సాయంత్రం ఆరవుతోంది. దివ్యకు ఎందుకో అనీజీగా ఉంది. తనకిప్పుడు ఐదు నెలల గర్భం. చెమటలు పడుతున్నాయి. మాటిమాటికీ టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తోంది. టీవీ ఆఫ్ చేసి, మంచినీళ్ళు తాగింది. అత్తమ్మ, తను ఇందాకే టీ తాగారు. అపార్ట్‌మెంట్‌లో వినాయక నవరాత్రుల పూజలని ఆమె కిందికి వెళ్లారు. ఇంకో గంటకు గానీ రారు. సమయానికి భర్త అరుణ్ కూడా ఊళ్లో లేడు. ఉండీ ఉండీ పొత్తికడుపులో నొప్పి. చాలా భయమేస్తోంది. ముఖం కడుక్కుని, దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుంది. పెళ్ళైన ఏడేళ్లకు నిలిచిన గర్భం. ఏడుపొస్తోంది. ఊళ్లోనే ఉన్న అమ్మ సుమిత్రకు ఫోన్ చేసింది. వెంటనే అమ్మ, నాన్న, తమ్ముడు రాహుల్ వచ్చేశారు. దివ్య రెగ్యులర్‌గా చూపించుకునే హాస్పిటల్‌కి కాల్ చేస్తే, డాక్టర్ యూఎస్ వెళ్లారట. డ్యూటీ డాక్టర్స్ ఉన్నారట. డ్యూటీ డాక్టర్ తన డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఇంకో హాస్పిటల్ రిఫర్ చేశారు. అక్కడ దివ్యకు గర్భం జారకుండా స్టిచ్ వేస్తారని చెప్పారు. అది యూసుఫ్‌గుడ లోపలి కాలనీల్లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్. వెతుక్కుంటూ వెళ్లేసరికి డాక్టర్ వెళ్లిపోబోతున్నారు. అడ్మిట్ చేసుకుని సెలైన్ పెట్టారు. యూరిన్ టెస్ట్ చేసి, స్కాన్ చేసి భయం లేదని, పొద్దున్నే గర్భసంచికి ‘సర్‌క్లాజ్ స్టిచ్’ వేస్తానని మెడిసిన్స్, థియేటర్‌కి కావాల్సిన లిస్ట్ రాసిచ్చారు. దివ్య అమ్మగారు దివ్యకు ఇడ్లీ తినిపించి, అన్నం తినేసి అటెండెంట్ బెడ్‌పై నడుం వాల్చారు. టైమ్ పది దాటింది. అరుణ్ ఫోన్ చేశాడు. దివ్య కొంచెంసేపు మాట్లాడింది. బయట హాల్లో దివ్య తమ్ముడు స్టీల్ చైర్‌లో పడుకున్నాడు.
సలైన్ అయిపోవచ్చింది. సుమిత్ర లేచి సిస్టర్‌ని పిలుచుకొచ్చింది. సిస్టర్ నీడిల్ తీస్తూ దివ్యతో ‘మీరు జాబ్ చేస్తారా?’ అనడిగింది.
దివ్య ‘అవును’ అని చిన్నగా నవ్వింది. ఏం జాబ్ అని సిస్టర్ అడగలేదు. లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయింది.దివ్య ఆమె భర్త అరుణ్ ఇద్దరూ వెటర్నరీ డాక్టర్లు. వంద కిలోమీటర్ల దూరంలో మారుమూల గ్రామంలో పోస్టింగ్. సున్నితంగా, మంచి చుడిదార్లు వేసుకుని, పెద్ద బ్యాగ్‌తో ట్రైన్ ఎక్కే దివ్యను చూసి ఏ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే అమ్మాయో అని అనుకుంటారు. ఎవరైనా ఆశ్చర్యపోతే దివ్య నవ్వుకుంటుంది. తాము తమ వృత్తిని ఎంతో ప్రేమిస్తారు. వైద్యం చేసిన పశువు కళ్లలో మనుషుల్లో లేని కృతజ్ఞత కనబడుతుంది. బాధతో నోరులేని మూగ జీవి విలవిల్లాడితే దానికి ఉపశమనం అందించడం ఎంత గొప్ప విషయం. ‘ట్రెవిస్’ పైకి తీసుకురాగానే కంగారులో పశువు వేసే పేడకు డ్రెస్ అంతా పాడవుతుంది. దాన్ని కంట్రోల్ చేసే క్రమంలో అసిస్టెంట్లు ఉన్నా, దాదాపు ప్రతిసారీ గిట్టల చేత, కాళ్ల చేత డ్రెస్ చీరుకుపోవడమో, చేతులకు గాయాలవడమూ సహజమే. యానిమల్ తాలూకు తాళ్లు అరచేతుల్లో చీరుకుపోతాయి. అన్నింటికన్నా కష్టమైన పని పశువుల్లో ప్రెగ్నెన్సీ డిటర్‌మైన్ చేయడం. మనుషుల్లాగా యూరిన్ టెస్ట్ చేసి చెప్పడం సాధ్యపడదు. పొరపాటున పశువు గర్భం దాల్చలేదని చెబితే, రైతు దాన్ని అమ్మేసాక అది గర్భంతో ఉందని తెలిస్తే ఎంత పెద్ద గోలో! తనకు గర్భసంచి జారింది. జారదు మరి! ప్రతిరోజూ ప్లాట్‌ఫాం వైపు నుండి కాక ఎల్తైన మరో వైపు చిన్న స్టేషన్‌లో ఆగి ఆగకుండానే దూకడం, టైంకు అసిస్టెంట్ రాకుంటే చిన్నపాటి గుట్ట ఎక్కి దిగడం, తలచుకుంటేనే బాధ కలుగుతుంది.
అరుణ్ ‘షీప్ గ్రవుండింగ్’కి కర్ణాటక వెళ్లాడు. మొన్నటివరకు తనూ వెళ్ళేది. ఒక్కోసారి వారం నుండి పదిహేను రోజులు. అదొక పెద్ద ప్రహసనం. మేలురకం గొర్రెల్ని సెలెక్ట్ చేసి, వాటిని ఫొటోలు తీసి, ఎక్సల్‌లో అప్లోడ్ చేయాలి. చెవుల కిందుగా ట్యాగ్ వేయాలి. తరువాత వాటి లబ్ధిదారుల ఆధార్‌తో గొర్రెల్ని అనుసంధానించాలి. పెద్ద తతంగం. అరుణ్ రేపు ఆపరేషన్ టైమ్ కల్లా వస్తానన్నాడు. తొందరగా వస్తే బావుండు. ఈ స్టిచ్ ఎంత పెయిన్‌ఫుల్ గా ఉంటుందో. ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది.అర్ధరాత్రి. బయట ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. దివ్యకు మెలకువ వచ్చింది. సెల్ ఆన్ చేసి టైం చూసింది. రెండు కావొస్తోంది. అమ్మను లేపబోయి ఊరుకుంది. బాటిల్‌లోంచి మంచినీళ్లు తాగి, మెల్లగా డోర్ తీసుకుని బయటకు వచ్చింది. హాల్‌లో ముగ్గురు లంబాడీ స్త్రీలు, తలపాగాతో ఒక వ్యక్తి. అచ్చం తను పనిచేసే తండా వారి లాగానే ఉన్నారు. డెలివరీ కేసేమో. గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. దగ్గరకు వెళ్లాలనుకుంది కానీ, తల్లి పిలవడంతో లోపలికి వెళ్లింది.‘ఏమైందమ్మా..’ తల్లి కంగారుగా అడిగింది.‘ఏమీ లేదమ్మా. బయట చప్పుడైతే లేచాను. నువ్వు పడుకో’.
పొద్దున్న నాలుగు గంటలకు సిస్టర్ వచ్చి లేపింది. ఎనీమ ఇచ్చింది. నాలుగుసార్లు మోషన్‌కు వెళ్ళగానే సర్‌క్లాజ్‌కి కావలసిన ఏర్పాట్లు చేసింది. అరుణ్ వచ్చాడు. దివ్యను థియేటర్‌లోకి తీసుకెళ్లారు. గంటలో సర్జరీ అయిపోయింది. ఇంకా కొంచెం మత్తులోనే ఉంది. పూర్తిగా మత్తు వీడాక థియేటర్‌లో డాక్టర్, నర్సుల మధ్య సంభాషణ లీలగా విన్నట్టు అనిపించింది. తన శరీర కింది భాగమంతా మొద్దుబారినట్టు అనిపించింది. అలాగే కళ్లు మూసుకుంది.సాయంత్రం రూమ్‌లోకి షిఫ్ట్ చేశారు. తల్లి స్నానం చేసి భోజనం పట్టుకొస్తానని వెళ్లింది. పక్కన ఇంకో బెడ్ ఖాళీగా ఉంది. సడెన్‌గా దివ్యకు రాత్రి లంబాడీ వాళ్ళ సంగతి గుర్తొచ్చింది. తనంటే చుట్టు పక్కల తండా వాళ్లకు చాలా అభిమానం. గేదెలు, ఆవులు ఈనితే జున్ను పాలు, స్వచ్ఛమైన నెయ్యి తెచ్చిచ్చేవారు. చుట్టాలు వస్తున్నారంటే ఫోన్ చేస్తే గ్రామంలో ఖాసీం మంచి మటన్ పంపించేవాడు. పశువు ఈనడం కష్టమైతే ఒక్కోసారి రాత్రిళ్లు వాటి తాలూకు ఓనర్ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చేది. అప్పుడు వారు తనపట్ల ఎంతో గౌరవం చూపేవాళ్లు. అవునూ! ఇది ఫెర్టిలిటీ సెంటర్ కదా. ల్యాబ్‌లు కానీ, అలాంటి ఎక్విప్‌మెంట్ కానీ లెవేంటి? ఐవీఎఫ్ చేస్తారా.. ఆర్టిఫిషల్ ఇన్సెమినేషన్ చేస్తారా.. లేదా సరోగేసీ చేస్తారా....తను పనిచేసే గ్రామంలో విష్ణురెడ్డి దగ్గర బలిష్టమైన ఎద్దు ఉంది. ప్రతీ రైతు దగ్గర చూడి కోసం వెయ్యి రూపాయలకు తక్కువ తీసుకోడు.
డోర్ తెరుచుకుంది. సిస్టర్ బీపీ చెక్ చేసి సెలైన్ ఆపేసింది. పక్కన బెడ్‌పైకి ఒక అమ్మాయి వచ్చింది. జీన్స్ వేసుకుంది. పేషంట్‌లాగా లేదు. కూర్చుని ఫోన్ చూసుకుంటూ గడిపింది. ఒక గంటలో సిస్టర్ వచ్చి ఏవో పేపర్ల మీద ఆ అమ్మాయితో సంతకాలు పెట్టించుకుంది. దివ్య చాలా క్యూరియస్‌గా చూస్తోంది. ఆ అమ్మాయి నిర్లక్ష్యంగా చూయింగ్ గమ్ నములుతూ ఫోన్ చూసుకుంటోంది. కాసేపటికి ఆమె భర్త కాబోలు, ‘ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మార్నింగ్ ఫైవ్‌కి ఫ్లయిట్.’ చెప్పాడు. ఇద్దరూ సిస్టర్‌కి చెప్పి బయటకు వెళ్లారు. దివ్య అమ్మ, అత్తమ్మ వచ్చి తనకు వేడి జావ తాగించారు. అత్త ఉంటానన్నా దివ్య తల్లి వారించి, ‘తెల్లారి ఎలాగో డిశ్చార్జ్ అవుతాం కదా’ అని పంపేసింది. అరుణ్ బయట సోఫాలో పడుకున్నాడు.రాత్రి ఒకటిన్నర అయినట్టుంది. ఏడుపు చప్పుడుకు దివ్య లేచింది. పక్కన ఉన్న చిన్న రూంలోనుండి గుసగుసలు. చిన్నగా అడుగులు వేస్తూ అక్కడికి వెళ్ళింది. నిన్న చూసిన పెద్దవయసు లంబాడీ స్త్రీ చేతిలో మాసిన గుడ్డల్లో ఎర్రటి పసికందు. ఒక్కరోజు వాడేమో! మధ్యాహ్నం చూసిన అమ్మాయి చేతికి అందించింది. ఆ అమ్మాయి ఎక్సయిట్ అయి.. ‘ఎత్తుకోవాలంటే భయం’ అని నవ్వుతూ తల్లికి అందించింది. కొద్దిసేపట్లో బిడ్డను తీసుకొని వాళ్లు బయటకు నడిచారు.దివ్య గుండె స్పీడ్‌గా కొట్టుకుంటోంది. ఎందుకో ఏడుపొచ్చింది. మెల్లిగా వచ్చి బెడ్ మీద కూర్చుంది.తెల్లారి సిస్టర్‌ని పిలిచి, ‘ఆ అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమా, ఎందుకు బిడ్డను తీసుకెళ్లారు?’ అని రహస్యంగా అడిగింది. ‘లేదమ్మా! కానీ వాళ్లు చాలా కోటీశ్వరులట. మేనరికం మాత్రమే చేసుకుంటారట. బయటి వాళ్లను నమ్మరట. పిల్లలు ఏమైనా లోపాలతో పుడితే ఎట్లా అని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళ బంధువులకు గుడ్డి పిల్లవాడు పుట్టాడట. ఇంక రిస్క్ ఎందుకు అని ఇట్లా కొంటారు.’ చెప్పింది సిస్టర్. దివ్యకు అప్పుడు అర్థమయ్యాయి థియేటర్‌లో డాక్టర్ మాటలు – ‘ఏందట ముసల్దాని గోల. రెండు లక్షలు చాలవటనా’.
- రజిత కొమ్ము
ఫెర్టిలిటీ
Published Sun, Jul 29 2018 12:25 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment