స్మార్ట్ 'గాడ్'జట్స్ | gadjets for live tv using and whatsapp massages for god tunes and music | Sakshi
Sakshi News home page

స్మార్ట్ 'గాడ్'జట్స్

Published Sun, Oct 9 2016 11:55 PM | Last Updated on Fri, Jul 27 2018 1:39 PM

స్మార్ట్ 'గాడ్'జట్స్ - Sakshi

స్మార్ట్ 'గాడ్'జట్స్

స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్ మెసేజ్‌లు... శాటిలైట్ టీవీలోని లైవ్ టెలిక్యాస్ట్‌లు... ఫోన్‌లోనే స్తోత్రాల క్లిప్‌లు... అన్నీ ఈ న్యూ ఏజ్‌లో భక్తిపర్వానికి ప్రతీకలే.

స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సప్ మెసేజ్‌లు... శాటిలైట్ టీవీలోని లైవ్ టెలిక్యాస్ట్‌లు... ఫోన్‌లోనే స్తోత్రాల క్లిప్‌లు... అన్నీ ఈ న్యూ ఏజ్‌లో భక్తిపర్వానికి ప్రతీకలే. ఈ దసరా వేళ... సమయానికీ, సందర్భానికీ తగ్గట్లు వాట్సప్‌లో అమ్మ వారి అలంకారం ఫోటో సహా  తిథి వార నక్షత్ర వివరాలతో మెసేజ్‌లు ‘గాడ్’ మార్నింగ్ చెబుతున్నాయి. చకచకా ఫ్రెండ్స్‌కీ, రకరకాల గ్రూపులకీ ఫార్వర్డ్ అవుతూ, ఇతోధికంగా భక్తి భావాన్ని నలుగురికీ పంచుతున్నాయి. ఆడియో క్యాసెట్ తరం పోయి, స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌లో ఆడియో క్లిప్ వినే తరం వచ్చినవేళ... భక్తి ఇప్పుడు కొత్త ట్రెండ్స్‌తో జనంలో దూసుకుపోతోంది.

కవల పిల్లలైన ఇంద్రాణి, శర్వాణి... ఇద్దరూ నాలుగో తరగతే. ఇద్దరూ గడచిన ఆరేడు రోజులుగా ఎప్పటి కన్నా తొందరగా నిద్ర లేస్తున్నారు. స్కూళ్ళకు దసరా సెలవులు... బడి లేదు... ట్యూషన్లూ లేవు... ఇంట్లో ప్రత్యేకంగా వేరే పనీ లేదు. కానీ, ఈ చిన్న పిల్లలు తొందరగా ఎందుకు నిద్ర లేస్తున్నట్లు? గబగబా స్నానం చేసి, తయారై ఎక్కడికి వెళుతున్నట్లు?

‘మరే... మరే... ఈ పండగ టైమ్‌లో... తొమ్మిది రోజులూ... గుడికి వెళ్ళి, అమ్మ వారికి దణ్ణం పెట్టుకుంటే... చదువు బాగా వస్తుందట! మా డాడీ కూడా చిన్నప్పుడు ఇలాగే చేశాట్ట! మా మమ్మీ, తాతయ్య చెప్పారు’ అంటూ ముద్దుగా చెప్పారా పిల్లలు. ఆ ఇద్దరినీ హైదరాబాద్‌లోని తమ కాలనీలోనే... దగ్గరలో ఉన్న అమ్మ వారి గుడికి తీసుకువెళ్ళడం, ఏ రోజుకు ఆ రోజు అమ్మ వారికి వేసే ప్రత్యేక అలంకారాలు చూపించడం, వాటి గురించి చెప్పడం తల్లి రేఖకు వారం రోజులుగా నిత్యకృత్యం. ‘‘పిల్లలకు ఇప్పటి నుంచే మన పండుగలు, సంస్కృతి, దేవుడి మీద భక్తి, తప్పు చేయకూడదనే భయం అలవాటు చేయాలని మా ఇంట్లో అనుకుంటాం. చిన్నప్పుడు మనం తెలుసుకున్నవి, అలవాటు చేసుకున్నవి పిల్లలకు చెప్పి, అలవాటు చేస్తేనే కదా... వాళ్ళకూ అన్నీ తెలిసేది, మంచివాళ్ళుగా తయారయ్యేది’’ అని రేఖ అన్నారు.

ఇవాళ మన సంస్కృతీ సంప్రదాయాల గురించి పిల్లలకు ఎలా నేర్పాలా అని తపిస్తున్న కొత్త జనరేషన్ తల్లితండ్రులకూ, ఆ అలవాటులో దైవభక్తి పెరుగుతున్న పిల్లలకూ రేఖ కుటుంబం, ఆ కవల పిల్లలు ఒక చిన్న ఉదాహరణ.

