రౌలింగ్‌ తన అభిమాన రచయిత్రి అని చెబుతుంది మెలిటా. 

కౌటిల్య పండిట్‌
‘గూగుల్‌ బోయ్‌’గా ప్రసిద్ధి పొందిన కౌటిల్య పండిట్‌ సాధించిన సంచలన విజయాలు ఎన్నెన్నో ఉన్నాయి. హరియాణాకు చెందిన కౌటిల్య పండిట్‌ వయసు పదకొండేళ్లు. కొన్నాళ్లు కోహండ్‌ గ్రామంలో తన తండ్రి సతీశ్‌ శర్మ నడుపుతున్న ఎస్‌డీ మోడర్న్‌ స్కూల్‌లో చదువుకున్నాడు. ప్రస్తుతం చండీగఢ్‌లోని భవన్‌ విద్యాలయలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు. అసాధారణమైన జ్ఞాపక శక్తితో బాలమేధావిగా గుర్తింపు పొందాడు. తన ఐదేళ్ల వయసు నుంచే వివిధ ప్రదర్శనల్లో ఈ చిచ్చర పిడుగు చూపిన ప్రతిభా పాటవాలు టీవీ చానెళ్లకు పాకాయి. ఇంత చిన్న వయసులోనే గొప్ప జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న కౌటిల్య పండిట్‌ మేధా సామర్థ్యాన్ని కురుక్షేత్ర వర్సిటీ సైకాలజీ విభాగం నిపుణులు స్వయంగా పరిశీలించారు. కౌటిల్య ఐక్యూ 130గా వారు తేల్చారు. పదేళ్ల వయసు పిల్లల్లో ఈ స్థాయి ఐక్యూ అత్యంత అరుదని చెప్పారు. సోనీ టీవీ ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ కేలియే కుbŒ∙భీ కరేగా’ కార్యక్రమానికి కౌటిల్యను ఆహ్వానించింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో క్షణమైనా ఆలోచించకుండానే అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెబుతూ అమితాబ్‌ బచ్చన్‌నే నోరెళ్లబెట్టేలా చేశాడు ఈ చిచ్చరపిడుగు. కౌటిల్య ప్రతిభకు ముచ్చటపడిన గణితవేత్త ఆనంద్‌కుమార్‌ తాను నడుపుతున్న ‘సూపర్‌ 30’ ఇన్‌స్టిట్యూట్‌కి ఆహ్వానించారు. ఐఐటీ ప్రవేశ పరీక్షల కోసం సిద్ధపడుతున్న ‘సూపర్‌ 30’ విద్యార్థులను కౌటిల్య ప్రతిభా పాటవాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కేవలం జ్ఞాపకశక్తి మాత్రమే కాదు, కౌటిల్యకు రాజకీయ పరిజ్ఞానం, సామాజిక చైతన్యం కూడా ఎక్కువే. ఆ చైతన్యంతోనే గుర్గావ్‌లో ‘క్లీన్‌ ఎయిర్‌ ఇండియా’ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు.  

ఆనంద్‌ గంగాధరన్, మోహక్‌ భల్లా
వీళ్లిద్దరూ బాల్య మిత్రులు. ఢిల్లీలోని మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌లో క్లాస్‌మేట్స్‌. సాధారణంగా పదో తరగతి విద్యార్థులు సాధారణంగా స్కూలు, ట్యూషన్‌ అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అరుదుగా దొరికే తీరిక వేళల్లో సినిమాలు, ఆటలు వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. ఆనంద్‌ గంగాధరన్, మోహక్‌ భల్లా నాలుగేళ్ల కిందట పదో తరగతిలో ఉండేవారు. అప్పుడు వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనుషులు నడిచేటప్పుడు కూడా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని ఏదో రీతిలో సద్వినియోగం చేయవచ్చు కదా అని ఆలోచించారు. ఆలోచన వచ్చిందే తడవుగా ప్రయోగాలు ప్రారంభించారు. పోర్టబుల్‌ మొబైల్‌ చార్జర్‌ రూపొందించారు. వీరు రూపొందించిన చార్జర్‌ను షూస్‌కు అనుసంధానించారు. నడుస్తూనే ఈ చార్జర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్ల చార్జింగ్‌ చేసుకోవచ్చు. మామూలు చార్జర్లతో పోలిస్తే ఈ చార్జర్‌ రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. మొబైల్‌ ఫోన్‌ పూర్తిగా చార్జ్‌ కావడానికి ఇంట్లో గంటసేపు చార్జింగ్‌ పెట్టాల్సి వస్తే, వీరు తయారు చేసిన చార్జర్‌లో పెట్టి, అరగంట నడక సాగిస్తే చాలు. ఆనంద్, మోహక్‌లు రూపొందించిన ‘వాకీ మొబి చార్జర్‌’ వార్తలకెక్కి మేధావులను ఆకట్టుకుంది. 

హృదయ్‌ పటేల్‌
యుద్ధ క్రీడల్లో ఘనత సాధించాలంటే ఎంతో ఓపిక, అకుంఠిత దీక్షతో ఏళ్ల తరబడి సాధన కావాలని అంతా నమ్ముతారు. పసితనం వీడని హృదయ్‌ పటేల్‌ తైక్వాండో తరగతిలో శిక్షణ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే అంతర్జాతీయ పోటీలో పాల్గొని ఏకంగా బంగారు పతకాన్ని సాధించి ఆరితేరిన చాంపియన్లను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బెంగళూరులో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబానికి చెందిన ఈ చిచ్చర పిడుగు అల్లరి రోజు రోజుకీ పెరుగుతుండటంతో కొంతైనా అల్లరి తగ్గించుకుంటాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతడిని 2016 నవంబర్‌లో తైక్వాండో కోచింగ్‌ సెంటర్‌లో చేర్చారు. అప్పటికి అతడి వయసు మూడేళ్ల లోపే. కోచింగ్‌లో చేరిన మరుసటి సంవత్సరమే, అంటే 2017 జూలైలో దక్షిణ కొరియాలో జరిగిన చున్‌చియాన్‌ కొరియా ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ తైక్వాండో చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొన్నాడు. పోటీలో పాల్గొన్న వారందరిలోనూ హృదయ్‌ పటేల్‌ అతి పిన్న వయస్కుడు కావడంతో అక్కడి మీడియాను ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులందరూ అతడినే ఆసక్తిగా గమనించసాగారు. వివిధ దేశాల నుంచి వచ్చిన అరవై మంది చాంపియన్లను అవలీలగా ఓడించి బంగారు పతకాన్ని దక్కించుకోవడంతో హృదయ్‌ పటేల్‌ రికార్డులకెక్కాడు. ఆ ఘనవిజయంతో అంతర్జాతీయ మీడియాలో అతడి పేరు మార్మోగింది. నిజానికి కొరియా వెళ్లడానికి అతడికి స్పాన్సర్‌షిప్‌ దొరకలేదు. కనీసం ఆరేళ్లయినా నిండితే గానీ అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి స్పాన్సర్‌షిప్‌ ఇవ్వలేమని ఒక యువజన సంస్థ చేతులెత్తేసిందని హృదయ్‌ తల్లి పింకాల్‌ చెప్పారు. అయితే, హృదయ్‌ ప్రతిభపై నమ్మకం ఉంచిన తన భర్త నవీన్‌భాయ్‌ పటేల్‌ అప్పు చేసి మరీ అతడిని కొరియా తీసుకువెళ్లాడని తెలిపారు. తైక్వాండోలో చేరినా అతడి అల్లరి ఏమాత్రం తగ్గలేదని మురిపెంగా చెబుతారామె. హృదయ్‌ పటేల్‌ ప్రస్తుతం బెంగళూరులోని జైన్‌ హెరిటేజ్‌ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుకుంటున్నాడు. మీడియా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నిస్తే ఈ గడుగ్గాయి ‘నా దగ్గర ఒకే బెల్టుంది. అది గ్రీన్‌ బెల్ట్‌’ అని బదులిస్తాడు. అది తైక్వాండోలో సాధించినదే. 

అనీష్‌ భాన్వాలా
గురి చూసి లక్ష్యాన్ని ఛేదించడం ఏమంత తేలికైన విషయం కాదు. హరియాణా కుర్రాడు అనీష్‌ భాన్వాలాకు మాత్రం అదో సాదాసీదా ఆట. పట్టుమని పదిహేనేళ్ల వయసులోనే ఈ ఏడాది జరిగిన కామన్‌వెల్త్‌ షూటింగ్‌ పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. కామన్‌వెల్త్‌ షూటింగ్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన అతి పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. గత ఏడాది నుంచే అనీష్‌ భారత షూటింగ్‌ టీమ్‌లో కొనసాగుతున్నాడు. కర్నాల్‌లోని సెయింట్‌ థెరిసా కాన్వెంట్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుకుంటున్న అనీష్‌ గత ఏడాది జరిగిన కామన్‌వెల్త్‌ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. జర్మనీలో గత ఏడాది జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రెండు రజత పతకాలను, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఏడాది సిడ్నీలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో వ్యక్తిగతంగా బంగారు పతకాన్ని, టీమ్‌ తరఫున రజత పతకాన్ని సాధించాడు. అనీష్‌ చిన్నప్పటి నుంచే షూటింగ్‌పై ఆసక్తి చూపేవాడు. అతడి ఆసక్తిని గమనించిన తండ్రి తెలిసినవారి వద్ద నుంచి పిస్టల్‌ను ఎరువు తెచ్చి,  స్కూలు మైదానంలో షూటింగ్‌ రేంజ్‌ వద్ద సాధన చేయించేవాడు. ç

శ్రుతి పాండే
రెండేళ్ల వయసులో చిన్నారులు బుడి బుడి అడుగులు వేస్తుంటారు. మెల్లగా పరుగులు తీయడానికి ఉత్సాహం చూపుతారు. అలాంటి బుడి బుడి అడుగుల వయసులో శ్రుతి పాండే మాత్రం యోగాసనాలు వేయడం ప్రారంభించింది. అలహాబాద్‌లో ఆమె నర్సరీలో ఉన్నప్పుడే స్కూల్‌లో ఆమె ప్రదర్శనకు టీచర్లు ముగ్ధులయ్యారు. ఆమెకు నాలుగేళ్లు వచ్చేసరికి తల్లిదండ్రులు ఆమెను గురు హరిచేతన్‌ యోగా శిక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె ప్రదర్శించిన యోగాసనాలకు గురువు సైతం అబ్బురపడ్డారు. వెంటనే ఆమెను తన కేంద్రంలో చేర్చుకుని శిక్షణ ప్రారంభించారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అత్యంత క్లిష్టమైన యోగాసనాలను అవలీలగా వేయగలగడం సాధించింది. ఇక ఆమెకు నేర్పాల్సిందేమీ లేదని గురువు నిర్ధారించి, ఆమెనే శిక్షకురాలిగా తయారు చేశారు. తన ఆరేళ్ల వయసులోనే, 2011లో బ్రహ్మ సరస్వతి ధామ్‌లో దాదాపు ముప్పయి మందికి యోగా శిక్షణ ప్రారంభించి, ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలైన యోగా శిక్షకురాలిగా రికార్డులకెక్కింది. ఆమె వద్ద శిక్షణ పొందిన తొలి బృందంలో అన్ని రకాల వయసుల వారు, అన్ని రకాల వృత్తుల వారు ఉన్నారు. వాళ్లలో వ్యాపారవేత్తలు, గృహిణులు కూడా ఉన్నారు. చిన్న వయసు నుంచే యోగా ప్రారంభించడం మంచిదని, దేశంలోని ప్రతి పాఠశాలలోనూ యోగా శిక్షణను తప్పనిసరి చేయాలని కూడా ఆమె అంటుంది.  

శుభేందుకుమార్‌ సాహు
సాధారణంగా హైస్కూల్‌ పిల్లలు సైన్స్‌ పాఠాలను చదువుకోవడంతోనే సరిపెడతారు. ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికి చెందిన శుభేందుకుమార్‌ సాహు మాత్రం అక్కడితో సరిపెట్టుకోలేదు. సైన్స్‌ పాఠాల్లో చదువుకున్న ఆవిష్కరణలు, వాటి వెనుకనున్న శాస్త్రవేత్తల గాథలు అతడిని ఆకట్టుకున్నాయి. తాను కూడా నలుగురికీ ఉపయోగపడేలా ఏదో ఒకటి ఆవిష్కరించాలనుకున్నాడు. ఆ తపనతోనే రైతులకు ఉపయోగపడే యంత్ర పరికరానికి రూపకల్పన చేశాడు. కోల్‌కతాలో జరిగిన సైన్స్‌ ప్రదర్శనలో తాను రూపొందించిన పరికరాన్ని ‘గిఫ్ట్‌ ఫర్‌ ఫార్మర్స్‌’ పేరిట ప్రదర్శించాడు. సులువుగా విత్తనాలు నాటడానికి, నేల దున్నడానికి, పురుగుమందులు చల్లడానికి పనికొచ్చే ఈ యంత్రం పనితీరు శాస్త్రవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీనికి గుర్తింపుగా 2016లో శుభేందుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా ‘నేషనల్‌ చైల్డ్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్సెప్షనల్‌ ఎచీవ్‌మెంట్స్‌’ సత్కారం లభించింది. రాష్ట్రపతి అవార్డు రావడంతో శుభేందు జాతీయ మీడియాలో మెరిశాడు. శుభేందుకు చిత్రలేఖనం, వ్యాసరచన వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది.

జయకుమార్‌
పేదరికంలో మగ్గుతూ చదువుకోవడం ఆషామాషీ కాదు. అలాంటి పరిస్థితుల్లో చదువుకుంటూనే ఆవిష్కరణలు చేయడమంటే అద్భుతమనే చెప్పాలి. శివకాశికి చెందిన జయకుమార్‌ అలాంటి అద్భుతాన్నే సాధించాడు. రెండేళ్ల కిందట తక్కువ ఖర్చుతో మంటలను ఆర్పే పరికరాన్ని రూపొందించాడు. అప్పడు అతడు తొమ్మిదో తరగతి విద్యార్థి. జయకుమార్‌ తల్లి బాణసంచా కర్మాగారంలో దినసరి కూలి. కొన్నేళ్ల కిందట బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె గాయపడింది. తన తల్లిలాగ మరెవరూ అగ్నిప్రమాదాల్లో గాయపడరాదని తలచిన శివకుమార్‌ తన స్కూల్‌ టీచర్‌ సహాయంతో తక్కువ ఖర్చుతోనే అగ్నిమాపక యంత్రాన్ని రూపొందించాడు. ఈ పరికరం రూపొందించినందుకు శివకుమార్‌కు 2016లో నేషనల్‌ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు లభించింది. 

సైరి రహాంగ్డాలే
అక్కడక్కడా బాల కళాకారులు ఉండటం అరుదే గాని, వారు తమ తమ కళా ప్రదర్శనలకు, వాటి ద్వారా వచ్చే విజయాలకు మాత్రమే పరిమితమైపోతుంటారు. పదిహేనేళ్ల సైరి రహాంగ్డాలే ధోరణి ఇందుకు పూర్తిగా భిన్నం. భరతనాట్యంలో ఇప్పటికే ప్రతిష్ఠాత్మక ఘన విజయాలు సాధించిన సైరి, తన నాట్యప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసం వెచ్చిస్తోంది. నాట్య ప్రదర్శనల ద్వారా డబ్బు రావడం మొదలయ్యాక, తాను ఆ డబ్బును చుట్టు పక్కల పేద పిల్లల కోసం ఖర్చు చేయాలనుకుంటున్నానని చెప్పిందని, ఆమె సంకల్పానికి తాము వీలైనంతగా చేయూతనిస్తున్నామని సైరి తల్లిదండ్రులు మీతా, ప్రకాశ్‌ రహాంగ్డాలే చెప్పారు. తమిళనాడులోని సేలంలో చదువుకుంటున్న సైరి పంచరత్న అవార్డు, నిత్యశ్రీ అవార్డు వంటి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement