
జీ... ఇక ఉర్దూ మేడ్ ఈజీ..!
ప్రయత్నం
మనిషికీ మనిషికీ మధ్య ఏకైక వారధి భాష. ప్రతి భాషకీ ఓ ప్రత్యేకత ఉంటుంది. చరిత్ర ఉంటుంది. ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో వెలుగులీనుతున్న ఉర్దూకున్న చరిత్ర గురించి, సుసంపన్నమైన ఉర్దూ సాహిత్యం గురించి చాలామందికి తెలుసు. అయితే పాలకుల నిర్లక్ష్యం, కరవైన ప్రోత్సాహం వల్ల ఆ భాష వచ్చినవారి సంఖ్య ఒకప్పటితో పోలిస్తే తగ్గుతోంది.
ఆసక్తి ఉన్నా నేర్చుకునే అవకాశాలూ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఉర్దూభాషా ప్రేమికులకోసం ప్రత్యేకంగా ఉర్దూ భాషను నేర్పిస్తూ అందరి మన్ననలూ పొందుతున్నారు ప్రొఫెసర్ ఖాలిద్ సయీద్. కొద్దిరోజుల్లోనే చాలా సరళంగా, సులభంగా ఆయన ఉర్దూ నేర్పే పద్ధతి, ఆయన దగ్గర భాష నేర్చుకుంటున్న విద్యార్థుల వివరాలు చూస్తే ఆసక్తిగా అనిపిస్తాయి.
‘‘ఉర్దూ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే... ముందు ఆ భాష నేర్చుకోవాలి కదా! తెలుగు మొదటి భాషగా నేర్చుకున్నాను, హిందీ రెండో భాషగా నేర్చుకున్నాను, ఇంగ్లీషుని ప్రపంచభాషగా నేర్చుకున్నాను. మరి ఉర్దూ ఎలా నేర్చుకోవాలి? దానికోసం ఉర్దూ యూనివర్శిటీలో చేరలేం కదా! ఖాలిద్‌గారి ఉర్దూ పాఠాల గురించి తెలియగానే వెంటనే వచ్చి చేరాను.
నా చిరకాల కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉర్దూ గజల్స్‌లోని సాహిత్యం తెలుసుకోవాలన్నది నా ఆశ’’. అరవై ఐదేళ్ల మహ్మద్ షాకీర్ హుస్సేన్ చెప్పిన మాటలివి. పీజీ కాలేజ్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఈ పెద్దాయన ఆరునెలల క్రితం ఉర్దూ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు.
హైదరాబాద్‌లోని నాంపల్లి బస్టాప్‌కి ఎదురుగా ఉన్న హజ్‌హౌస్‌లోని ఏడవ అంతస్థులో ఆయనలాంటి ఉర్దూ ప్రేమికులు చాలామంది కనిపిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ వారికి ఉర్దూ భాషను నేర్పిస్తున్నారు ఖాలిద్ సయీద్.
‘‘ఉర్దూ భాష నేర్చుకోవాలనే కోరిక చాలామందిలో ఉంది. ఉర్దూ అనగానే అది ఒక వర్గానికి చెందిన భాషగా అపోహ ఉంది. నిజానికి ఇది హిందుస్థానీ భాష. పదమూడు, పద్నాలుగవ శతాబ్దాల్లో రాసిన ఉర్దూ గజల్స్‌ని చదవాలని, అందులోని సాహిత్యాన్ని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలాంటివారంతా నా దగ్గర ఉర్దూ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వివిధ రంగాల్లో ఉన్న చాలామంది నాతో ఉర్దూపై తమకున్న ప్రేమను చాలా సందర్భాల్లో చెప్పేవారు.
అలాంటివారికి ఎలాగైనా ఉర్దూని నేర్పాలనుకుని ఇది మొదలుపెట్టాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ ఖాలిద్. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న 58 ఏళ్ల ఖాలిద్ ఉర్దూభాషా ప్రేమికుల మనసెరిగి ఐదేళ్ల నుంచి తన విశ్రాంతి సమయాన్ని ఉర్దూ భాషా బోధనకు కేటాయిస్తున్నారు.
ఆరు నెలలలో...
ఆయన అనుసరిస్తున్న విధానంలో ఉర్దూ చదవడం, రాయడం రావడానికి కేవలం ఆరునెలల సమయం చాలు. వారానికి ఒకరోజు చొప్పున పాతిక రోజుల్లో కోర్సు మొత్తం పూర్తవుతుంది. ‘లెర్న్ ఉర్దూ’ పేరుతో ఆయన ప్రత్యేకంగా ఓ పుస్తకం రూపొందించారు. ఇందులో 12 యూనిట్లు, 24 పాఠాలు ఉంటాయి. ఉర్దూ గజల్స్ అర్థం చేసుకోవాలంటే వాటికి ప్రత్యేక తరగతులుంటాయి. ఇప్పటివరకూ నాలుగు బ్యాచ్‌లకు భాష నేర్పిన ఖాలిద్ తన విద్యార్థులంతా వయసులో తనకన్నా పెద్దవాళ్లే అవడం తనకెంతో గర్వంగా ఉందంటున్నారు. నిజమే... సగంమందికిపైగా పదవీ విరమణ పొందినవారే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, హెడ్ మాస్టార్లు, లెక్చరర్లు, కంపెనీ డెరైక్టర్లు... వంటి పెద్దవాళ్లు ఇక్కడ ఉర్దూ నేర్చుకుంటున్నారు.
త్వరలోనే సాహిత్యబోధన
ప్రొఫెసర్ ఖాలిద్ దగ్గర ఉర్దూ భాష నేర్చుకుంటున్నవారిలో ఎనభై శాతంమంది ముస్లిమేతరులే. కస్తూర్బా కాలేజిలో సంస్కృతం లెక్చరర్‌గా పదవీ విరమణ పొందిన డాక్టర్ శశిరేఖ 77 ఏళ్ల వయసులో ఇక్కడ ఉర్దూ నేర్చుకుంటున్నారు. ‘‘నాకు తెలుగు, సంస్కృతం, మరాఠీ, హిందీ, గుజరాతీ భాషలు వచ్చు. ఉర్దూ నేర్చుకోవడం కుదరలేదు.
ఉర్దూ సంప్రదాయ భాష మాత్రమే కాదు సంపన్న భాష కూడా. ఆయన తయారుచేసిన పాఠ్యపుస్తకాలు చాలా సులువుగా ఉన్నాయి. అక్షరాలను రాయడం నుంచి పలకడం వరకూ ఆయన చెప్పే విధానం కూడా ఆసక్తి ఉంది’’ అని చెప్పారామె. ఉర్దూ భాషా ప్రేమికులకు ప్రొఫెసర్ ఖాలిద్ చేస్తున్న సేవ చాలా గొప్పది మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయేది కూడా. అలాగంటే... ఖాలిద్ ఒప్పుకోరు. ‘భాషను నేర్చుకోవడమే గొప్ప సేవ!’ అంటారు.
నెలకు వంద రూపాయల రుసుము మాత్రమే తీసుకుంటున్న ఖాలిద్ భవిష్యత్తులో ఉర్దూ సాహిత్యాన్ని కూడా నలుగురికీ బోధించాలనుకుంటున్నారు. ఇప్పటికే ఆయన తయారుచేసిన పాఠ్యపుస్తకంలో రాసిన కవితలు, కథలు అక్కడి విద్యార్థుల మనసు దోచుకున్నాయి. ఈ ప్రొఫెసర్‌గారి ఆశయం నెరవేరాలని, ఉర్దూ భాష ప్రేమికుల సంఖ్య మరింత పెరగాలని కోరుకుందాం.
- భువనేశ్వరి
ఫొటోలు: మోహన్
పదమూడు, పద్నాలుగవ శతాబ్దాల్లో రాసిన ఉర్దూ గజల్స్‌ని చదవాలని చాలామందికి ఉంటుంది. అలాంటివారంతా నా దగ్గర సరళమైన పద్ధతిలో ఉర్దూ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది.
- ఖాలిద్ సయీద్