స్మార్ట్‌ఫోన్‌లో... స్తోత్రాలు
నలభై అయిదేళ్ళ భవాని చిన్నప్పటి నుంచి భక్తి, పూజ, పురస్కారం ఇంట్లో అమ్మానాన్న చేసిన మంచి అలవాటు. ఆమె చేతికి ఈ మధ్యే ఒక కొత్త పరికరం వచ్చి చేరింది. ప్రేమగా భర్త ఆన్‌లైన్‌లో కొని ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ ఆమె రోజువారీ అలవాటుకు కొత్త రంగులు అద్దింది. తెలతెలవారుతుండగానే లేచి, వంటింట్లో పని చేసుకుంటూ భక్తి గీతాలు వినడం భవానికి అలవాటు. అందుకోసం కొన్నేళ్ళ క్రితం దాకా పాత క్యాసెట్ రికార్డర్ మీద ఆధారపడేది. క్యాసెట్ల నుంచి సీడీలకు మారినా, సీడీ ప్లేయర్ హాలులో ఉండడంతో, నిద్ర లేని మిగతావాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇబ్బంది పడేది.

కానీ, ఇటీవల భర్త కొనిచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్‌తో అమ్మవారి గీతాల ఆడియో క్లిప్‌లను ఇంటి పని చేసుకుంటూనే, ఫోన్‌లోనే పైకి వినిపించేలా స్పీకర్ మోడ్‌లో పెట్టి వింటోంది. ‘‘పండుగ రోజుల్లో పొద్దున్నే ఇంట్లో భక్తి వాతావరణానికి ఇది నాకో కొత్త ఫ్రెండ్. ఎవరినీ డిస్ట్రబ్ చేయకుండానే, నా భక్తి భావాన్ని తగ్గించుకోకుండానే పని చేసుకుంటున్నా’’ అని భవాని నవ్వుతూ చెప్పారు.

ఇంట్లోనే పురాణ ప్రవచనం
కాశీనాథుని జయలక్ష్మి గారికి టీవీ మంచి కాలక్షేపం. ఎనిమిది పదులు మీద పడిన ఆ పెద్ద ముత్తయిదువ నిన్న మొన్నటి వరకు మంచి సంగీత, భక్తి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా తప్పకుండా హాజరయ్యేవారు. ప్రసిద్ధ సినీ దర్శకుడు కె. విశ్వనాథ్, ఆమె కలసి ఆదిదంపతుల్లా ముందు వరుసలో కూర్చొని, కార్యక్రమం ఆసాంతం ఆస్వాదించి, ఆశీర్వదిస్తుంటే - కార్యక్రమ నిర్వాహకుల్లో కొత్త ఉత్సాహం. అయితే, మీద పడుతున్న వయసుతో ఇప్పుడు బయటకు రావడం తగ్గించుకున్న జయలక్ష్మికి టీవీలో అంతకు మించిన సత్కాలక్షేపం దొరికింది. వివిధ టీవీ ఛానళ్ళలో వచ్చే భక్తి ప్రవచనాలు ఆమెకిప్పుడు పెద్ద రిలీఫ్.

 ‘‘ఒకప్పుడు గుడికి వెళ్ళి, హరికథలూ, పురాణాలూ వినేవాళ్ళం. వయసు వల్ల అక్కడి దాకా వెళ్ళే ఓపిక లేని మా లాంటి పెద్ద వాళ్ళకు ఇప్పుడు ఇంట్లోనే నాలుగు మంచి మాటలు వినే వీలు చిక్కింది’’ అని కె. విశ్వనాథ్ అన్నారు. ఇవాళ కె. విశ్వనాథ్, జయలక్ష్మి దంపతులకే కాదు... అలాంటి కొన్ని లక్షల మందికి ఇలా ఇల్లే దేవాలయంగా, టీవీలో ప్రవచనమే సత్కాలక్షేపంగా మారింది.

 

ఇది ‘గాడ్’ మార్నింగ్!
ప్రతి రోజూ తన స్కూలు, కాలేజ్ ఫ్రెండ్స్‌కు నాలుగు మంచి మాటలతో ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్ పెట్టే అలవాటున్న విజయవాడ సత్యనారాయణపురం వాసి శంకరనారాయణకు ఈ పండుగ కొత్తగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లోని సోషల్ నెట్‌వర్క్ యాప్ ‘వాట్సప్’ పుణ్యమా అని ఇప్పుడు అతను ఏ రోజుకు ఆ రోజు దేశం నలుమూలల ఉన్న తన విజయవాడ ఫ్రెండ్స్‌కు వాట్సప్‌లో గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు పంపుతున్నాడు. పైగా... అదీ బెజవాడ కనకదుర్గమ్మ వారి ప్రత్యేక అలంకారాల ఫోటోలతో!

అమెరికాలో ఉన్న సురేఖకీ, ఆస్ట్రేలియాలో ఉన్న విజయమాధవికీ ఇప్పుడు విజయవాడనూ, కనకదుర్గమ్మనూ మిస్ అవుతున్నామన్న బెంగ కొంత తీరింది. తెలుగు గడ్డకు దూరంగా విదేశాల్లో తమ దగ్గరే పెరుగుతున్న తమ పిల్లలకు ఆ ఫోటోలు చూపిస్తూ, తమ చిన్నప్పటి సంగతులు చెప్పడం మంచి నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇస్తోంది.

వాట్సప్ దైవదర్శనం
ఓ ప్రముఖ పబ్లికేషన్ సంస్థలో చాలా ఉన్నతస్థాయి ఉద్యోగి ఎం. కృష్ణకిరణ్. చెన్నైలో పనిచేస్తుండగా, రోజూ దగ్గరలోని రాయపేట ‘గౌడీయ మఠం’ ఆలయానికి వెళ్ళేవారు. శ్రీకృష్ణ సందర్శనం చేసుకొనేవారు. అలా అక్కడి స్వామీజీలతో పరిచయం, దైవ సాన్నిధ్యంలో ప్రశాంతత అలవాటైపోయాయి. అలా కొన్నేళ్ళు సాగింది. ఉద్యోగరీత్యా అనుకోకుండా ముంబయ్‌కి షిఫ్ట్ అయ్యారు. చాలా కాలం తులసిమాలతో దీక్షలో ఉన్న ఆయనకు కృష్ణ దర్శనం దూరమవడం తెలియని వెలితిగా అనిపించసాగింది. ఆ మాటే మిత్రులతో పంచుకున్నారు. అంతే! గౌడీయ మఠం దగ్గరలో ఉండే ఆయన మిత్రులు కొందరు పరిష్కారం చూపించారు. రోజూ తాము గుడికి వెళ్ళి, గుడిలో దేవుడి అలంకారం ఫోటో తీసి, వాట్సప్‌లో పెడుతున్నారు.

కాలు కదపకుండానే... ప్రత్యక్ష వీక్షణం
ఒకప్పుడు స్కూల్‌లో టీచర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఇంటి పట్టునే ఉంటున్న అనంతపురం వాసి లక్ష్మికి భక్తి ఎక్కువే. పుణ్యక్షేత్రాలు చూడాలనీ, ఉత్సవాలు ప్రత్యక్షంగా దర్శించాలనీ ఈ గృహిణికి మహా కోరిక. భర్తకీ చాలా భక్తి. కాకపోతే, ఇంటి పరిస్థితులు, భర్త ఉద్యోగ పరిస్థితులు అనుకున్న ప్రతిసారీ అందుకు అనుమతించవు. రోజూ మూడు వేళలా ఇంట్లో పూజ, హారతి జరిపే ఈ దంపతుల అలవాటు. ప్రతి గురువారం ఇంట్లోనే సాయిబాబా పూజ, సత్సంగం సరేసరి! కానీ,  షిర్డీకి వెళ్ళడమంటేనే కుదరడం లేదు.

 ఈ విజయదశమికి కూడా అదే పరిస్థితి. కానీ, ఇప్పుడు లక్ష్మి లాంటి వారికి పెద్ద రిలీఫ్ - శాటిలైట్ భక్తి టీవీల ప్రత్యక్ష ప్రసారాలు. షిర్డీలోని సాయిబాబా నిత్య హారతుల దగ్గర నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, మథురలో కృష్ణాష్టమి వేడుకల దాకా ఏదైనా సరే ఇంట్లోనే కూర్చొని చూసే వెసులుబాటు వచ్చేసింది.

 వెరసి... ఇవాళ కనిపిస్తున్న భక్తి ధోరణుల్లో ఇలాంటివి అనేకం! జనరేషన్లు మారినా... అమ్మ ప్రేమ మారలేదు. అమ్మ వారి మీద భక్తీ మారలేదు. కాకపోతే, కాలానికి తగ్గట్లు కొత్త రూపం, రంగు, రుచి, వాసన మాత్రం సంతరించుకుంటున్నాయి. అంతే! హ్యాపీ దసరా!
- రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement