సభ్యత, సంస్కారం మరచి కామెంట్‌లు పోస్ట్ చేసేవారిని, ఇన్‌డీసెంట్ ప్రపోజల్స్ పంపేవారిని చట్టం పట్టుకోడానికి, శిక్షించడానికి సమయం పట్టొచ్చు. అయితే అలాంటి వ్యక్తుల మాటలకు నిశ్చేష్టులు కాకుండా మాటకు మాట ఇవ్వగలిగితే వారితో పాటు, మిగతావారినీ దారిలోకి తేవచ్చు. లేటెస్ట్‌గా బాలీవుడ్ నటి ఆలియాభట్ మాటకు మాటతో ఒక ‘ఎక్స్‌ట్రా’ను నోరు మూయించారు. రణ్‌బీర్ కపూర్‌తో ఆమె అఫైర్‌లో ఉందో లేదో తెలుసుకునేందుకు, ‘మిమ్మల్ని మేము ఆలియా కపూర్’ అని పిలవొచ్చా?’ అని ట్విట్టర్ చాట్‌లో హిమాంశు అనే వ్యక్తి చేసిన కామెంట్‌కు ‘మిమ్మల్ని.. నేను హిమాంశు భట్ అని పిలవొచ్చా?’ అని సుతిమెత్తని తిరుగు టపాల్ కొట్టారు ఆలియా. అలాగే గాయత్రి అనే టీవీ నటి స్మూత్ రిప్లయ్‌తో ఒక కుబుద్ధిని ‘ఢమాల్’ మనిపించి మళ్లీ తేరుకోకుండా చేశారు. గాయత్రి ఇచ్చిన ‘టిట్ ఫర్ టాట్’, ఈ ఏడాది ఆరంభంలో అమలాపాల్ ఇచ్చిన ‘షూట్ ఎట్ సైట్’.. సోషల్ మీడియాలో ఈ ఏడాది సంచలనం రేపాయి.
గాయత్రి అరుణ్ యువ టీవీ నటి. ఏషియానెట్‌లో ఏళ్లుగా ప్రసారం అవుతున్న ‘పరస్పరం’ సీరియల్‌లో దీప్తీ ఐపీఎస్‌గా ఆమె పోషిస్తున్న పాత్రకు కేరళలో ప్రతి ఇల్లూ పెద్ద ఫ్యాన్. అమ్మాయి కూడా ఒరిజినల్‌గా అందంగా ఉంటుంది. 2014లో ‘పరస్పరం’ సీరియల్‌తో గాయత్రి కెరీర్ ప్రారంభం అయింది. ఆ తర్వాత ఏడాదే ఏషియానెట్ ‘బెస్ట్ న్యూ ఫేస్ అవార్డు’ గెలుచుకుంది. గాయత్రికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బ్రేవ్ గర్ల్. ఈ సంగతి ఇటీవలి వరకు ఎవరికీ తెలియదు. బాగా యాక్ట్ చేస్తుంది. నవ్వు చక్కగా ఉంటుంది. ఇంతవరకే తెలుసు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. నన్ను ప్రేమించగలరా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకుంటారా? అంటూ వేలకు వేలుగా ఆమెకు ప్రపోజల్స్ వస్తుంటాయి. అయితే ఈ మధ్య నేరుగా ఆమె పర్సనల్ ఫోన్‌కి ఓ మెసేజ్ వచ్చింది. ‘నాతో ఒక రాత్రి గడుపుతారా? రెండు లక్షలు ఇస్తాను. ఈ విషయం మన మధ్యే ఉంటుంది’ అన్నది ఆ మెసేజ్. ఆ వెంటనే రెండో మెసేజ్ కూడా వచ్చింది. ‘టూ లాక్స్ జస్ట్ ఫర్ వన్ అవర్’ అని! గాయత్రి షాక్ తిన్నారు.
పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం తర్వాతి మాట. ముందు వాడికి బుద్ధి చెప్పాలి. ఆమెకు చాలా కోపంగా ఉంది. వెంటనే రిప్లయ్ పెట్టింది. వాడి మెసేజ్‌లను, తన రిప్లయ్‌ని కలిపి డిసెంబర్ 10న ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘ఎంత మంచి రిప్లయ్!’ అని గాయత్రికి ప్రశంసలు మొదలయ్యాయి. ‘వాడిక చచ్చినా.. ఆడవాళ్లకు ఇలాంటి మెసేజ్ పెట్టడు. అంత బాగా బుద్ధి చెప్పారు’ అని మరికొన్ని కాంప్లిమెంట్స్. అయితే గాయత్రి రిప్లయ్ పెట్టి, ‘టిట్ ఫర్ ట్యాట్’ అని మౌనంగా ఉండిపోలేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది. ఒక్క గంటకు రెండు లక్షలు ఇస్తానని గాయత్రికి మెసేస్ పెట్టినవాడి పేరు రోహన్ కురియాకోస్. ధైర్యంగా తన పేరు కూడా చెప్పుకున్నాడు. ఇంతకీ మిస్టర్ రోహన్ కురియాకోస్‌కి గాయత్రి ఇచ్చిన రిప్లయ్ మెసేజ్ ఏంటి? అది చివర్లో చూద్దాం. కేరళలోని అలప్పుళ గాయత్రి జన్మస్థలం.
చేర్తాళ ఆమె చదువుకున్న ఊరు. చదువులో ఫస్ట్. ఆటల్లో ఫస్ట్. అభినయంలోనూ ఫస్ట్. స్టేట్ స్కూల్స్ యూత్ ఫెస్టివల్‌లో ‘ఉత్తమ నటి’ అవార్డు కూడా వచ్చింది. డిగ్రీ అయ్యాక ‘కమ్యూనికేటివ్ ఇంగ్లిష్’లో జర్నలిజం చేసింది. తర్వాత ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో కొన్నాళ్లు పని చేసింది. ఇంకో విషయం.. గాయత్రికి పెళ్లైంది. అవును. ఆమె పేరు పక్కన ఉన్న అరుణ్.. ఆమె భర్తే. అతడు ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. ఇంకో విషయం. ఆమెకో కూతురు కూడా ఉంది! పేరు కల్యాణి. ఊపిరి సలపనివ్వని షూటింగ్‌లు పూర్తయ్యాకక నేరుగా ఇంటికొచ్చి రిలాక్సేషన్ కోసం కూతురుతో ఆడుకుంటుంది గాయత్రి. ఇవన్నీ కేరళైట్‌లకు తెలియకుండా ఏమీ లేవు. అయినా అతడెవరో అలాంటి మెసేజ్‌లు పెట్టాడు. ‘ఒక్కరాత్రి నాతో ఉంటావా? ఒక్క గంటలకు రెండు లక్షలు ఇస్తాను’ అని!
అందుకు గాయత్రి ఇచ్చిన రిప్లయ్
‘నేను ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా మీ మదర్‌ని / సిస్టర్‌ని గుర్తుపెట్టుకుంటాను. వాళ్లకెలాంటి అవమానం జరగకూడదని ఆ దైవాన్ని ప్రార్థిస్తాను’. హృదయాన్ని టచ్ చేసే రిప్లయ్ ఇది. ఆ రోహన్ నిజంగా మనిషైతే కనుక ఆ రోజంతా ఇంట్లో ఒక్కడే కూర్చొని తలుపులు వేసుకుని ఏడ్చి ఉంటాడు. మరి గాయత్రిని అలా రిప్లయ్ ఇవ్వవలసిన స్థితిలోకి నెట్టిన అతడి మెసేజ్‌లు ఆమె హృదయానికి మరెంత గాయం చేసి ఉంటాయో కదా! అది ఆలోచించాలి ఎవరైనా. సినీతారలు ఒకప్పుడు స్క్రీన్ మీద మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఆటోగ్రాఫ్ కావాలని అభిమానులు ఎవరైనా ఉత్తరం రాస్తే, సంతకం ఉన్న ఫొటో ఒకటి తిరుగు పోస్టులో వచ్చేది. అక్కడికే పరమానందం.
ఇప్పుడీ సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు, సామాన్యులకు మధ్య ఉన్నది ఒక్క మెసేజ్ దూరమే. ఆరాధించేవాళ్లకూ, వాంఛించేవాళ్లకు ఒకే రకమైన సౌలభ్యం ఉండడంతో సెలబ్రిటీలకు మనశ్శాంతి కరువవుతోంది. అవాంఛనీయమైన మెసేజ్‌లకు ఒక చోట చెక్ పాయింట్ ఉంటే మధ్యలోనే అవి ఆగిపోతాయి. ఇక నేరుగా ‘సంప్రదించేవాళ్లకు’ ఐపీసీ సెక్షన్‌ల ‘గౌరవాలు’ ఎలాగూ ఉంటాయి. చాటున ఉండి ‘మాట’ వేసే వాళ్లకు ‘తిరుగు మాటే’ శిక్ష, సమాధానం. ఏదైనా..విషయమైతే బయటికి రావాలి. అప్పుడే ‘బ్యాడ్ ప్రపోజల్స్’ చేసేవాళ్లకు భయం ఉంటుంది.
దీప్తీ ఐపీఎస్ లాంటి అమ్మాయే అమలాపాల్ కూడా!
ఈ ఏడాది మొదట్లో అమలాపాల్ విషయంలో జరిగింది. ‘నీతో గడపాలని ఉంది’ అని డైరెక్ట్‌గా ఆమె ప్రాక్టీస్ గదిలోకే వచ్చి అడిగాడు ఒక ఆగంతకుడు. డ్యాన్స్ ప్రాక్టీస్ సెషన్ అది. ప్రాక్టీస్‌కి వెళుతుంటే వెంట పడ్డాడు. ప్రాక్టీస్ రూమ్‌లోకి వెళ్లగానే వెనకే వెళ్లాడు. ప్రాక్టీస్‌కి సంబంధం ఉన్న మనిషి అన్నట్లే ఆమెను మాట్లాడించాడు. చివరికి అన్నాడు.. ‘నాకు చాలా పలుకుబడి ఉంది. ఒక రాత్రికి నాతో గడుపుతావా?’’ అని. ఖిన్నురాలైంది అమలాపాల్. అక్కడికక్కడ ‘షూట్ ఎట్ సైట్’లా ఆమె.. పోలీస్ రిపోర్ట్ ఇస్తే వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. పేరు అలగేశన్. సెక్షన్ 354ఎ (లైంగిక వేధింపు), సెక్షన్ 509 (అసభ్యకరమైన సంకేతాలు ఇవ్వడం) కింద, మహిళల్ని వేధించడంపై తమిళనాడుకే ప్రత్యేకంగా నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద అతడిపై కేసులు పెట్టారు.
అమలాపాల్ దక్షిణాది చిత్రాల కథానాయిక. పుట్టింది కేరళలోని కొచ్చిలో. ఉండడం ఢిల్లీలో. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలన్నిటిలో కలిపి ఇప్పటి వరకు ముప్పై ఐదుకు పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. అవార్డులకైతే లెక్కేలేదు. వయసు ఇరౖ ఏడు. 2014లో తమిళ్ డైరెక్టర్ విజయన్‌ని పెళ్లి చేసుకున్నారు. 2016లో ఏవో మనస్పర్థలతో విడిపోయారు. ‘పరస్పరం’ సీరియల్‌లో దీప్తీ ఐపీఎస్‌లా.. అమలాపాల్ నిజ జీవితంలో తన కుటుంబంలోని పరిస్థితులతో నెగ్గుకు వస్తున్నారు. మధ్యమధ్య.. ఇదిగో ఇలాంటి చికాకులు.
Comments
Please login to add a commentAdd a comment